సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మీద తెరాస అధినాయకత్వానికి నిజామాబాద్ తెరాస నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పార్టీకి వ్యతిరేకంగా ఆయన కార్యకలాపాలు ఉంటున్నాయనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఓ తీర్మానం చేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి పంపించారు. అయితే, ఇదంతా దాదాపు ఏడాదిన్నర కిందట జరిగిన తతంగం. ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు డి. శ్రీనివాస్. మీడియాతో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో పార్టీ మార్పు గురించి సందర్భం వచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మీరు ఆ మధ్య కలిశారు కదా, పార్టీ మార్పు గురించే చర్చించారా అనే ప్రశ్నపై స్పందించారు. అమిత్ షాని తాను కలిసింది భాజపా కార్యాలయంలో కాదనీ, పార్లమెంటు ఆవరణలో అని చెప్పారు. ఆయన హోంమంత్రి కాబట్టి, ఒక ప్రజా ప్రతినిధిగా మాత్రమే ఆయనతో మాట్లాడాననీ, పార్టీ మార్పు గురించి ఎలాంటి చర్చా చెయ్యలేదన్నారు.
ఏది ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడు జరుగుతుందనీ, పార్టీ మారాలని అనుకుంటే, ఆ సమయం వస్తే ఎవరు ఆపినా అది ఆగదన్నారు. అలాంటి సందర్భం వస్తే ఆరోజే మాట్లాడతా అన్నారు డీఎస్. తనని పార్టీలోకి తీసుకుని కేసీఆర్ చాలా కష్టపడ్డారనీ, ఆ వివరాల్లోకి తాను ఇప్పుడు వెళ్లదల్చుకోలేదన్నారు. నిజామాబాద్ నేతలు తెరాస అధినాయకత్వానికి ఫిర్యాదు చేసి ఏడాదిన్నర అయిందనీ, ఇంతవరకూ పార్టీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని గుర్తుచేశారు. ఆ ఫిర్యాదు మీద భవిష్యత్తులో కూడా తెరాస నుంచి స్పందన వస్తుందనే నమ్మకం తనకు లేదన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ… అక్కడ డిఫరెంట్ రాజకీయం నడుస్తోందనీ, ప్రజలు తీర్పు విభిన్నంగా ఉంటుందన్నారు.
ఎప్పుడో చేసిన ఫిర్యాదు గురించి ఇప్పుడు డీఎస్ గుర్తు చేయడం ఆశ్చర్యంగా ఉంది! అంటే, తనపై చర్యలు తీసుకోలేదని తెరాస అధినాయకత్వానికి గుర్తు చేస్తున్నారా..? చర్యలు వారికి సాధ్యం కాదని ఎద్దవా చేస్తున్నారా..? ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని అన్యాపదేశంగా కోరుతున్నారా..? నిజానికి, డీఎస్ పై చర్యలు అనే టాపిక్ ఇప్పుడు తెరాసలో కూడా లేదు. అలాగని, సీఎం కుమార్తె కవిత మీద ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచిన తరువాత డీఎస్ ని తమ నాయకుడిగా తెరాస భావిస్తున్నదీ లేదు. ఎప్పటికైనా ఆయన కూడా భాజపా గూటికే అనే ధోరణి కనిపిస్తోంది! ఒకవేళ ఆయన తెరాసను వీడితే… రాజ్యసభ స్థానం ఖాళీ అవుతుందనే అంచనాలున్నాయి. ఇంత ఉన్నా కూడా తెరాస చర్యలకు దిగే పరిస్థితి లేదు. ఎందుకంటే, అది పరోక్షంగా భాజపాకి వ్యతిరేక చర్యే అవుతుంది కదా! మరి, ఇప్పుడీ టాపిక్ మాట్లాడటం ద్వారా డీఎస్ ఆశిస్తున్నది ఏంటో… ఆ వ్యూహమేంటో?