వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరు మార్చాల్సిందేనా..? మోడీ రైతు భరోసా అనో… మోడీ- వైఎస్సార్ రైతు భరోసా అనో పేరు పెట్టాల్సిందేనా..? అంటే.. కచ్చితంగా .. మార్చాల్సిందే అంటున్నారు బీజేపీ నేతలు. రైతు భరోసా పేరుతో.. రైతులకు.. ఏపీ సర్కార్ ఇవ్వాలనుకుంటున్న రూ.12,500లో రూ. ఆరు వేలు కేంద్ర ప్రభుత్వానివి. ఆ విషయం ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. తాము రూ. ఆరు వేల ఐదు వందలు మాత్రమే ఇస్తామని.. మిగతావి కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించినవని.. ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు.. వైఎస్ఆర్ ఒక్క పేరే ఎందుకని.. ప్రధాని మోడీ పేరు కూడా పెట్టాలని.. బీజేపీ నేతలు డిమాండ్లు ప్రారంభించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ట్విట్టర్ ద్వారా… ఈ డిమాండ్ వినిపించారు. ఇతర నాయకులూ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
రైతు భరోసా పథకాన్ని ఓ ఫ్లాగ్ షిప్ స్కీమ్‌గా.. ప్రచారం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ సన్నాహాలు ప్రారంభించింది. అక్టోబర్ పదిహేనో తేదీన.. అందరికీ చెక్కుల పంపిణీ ప్రారంభించబోతోంది. పథకం ప్రారంభోత్సవానికి నరేంద్రమోడీని ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ సారి.. ప్రధానిని కలిసినప్పుడు.. సీఎం జగన్ ఆహ్వానించారు. అయితే.. పీఎంవో నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీలేదు. విజయసాయిరెడ్డి.. పీఎంవో అధికారులతో మాట్లాడి… పథకం ప్రారంభోత్సవానికి వచ్చేలా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు… రైతు భరోసాకు మోడీ పేరు పెట్టాలనే డిమాండ్ వినిపించడం… ఆసక్తి రేకెత్తిస్తోంది. గతంలో.. చంద్రబాబు హయాంలో.. చంద్రన్న బీమా సహా.. పలు కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగానే చంద్రబాబు .. సర్కార్ ప్రచారం చేసింది. దీనిపైనా.. అప్పట్లో బీజేపీ నేతలు రచ్చ చేశారు. చివరికి చంద్రన్న బీమా లాంటి పథకాల పేర్లను .. పీఎం చంద్రన్న బీమాగా మార్చారు.
మరికొన్ని పథకాలకూ.. పేరు మార్చక తప్పలేదు. అయితే ప్రభుత్వ పరంగా చేసిన ప్రచారంలో మాత్రం.. ఆ మార్పులకు ప్రాధాన్యం దక్కలేదు. అందుకే.. బీజేపీ నేతలు.. చంద్రబాబును స్టిక్కర్ సీఎంగా అభివర్ణించేవారు. కేంద్ర పథకాలకు తమ స్టికర్ వేసుకుంటున్నారని అనేవారు. ఇప్పుడు ఇలాంటి స్టిక్కర్ సీఎం కావొద్దంటూ.. కన్నా సూటిగానే చెప్పుకొచ్చారు. స్వయంగా కేంద్రం ఇస్తున్న సొమ్ములను… కూడా.. వైసీపీ తన క్రెడిట్ ఖాతాలో వేసుకునేందుకు రూ. 12500 ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నందున.. బీజేపీ.. ఏ మాత్రం ఊరుకునే అవకాశం కనిపించడం లేదు. పథకానికి మోడీ పేరు పెట్టాలనే డిమాండ్‌ను వినిపించడం ప్రారంభించారు. పథకం ప్రారంభమయ్యే సరికి పెట్టక తప్పకపోవచ్చనే అభిప్రాయం.. అధికారవర్గాల్లో ఏర్పడుతోంది.