ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్రబాబును ప్రభుత్వం ఉన్న పళంగా బదిలీ చేసేసింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అటు సురేంద్రబాబును అలా ట్రాన్స్ ఫర్ చేసి.. డీజీపీ ఆఫీసుకు పంపగానే.. ఇటు ఆర్టీసీ నుంచి 350 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. ఎలక్ట్రిక్ బస్సులు అనగానే.. సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మేఘా కంపెనీనే గుర్తుకు వస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ లో రివర్స్ టెండరింగ్ లో… రూ. 700 కోట్ల వరకూ డిస్కౌంట్ ఇచ్చి పనులు చేసేందుకు అంగీకరించినందుకు… ప్రతిఫలంగా ప్రభుత్వం.. మేఘా కృష్ణారెడ్డికి చెందిన కంపెనీ నుంచి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి.. ఆ కంపెనీ నెట్ వర్త్ ను పెంచేందుకు సహకరించబోతోందని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే టెండర్లు పిలిచే సమయానికి.. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును సంస్థ నుంచి బయటకు పంపారు.
ఆర్టీసీ నష్టాల బాట నుంచి బయట పడేసేందుకు ఎస్వీ సురేంద్రబాబు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఎండీగా నియమితులైన ఆయన… సంస్థ నష్టాలను కారణాలు వెదికి… దుబారా తగ్గించి.. వీలైనంతగా జవాబుదారీ తనం పెంచే ప్రయత్నం చేశారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా.. సురేంద్రబాబుకు.. అధికారవర్గాల్లో పేరుంది. ఆయన ఉంటే.. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లు తాము అనుకున్న వాళ్లకి దక్కేలా చేయలేమని అనుకున్నారేమో కానీ ఉన్నపళంగా ట్రాన్స్ ఫర్ చేసేశారన్న గుసగసలు సెక్రటేరియట్లో బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
రొటీన్‌గా జరిగే బదిలీలు… ఖాళీగా ఉన్న అధికారులకు పోస్టింగ్ ఇవ్వడానికి… అదునపు బాధ్యతలు మోస్తున్న అధికారులకు రిలీఫ్ ఇవ్వడానికి సహజంగా.. ఇలాంటి బదిలీ చేస్తూంటారు. లేకపోతే.. అధికారవర్గాన్ని ప్రక్షాళన చేయాడానికి చేస్తూంటారు. అయితే.. ఈ సారి మాత్రం… ఒకే ఒక్క సీనియర్ అధికారిని టార్గెట్ చేసి.. బదిలీలు చేసినట్లుగా తెలుస్తోంది. ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరున్న సురేంద్ర… తర్వాత డీజీపీ అవడానికి ఎక్కువ అవకాశాలున్న అధికారి. ఆయనను ఆర్టీసీ ఎండీగా కూడా ఉంచకపోవడం ఆసక్తి కలిగిస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లు ఇక నుంచి హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.