అర్జున్ – ఓ ‘రా’ ఏజెంట్. కరాచీలో దాక్కున్న ఓ కరుడుగట్టిన తీవ్రవాది కోసం వేట మొదలెడతాడు. అయితే తాను ఏ దేశం కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడో, ఆ దేశంలోనే తానో హంతకుడిగా ముద్ర వేయించుకోవాల్సివస్తుంది.
మరోవైపు రామకృష్ణ కథ. అతనో బ్యాంకు ఉద్యోగి. బాసు పెట్టే పరీక్షలు, ఓ అందమైన అమ్మాయి నుంచి ఎదురయ్యే స్వీటు టార్చర్లు.. వీటి మధ్య నలిగిపోతుంటాడు. వీరిద్దరూ చూడ్డానికి ఒకేలా కనిపిస్తుంటారు. మరి ఇద్దరూ ఒక్కరేనా, ఒక్కడే ఇద్దరిలా నటిస్తున్నాడా? కరాచీలో ఓ భారతీయుడు సాగించిన పోరాటం ఏమిటో తెలియాలంటే మాత్రం `చాణక్య` చూడాలి. గోపీచంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. తిరు దర్శకత్వం వహించాడు. మెహరీన్ కథానాయిక. అక్టోబరు 5న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది. ఉగ్రవాదంపై ఓ రా అధికారి చేసిన పోరాటం ఇది. యాక్షన్ హంగామాకి ఎక్కువ స్కోప్ ఉంది. తెరపై అదంతా కనిపిస్తోంది. అయితే.. సునీల్, రఘుబాబు బ్యాక్ ఉండడంతో కామెడీ కూడా వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. హీరోయిన్ (మెహరీన్) పాత్ర నుంచి ఎంటర్టైన్మెంట్ పిండుకున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి కథల్లో ట్విస్టులు, టర్న్‌లు ఆశిస్తారు. అవి కూడా తోడైతే – `చాణక్య` అనే టైటిల్‌కు సార్థకత చేకూరుతుంది. యాక్షన్ సినిమాలకు ఎప్పటికీ గిరాకీ బాగానే ఉంటుంది.కాకపోతే సరైన కూర్పు కుదరాలి. మరి `చాణక్య`గా గోపీచంద్ ఏం చేస్తాడో చూడాలి.