ముంబై ప్రేలుళ్ళ సూత్రధారి ఉగ్రవాది హఫీజ్ సయీద్, పఠాన్ కోట్ పై దాడులకు తమదే బాధ్యత అని చెప్పుకొంటున్న యునైటెడ్ జిహాదీ కౌన్సిల్ నాయకుడు సయీద్ సల్లాఉద్దీన్ రెండు రోజుల క్రితం పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో “భారత్ పై పఠాన్ కోట్ వంటి దాడులు చేయబోతున్నామని, అందుకు కాశ్మీరీ వేర్పాటువాదులకు తగిన శక్తి ఉందని” చెప్పారు.
దానిపై తీవ్రంగా స్పందించిన భారత రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ చాలా ఆసక్తికరమయిన, గంభీరమయిన విషయాలు చెప్పారు. భారత్ పై దాడులు చేయడానికి ఉగ్రవాదులను పంపేవారి ఇళ్ళలోకి జొరబడి మరీ ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. పఠాన్ కోట్ తో సహా దేశంలో జరిగిన ఉగ్రవాదుల దాడులకు బాధ్యులయిన వారిపై నేరుగా దాడులు చేసేందుకు భారత్ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిందని చెప్పారు. తాలిబాన్ ఉగ్రవాదుల నేత ఒసామా బిన్ లాడెన్ న్ని అమెరికా ఏవిధంగా మట్టు బెట్టిందో భారత్ కూడా అదేవిధంగా ఉగ్రవాదులపై ప్రతిదాడులు చేసి మట్టు పెడుతుందని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదుల దాడుల వలన భారత్ ఎంతగా బాధ పడుతోందో అంత బాధని ఉగ్రవాదులు కూడా అనుభవించేలా చేస్తామని హెచ్చరించారు.
రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారిక్కర్ ఇదేదో మాట వరసకి అన్న మాటగా భావించలేము. ఇదివరకు భారత్-పాక్ మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్నప్పుడు, పాక్ అధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని విడిపించుకోవాలని ఆలోచిస్తున్నామని భారత్ చెప్పింది. ఆ నేపధ్యంలో చూస్తే రక్షణ మంత్రి చెప్పిన మాటలు నూటికి నూరు పాళ్ళు నిజమేనని భావించవలసి ఉంటుంది. ఏదో ఒక రోజు భారత సేనలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై దాడులు చేసి అక్కడ తిష్ట వేసుకొన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి సిద్దం అవుతున్నట్లు భావించవచ్చును. అదే కనుక నిజమయితే అది చాలా సాహసోపేతమయిన, చాలా ప్రమాదకరమయిన నిర్ణయమే అవుతుంది.