కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి వివాదం హైకోర్టుకు చేరింది. సీఆర్డీఏ ఇచ్చిన నోటీసులపై ఇంటి యజమాని లింగమనేని రమేష్ హై కోర్టుకు వెళ్లారు. కరకట్ట వెంబడి ఉన్న పలు కట్టడాల మాదిరిగానే చంద్రబాబు అద్దెకుంటున్న నివాసం ఉంటున్న భవనం కూడా అక్రమంగా నిర్మించిందేనని సి ఆర్ డిఎ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల పై ఇంటి యజమాని లింగమనేని రమేష్ తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, ఉండవల్లి పంచాయితీ, రివర్ కన్జర్వేటర్ నుంచి వచ్చిన అనుమతి పత్రాలను జతచేసి సిఆర్ డిఎ కమిషనర్ కు లేఖ రాశారు. లింగమనేని రమేష్ ఇచ్చిన వివరణతో సిఆర్డీఎ సంతృప్తి చెందలేదని, తాము లేవనెత్తిన కొన్ని అంశాలకు పూర్తి వివరణ కూడా లేదని, స్పష్టం చేశారు.
వారం రోజుల్లో చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసంలో మొదటి అంతస్తు, కింది అంతస్తు, స్విమ్మింగ్ పూల్, డ్రస్సింగ్ రూమ్ లను కూల్చివేయాలని, లేని పక్షంలో తామే కూల్చివేయాల్సి వస్తుందని నోటీసులు జారీ చేశారు. దీనిపై ఏపీ సీఎంకు లేఖ రాసిన..లింగమనేని.. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు పూర్తిగా సాగక ముందే విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. అప్పటి వరకు కట్టడం పై ఎటువంటి చర్యలు ప్రభుత్వం వైపు నుంచి తీసుకోబోమని, అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం హైకోర్టుకు మౌఖిక హామీ ఇచ్చారు.
మరో వైపు.. జగన్మోహన్ రెడ్డికి లింగమనేని రాసిన లేఖపై.. వైసీపీ తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు అండతోనే లింగమనేని ఇలాంటి లేఖలు రాస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. అసలు ఎలాంటి అనుమతులు లేవని… అది ప్రభుత్వ భూమి అని ఆయన వాదిస్తున్నారు. లింగమనేని ఇంటి వివాదం.. మరికొన్ని రోజులు.. హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది.