ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ వదిలి పెట్టడం లేదు. పీపీఏల విషయంలో జగన్ వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్న ఆయన.. బహిరంగంగా.. కూడా విమర్శలు చేశారు. మరో సారి.. నేరుగా జగన్‌కే లేఖ రాశారు. చంద్రబాబు హయాంలో పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లలో అవినీతి జరిగిందంటూ… ప్రధానమంత్రికి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ లేఖ ఇచ్చారు. ఆ లేఖ విషయంపై.. ఆర్కేసింగ్.. జగన్ కు రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అధిక టారిఫ్‌లకు పీపీఏలతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకుని కమిషన్లు తీసుకున్నారనేది.. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. దీనిపై లేఖలో ఆర్కేసింగ్ సూటిగా… స్పందించారు. డిస్కంల నష్టానికి అధిక టారిఫ్ కారణం కానే కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇతర కారణాల వల్లే డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని తేల్చి చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో పీపీఏలకు ఇంతకంటే అధిక ధరలు చెల్లిస్తున్నారని లెక్కలతో సహా గుర్తు చేశారు.
పీపీఏల టారిఫ్‌ల నిర్ణయం గాలివేగం, సౌర థార్మికత… ప్లాంట్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని జగన్ కు.. ఆర్కేసింగ్ మరోసారి గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం మూడు కంపెనీలకే 70శాతం కేటాయింపులు చేశారన్న వాదనల్లో నిజంలేదని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని కంపెనీలు మిగతా కంపెనీలను… టేకోవర్ చేయడం వల్లే విద్యుత్ ఉత్పాదకత పెంచుకున్నాయని .. ఇందులో ప్రభుత్వానికి ఏంటి సంబంధమని… ప్రశ్నించారు. ధర్మల్ పవర్ ప్రస్తుతం… రూ.4.20పైసలకే నేడు వస్తోందని.. అయినా ఎక్కువ ధర పెట్టి.. సంప్రదాయేతర విద్యుత్ కొన్నారన్న జగన్ ఆరోపణలపైనా.. ఆర్కే సింగ్ సూటిగా సమాధానం చెప్పారు. ఇప్పుడు రూ. .4.20కే రావొచ్చు కానీ.. 20 సంవత్సరాల తర్వాత యూనిట్ రూ. 22 అవుతుందన్నారు.
పవన విద్యుత్ ఎప్పుడూ రూ.4.80కే లభిస్తుందని గుర్తు చేశారు. పీపీఏల పునఃసమీక్ష, చేస్తున్న ఆరోపణలు… సాంప్రదాయేతర విద్యుత్ రంగాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆర్కేసింగ్ .. ఏపీ ముఖ్యమంత్రిని మరోసారి హెచ్చరించారు. ఓ వైపు హైకోర్టు తీర్పు.. మరో వైపు కేంద్రం లేఖతో.. పీపీఏల సమీక్ష విషయంలో ఏపీ సర్కార్ ముందడుగు వేయలేని పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది.