ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ మీద మరొకసారి విరుచుకుపడ్డారు. రైతులకు మోడీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్న డబ్బులని, వైయస్సార్ భరోసా అంటూ తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకుంటూ, వైకాపా పార్టీ స్టిక్కర్ వేసుకోవడాన్ని ఆక్షేపిస్తూ కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు.
కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేస్తూ, “జగన్ మీరు మరో స్టిక్కర్ సీఎం కాకండి.మ్యానిఫెస్టోలో మీరు రైతులకు రూ.12500 ఇస్తానని ప్రకటించారు. కానీ నేడు మోదీ గారు రైతులకు ఇచ్చే రూ.6000 లను కలుపుకుని ‘వైఎస్సార్ రైతు భరోసా’గా కేంద్రం రైతులకు ఇచ్చేదానిపై బాబు లాగా మీరు స్టిక్కర్ వేయడం తప్పు. రైతు భరోసాకు మోదీ గారి పేరు పెట్టండి.” అని రాసుకొచ్చారు.
గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో కూడా టిడిపికి బిజెపికి మధ్య సంబంధాలు చెడిపోవడానికి ప్రధాన కారణం ఇదే. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాల పేరు మార్చి చంద్రబాబు నాయుడు తన పథకాలు గా ప్రచారం చేసుకుంటున్నాడు అంటూ అప్పట్లో పురందరేశ్వరి తీవ్రంగా విమర్శలు చేసేవారు. మరి ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్న ఈ విమర్శల పర్యవసానం ఎలా ఉంటుందో వేచి చూడాలి.