ఫోక్స్ వ్యాగన్ స్కాంపై సీబీఐ దాఖలు చేసిన కేసులో అంతా అప్పట్లో.. ఏపీఐఐసీ వీసీ, ఎండీగా ఉన్న .. ఎల్వీ సుబ్రహ్మణ్యానికి తప్పు జరగవద్దని ఆదేశించానని.. అయినా తప్పు జరిగిపోయిందని…అంతా ఎల్వీనే చేశారన్నట్లుగా.. మంత్రి బొత్స సత్యనారాయణ.. సీబీఐ కోర్టులో సాక్ష్యం చెప్పడం.. ఏపీ అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా.. చెప్పారా.. అని.. నిందితుల తరపున న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు.. బొత్స నోటి మాట ద్వారానే చెప్పినట్లుగా తేల్చేశారు. అంటే.. దానికి లిఖితపూర్వకమైన ఆధారం కూడా లేదు. వశిష్ట వాహన్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదిలీ చేయడం… అది ఫేక్ కంపెనీ అని స్పష్టం కావడంతో.. సీబీఐ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిధుల బదిలీ విషయంలో అప్పట్లో పరిశ్రమల మంత్రిగా ఉన్న తన ప్రమేయం లేదని చెప్పుకోవడానికి బొత్స.. ప్రయత్నించినట్లుగా తెలుస్తోందని న్యాయవాద వర్గాలు చెప్పాయి.
వశిష్టవాహన్ కంపెనీకి ఈక్విటీ కింద.. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఓ ఎస్క్రో ఖాతాను ప్రారంభించాలని చెప్పానని.. బొత్స తన సాక్ష్యంలో పేర్కొన్నారు. అయితే… ఓ ఎస్క్రో ఖాతాలో కాకుండా ఇతర బ్యాంక్ అకౌంట్లో జమ చేసేలా మంత్రిగా ఉన్న బొత్స కార్యాలయం నుంచి.. ఏపీఐఐసీకి లేఖ వెళ్లింది. ఇదే విషయాన్ని లాయర్లు ప్రశ్నించారు. అయితే.. బొత్స మాత్రం.. ఈ ప్రశ్నకు సమాధానం గుర్తు లేదని చెప్పుకొచ్చారు. తనకు తెలియదన్నారు. దాదాపుగా తాను చెప్పాలనుకున్నది చెప్పిన బొత్స.. లాయర్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ మాత్రం.. తెలియదు.. గుర్తు లేదు అనే సమాధానాలతో సరి పెట్టారు. ఫోక్స్ వ్యాగన్ స్కాంలో కీలక నిందితుడైన.. జగదీశ్ అలగరాజాతో.. తనకు అంతకు ముందు నుంచీ పరిచయం ఉందని.. బొత్స సత్యనారాయణ కోర్టులో అంగీకరించారు. అంతకు ముందే కొన్ని ప్రాజెక్టుల కోసం.. తనని అలగరాజా కలిశారని… బొత్స తెలిపారు.
ఫోక్స్ వ్యాగన్ కేసులో స్కాం జరిగిందని స్పష్టమైన సమయంలో… బొత్స సత్యనారాయణ కేసు తన వైపు రాకుండా ఉండేందుకు .. అధికార వర్గాలపైనే ప్రధానంగా.. అనుమానాలు కలిగేలా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. అప్పట్లో పరిశ్రమల మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయమ ప్రత్యక్ష ప్రమేయం వల్లే.. ఇదంతా జరిగిందనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యం తప్పే అన్నట్లుగా.. బొత్స.. వాంగ్మూలం ఇవ్వడం.. అధికారవర్గాల్లోనూ హైలెట్ అవుతోంది. దీనికి సంబంధించి.. సీబీఐ కోర్టు .. తదుపరి విచారణ అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.