అక్టోబరు 2న ‘సైరా’ విడుదల అవుతోంది. అయితే ఈ విడుదల సాఫీగా సాగుతుందా? లేదంటే స్పీడు బ్రేకర్లు ఎదురవుతాయా? అనే అనుమానాలు, గందరగోళాలూ చాలానే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన హక్కుల విషయంలో ఓ వర్గం పోరాటం చేస్తూనే ఉంది. తమకు ఆర్థిక సహాయం అందిస్తామని, రామ్ చరణ్ మాటిచ్చారని, ఇప్పుడు అదేం లేకుండా సినిమాని విడుదల చేయడం అన్యాయం అని కోర్టు కెక్కారు. సినిమా విడుదలకు ముందు తమకు చూపించి అనుమతులు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నాయి. అయితే ఈలోగానే ‘సైరా’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఆ సెన్సార్ సర్టిఫికెట్ కూడా చిత్రబృందం చేతికి అందింది. ఇక.. ‘సైరా’ విడుదలకు అడ్డుకోవడం కష్టమైన పనే. కాకపోతే విడుదలకు ముందు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయమై కోర్టు ఎలా స్పందిస్తుందా అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న.
వందేళ్లు పూర్తి చేసుకున్న ఓ వ్యక్తి చరిత్రని సినిమాగా మలిచే విషయంలో ఎవరి అనుమతులూ తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రింకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. ‘ఆ కథపై మాకు హక్కులు ఉన్నాయి’ అంటూ ఎవరూ ఆ సినిమాని అడ్డుకోకూడదని గట్టిగా చెప్పింది. ఆ తీర్పే.. సైరా దర్శక నిర్మాతల ఆయుధంగా మారింది. పైగా ‘ఇది జీవిత చరిత్ర కాదు. ఓ వ్యక్తి తాలుకూ ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని సినిమాగా మలిచాం’ అని దర్శకుడు సురేందర్ రెడ్డి న్యాయ స్థానం ముందు తన వాదన వినిపించడంతో ‘సైరా’పై బయోపిక్ ముద్ర పడకుండా, ఆ హక్కుల కోసం ఎవరి నుంచి ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా జాగ్రత్త పడ్డారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని కమర్షియల్ కోణంలో చెప్పాల్సివచ్చినప్పుడు సినిమాటిక్ లిబర్టీలు చాలా తీసుకోవాల్సివస్తుంది. అవన్నీ పరిగణలోనికి తీసుకుంటే.. ‘సైరా’ని బయోపిక్ అనకూడదు కూడా. ఈ వాదనే చిత్రబృందం బలంగా వినిపిస్తోంది.
నిజానికి సినిమాని విడుదలకు ముందే ఎవరిని చూపించడానికైనా ‘సైరా’ బృందం సిద్ధంగానే ఉంది. కాకపోతే.. ‘మాకు సినిమా చూపించండి’ అంటూ ఇప్పటి వరకూ ఎవరూ దర్శక నిర్మాతల్ని సంప్రదించలేదట. ఇదంతా కోర్టు వ్యవహారం కాబట్టి, ఒకవేళ కోర్పు ‘విడుదలకు ముందు ఉయ్యాలవాడ వంశీకులకు సినిమా చూపించి, అనుమతులు తీసుకోండి’ అంటే ఆ ఆజ్ఞని తు.చ తప్పకుండా పాటించాల్సిందే. ఈ వివాదంలో మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఓబులేషు అనే అనుచరుడు ఉన్నాడు. ఉయ్యాలవాడ ప్రయాణంలో తను కీలకమైన వ్యక్తి. ఆ పాత్రని ఎలా తీర్చిదిద్దారో చూపించాల్సిందే అని ఓబులేషు వంశస్థులు సైతం గొడవ చేస్తున్నార్ట. అసలు ఈ సినిమాలో అలాంటి పాత్ర ఉందా, లేదా? అనేది మాత్రం ఇప్పటి వరకూ తెలీలేదు. మరోవైపు ఓ వర్గం ‘సైరా’ చిత్రబృందాన్ని బ్లాక్‌మెయిలింగ్‌కి గురి చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాము అడిగినంత మొత్తం ఇస్తే… తప్ప శాంతిచమని, విడుదలకు ముందే ఇలాంటి గొడవలు సృష్టిస్తామని నేరుగానే చిత్రబృందాన్ని హెచ్చరించినట్టు సమాచారం. అయితే.. ఆ వర్గం అడిగిన మొత్తం మరీ ఎక్కువగా ఉందని, అందుకే చిత్రబృందం స్పందించలేదని తెలుస్తోంది. ఈమధ్య రామ్‌చరణ్ కూడా `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. మేం ఏమైనా చేయాలనుకుంటే ఆ గ్రామానికో, ఆ ప్రాంతానికో చేస్తాం` అని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇదే.
‘సైరా’ షూటింగ్‌కి ముందు రామ్‌చరణ్, చిరంజీవిలు ఉయ్యాలవాడ సందర్శించారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మాటిచ్చార్ట. మరీ ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని స్థాపించాలని అనుకున్నార్ట. దానికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉయ్యాలవాడ వంశస్థులు కూడా ఇంతకు మించి మరేం కోరుకోవడం లేదని, కేవలం డబ్బుమీద ఆశతో కొంతమంది అడ్డుతగలడానికి ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. `సైరా` విడుదలకు ముందున్న ఈ అవరోధాల్ని ఎలా తొలగించుకుంటాడో చూడాలి.