ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆసుపత్రిలో చేరే సమయానికే ఆరోగ్యం బాగా క్షీణించింది. వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందించారు వైద్యులు. అయినా కాపాడలేకపోయారు. దాదాపు 600 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన వేణుమాధవ్ తెలుగునాట గుర్తింపు పొందిన హాస్యనటుల్లో ఒకరు. 1996లో సంప్రదాయం చిత్రంతో నటుడిగా అడుగుపెట్టిన వేణుమాధవ్ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్రహ్మానందం, అలీ, కృష్ణభగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల హవా సాగుతున్నప్పుడు కూడా తనదైన శైలితో, విలక్షణమైన టైమింగ్‌తో అవకాశాల్ని చేజిక్కించుకుని కామెడీ కుటుంబంలో తనకంటూ ఓ స్థానం దక్కించుకున్నారు.
‘ఛత్రపతి’, ‘దిల్’, ‘సై’, ‘సింహాద్రి’, ‘లక్ష్మి’ చిత్రాలు నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ‘లక్ష్మి’తో ఉత్తమ హాస్యనటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డుని అందుకున్నారు. తనకు సినీ జీవితం ప్రసాదించిన ఎస్.వీ కృష్ణారెడ్డి.. హీరోగానూ మార్చారు. అలీతో కలసి హీరోగా నటించిన ‘హంగామా’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరవాత వచ్చిన ‘భూకైలాస్’ కూడా ఓకే అనిపించింది. ఈ సినిమాలిచ్చిన స్ఫూర్తితో ‘ప్రేమాభిషేకం – వీడికి కాన్సర్ లేదు’ అనే పేరుతో ఓసినిమాని నిర్మించి, అందులో హీరోగా నటించారు. అయితే ఆ సినిమా ఆర్థికంగా విజయాన్ని అందుకోలేకపోవడంతో బాగా నష్టపోయారు. ఆ క్రమంలో కొత్త తరం హాస్యనటులు వెల్లువలా రావడంతో అవకాశాలు తగ్గాయి. దాంతో పాటు ఆయన ఆరోగ్యం కూడా బాగా పాడైంది. ఓ దశలో వేణుమాధవ్ చనిపోయినట్టు పుకార్లు రేగాయి. ‘నేను బాగానే ఉన్నాను నన్ను చంపకండి’ అంటూ ఆయన మీడియాముందుకొచ్చి మొర పెట్టుకోవాల్సివచ్చింది. ఈమధ్య ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి ఆసుపత్రిపాలయ్యారు. కొన్ని రోజులు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆ తరవాత ఆరోగ్యం మళ్లీ పాడైంది. దాంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చివరికంటూ ప్రయత్నించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.