హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఇప్పుడు అక్కడే ఫోకస్ పెడుతున్నారు. ప్రముఖులంతా అక్కడే ఉండి ప్రచారానికి సిద్ధమౌతున్నారు. తెరాస కూడా ఈ ఉప ఎన్నికను సీరియస్ గానే తీసుకుంది. సొంత ఇలాఖాలో ఉత్తమ్ భార్య పద్మావతిని ఓడించాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా హుజూర్ నగర్ వెళ్లి ప్రచారం చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న చర్చ ఏంటంటే… కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్తారా వెళ్లరా అని?
పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే దాన్ని రేవంత్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అక్కడ్నుంచే రేవంత్ మీద ఉత్తమ్ కొన్ని విమర్శలు చేయడం, పార్టీలో కొత్తగా చేరినవారు మాటలను సీరియస్ గా తీసుకోనక్కర్లేదనడం, ఆయనకి తోడుగా కోమటిరెడ్డి జానారెడ్డి లాంటి నేతలు కలవడం జరిగింది. అయితే, హుజూర్ నగర్ విషయమై ఉత్తమ్ వ్యాఖ్యల మీద రేవంత్ పెద్దగా పట్టుదలగా ఉన్నట్టు లేరు. మొన్ననే, ఖమ్మంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనీ, తామంతా ఆ స్థానాన్ని కాపాడుకుని తెరాసకు బుద్ధి చెబుతామన్నారు. వ్యక్తిగత విభేదాల సంగతి ఎలా ఉన్నా, ఎన్నికలు దగ్గరకి వచ్చేసరికి వాటిని పక్కనే పెట్టి, పార్టీ ముఖ్యం అన్నట్టుగా రేవంత్ వైఖరి కనిపిస్తోంది.
హుజూర్ నగర్లో ప్రచారం చేయాలంటూ తనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానిస్తే వెళ్లడానికి సిద్ధమే అని సన్నిహితులతో రేవంత్ చెప్పినట్టు సమాచారం. అయితే, రేవంత్ ని ఉత్తమ్ ఆహ్వానిస్తారా అనేదే అసలు ప్రశ్న? ఎందుకంటే, రేవంత్ ప్రచారం చేయడం వల్ల హుజూర్ నగర్లో గెలిచామనే అభిప్రాయం ఉండకూడదనేది ఆయన పట్టుదలగా కాంగ్రెస్ నేతలు కొందరు చెబుతున్నారు! కేవలం తన కృషి వల్లనే గెలిచామన్నది ఆయనకి కావాల్సిన ఇమేజ్. పార్టీపరంగా చూసుకుంటే రేవంత్ ప్రచారానికి రావాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే, సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రచారానికి వస్తుంటే…. వారికి ధీటుగా మాట్లాడాలంటే రేవంత్ ని ఆహ్వానించాలనేది కొందరి అభిప్రాయం. ఈ విషయంలో భేషజాలకు పోవాల్సిన అవసరం లేదని కూడా ఉత్తమ్ కు కొందరు చెప్పినట్టూ సమాచారం. వ్యక్తిగత విభేదాలను దాటి రేవంత్ ని ఉత్తమ్ ఆహ్వానిస్తారా లేదా అనేది చూడాలి.