భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా .. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్చలు జరపలేదు. అదంతా అబద్దం. తూచ్.. అంటూ.. కంగారు కంగారుగా… నిన్న నేరుగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయమే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన చూసి..ఆశ్చర్యపోవడం జర్నలిస్టుల వంతయింది. ఎందుకంటే.. గత నాలుగు నెలల కాలంలో.. ఆంధ్రప్రదేశ్‌ని అనేక రకాల సమస్యలు చుట్టుముట్టాయి. వరదలొచ్చాయి. రాజధానిపై రచ్చ జరిగింది. హైకోర్టుపైనా జరుగుతోంది. ఇలా ఎన్ని జరిగినా.. స్పందించని.. ఏపీ సీఎంవో… బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుకున్నారనే వార్త రాగానే.. ఉలిక్కిపడిపోయింది. ఖండన ప్రకటన విడుదల చేసింది.
ప్రజా ఆందోళనలపై సీఎంవో స్పందన ఒక్కటి కూడా లేదేమి…?
జగన్మోహన్ రెడ్డి నాలుగు నెలల పాలనలో… ప్రజలందర్నీ ప్రభావితం చేసే… అనేక సమస్యలు ఏపీని చుట్టుముట్టాయి. అధికారం చేపట్టగానే.. విత్తనాల కొరత వచ్చింది. దాని గురించి పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి సమీక్ష చేయలేదు. సీఎంవో ప్రకటన చేయలేదు. అది మొదలు… ఏపీకి సంబంధించి.. అనేక సమస్యలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందులో మొట్టమొదటిది ఇసుక. కొత్త ఇసుక విధానం వచ్చేసిందన్నారు కానీ.. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోతోంది కానీ.. ఏపీలో మాత్రం… బ్లాక్ మార్కెట్లోనే దొరుకుతోంది. దీని గురించి కొన్ని లక్షల మంది ఆందోళన చెందుతున్నారు. రోజుకూలీ చేసుకునే కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. అయినప్పటికీ.. సీఎంవో స్పందించలేదు.
అమరావతి, హైకోర్టు తరలింపు వార్తలపై ఓ క్లారిటీ ఇవ్వలేదేమిటి..?
రాజధానిని తరలించబోతున్నారని.. కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణే అగ్గి అంటించారు. ఆ తర్వాత వివాదాస్పద ప్రకటనలతో.. అనేక సార్లు అనుమానాలు రేకెత్తించారు. వీటిపై తెలుగు, ఇంగ్లిష్, జాతీయ పేపర్లోనూ.. విస్తృతమైన ప్రచారం జరిగింది. కానీ… ముఖ్యమంత్రి కార్యాలయం.. ఒక్క సారంటే.. ఒక్క సారి కూడా.. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు.. హైకోర్టును రాయలసీమకు తరలించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు అమిత్ షాకు లేఖ ఇచ్చారని… జాతీయ ఇంగ్లిష్ దినపత్రికలు ప్రచురించాయి. దాంతో లాయర్లు ఆందోళన చేస్తున్నారు. అయినా.. సీఎంవోకు.. ఇదంతా వినోదాత్మకంగా ఉంది. వారి ఆందోళన పట్టలేదు. కనీసం స్పందించలేదు. తమకు ఆందోళన కలిగించే వార్త.. వచ్చే సరికి.. వెంటనే ఖండన ప్రకటన విడుదల చేశారు.
ఉద్యోగాల భర్తీపై ఇంత గందరగోళం జరుగుతున్నా నోరు మెదపరెందుకు..?
గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎంత గందరగోళం ఉందో.. ప్రజలందరూ చూస్తున్నారు. పరీక్ష రాసిన 20 లక్షల మంది మాత్రమే కాదు.. ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా పరీక్ష నిర్వహణ తీరుపై అనుమానపడాల్సి వస్తోంది. అయినా… సీఎం స్పందించలేదు. ప్రజలందరి జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే… దుందుడుకు నిర్ణయాలు .. శాంతిభద్రతల సమస్యలు.. ఏపీలో వస్తున్నాయని… విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అంతే కాదు.. సీజనల్ వారీగా వచ్చే సమస్యలూ చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వ పరంగా కనీస సన్నద్ధత లేదు. ఇలాంటి వాటిపై స్పందించి… తక్షణం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుంది. తనకేమీ పట్టనట్లుగా.. ముఖ్యమంత్రి వ్యవహరించడం… ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయడమే.
అమిత్ షా ఆరా తీశారన్న ప్రచారం వల్లే స్పందించాల్సి వచ్చిందా..?
సమస్య తనదాకా వస్తేనే… తనకు నొప్పి తగిలితేనే.. స్పందించాలన్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి శైలి అనే విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్‌తో జరిపిన భేటీ అధికారిక సమాచారం కాదు. కేవలం రాజకీయ వ్యూహాల కోసం.. జరిగిన భేటీ అని.. విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో కొన్ని ఆర్థిక పరమైనవీ ఉండొచ్చని చెబుతున్నారు. దీనిపై.. బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి పూర్తి వివరాలు సేకరించారనే సమాచారం బయటకు రాగానే… ఖండిస్తూ.. అధికారికంగా సీఎంవో ప్రకటన విడుదల చేసిందని.. అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇదే చురుకుదనం.. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎందుకు ఉండదు..?