భారతీయ జనతా పార్టీ టీడీపీకి దగ్గరవుతుందేమో.. అన్న సందేహం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి.. ఆ పార్టీ నేతలకు గట్టిగానే పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అటు పోలవరం విషయంలో.. ఇటు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో రాష్ట్ర ప్రభుత్వంతోనే క్లీన్ చిట్ ఇప్పించింది కేంద్రం. పోలవరంలో తప్పులేమీ జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తీసుకుంది. అలాగే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లలో ఎన్నో అవకతవకలు జరిగాయని.. జగన్మోహన్ రెడ్డి పెద్ద లేఖను ప్రధానికి ఇస్తే… దానికి రిప్లయ్‌గా ఎలాంటి అక్రమాలు జరగలేదని..సమాధానం పంపారు. దీంతో.. వైసీపీకి అనుమానం ప్రారంభమయింది. టీడీపీతో చెలిమి ..తమకు ఇబ్బందికరం అవుతుందన్న అంచనాలో.. వైసీపీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే.. తన పత్రికలో ఎడిటోరియల్ పేజీలన్నీ… అలాంటి కథనాలతోనే నింపుతున్నారు.
గతంలో దేవులపల్లి అమర్, ఏబీకే వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులతోనూ.. ఇదే తరహా ఎడిటోరియల్ ఆర్టికల్స్ రాయించారు. కొత్తగా ఏపీ విఠల్తోనూ రాయించడం ప్రారంభించారు. బాబుతో చెలిమి అనర్థదాయకం అంటూ.. డైరక్ట్ హెడ్లైన్ పెట్టి ఆర్టికల్ ప్రచురించారు. దానికి కమలంలో చంద్రబాబు కత్తితో పొడుస్తున్నట్లుగా కార్టూన్ వేశారు. కానీ ఇందులో విశేషం ఏమిటంటే.. ఈ ఆర్టికల్‌లో మొదటి మూడు, నాలుగు కాలమ్‌లు.. మోడీని..మోడీపాలనను విమర్శిస్తూ ఆర్టికల్ ప్రచురించారు. మోడీ అమెరికాలో చెప్పినట్లు అంతా బాగోలేదనే భావన కల్పించడానికి రచయిత ప్రయత్నించారు. దీనికి.. భారత్ వెలిగిపోతోంది.. అన్న నినాదానికి లింక్ పెట్టారు. దీన్నుంచి చంద్రబాబుతో బీజేపీ పొత్తు మంచి కాదనే సందేశానికి వెళ్లారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు.. బీజేపీలో చేరినప్పటి నుండి సాక్షికి ఈ భయం కనిపిస్తూ ఉంది. వారు… బీజేపీని తమ నుంచి దూరం చేస్తారని.. వైసీపీ నేతలు భయపడుతున్నారు. వైసీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోకుండానే.. ఆపార్టీ నుంచి గరిష్ట ప్రయోజనం పొందింది. చంద్రబాబును ఓడించడానికి.. వైసీపీ ను గెలిపించడానికి బీజేపీ గరిష్ట ప్రయత్నాలు చేసింది. సక్సెస్ అయింది. ఈ క్రమంలో లబ్దిపొందింది వైసీపీనే. ఆ లబ్ది ఎప్పటికి ఉండాలి.. బీజేపీకి ఎలాంటి లాభం రాకూడదని వైసీపీ ప్రయత్నిస్తున్నట్లుగా అందుకే ఇలాంటి ఆర్టికల్స్ రాయిస్తోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇంత చేసి..ఈ ఆర్టికల్ రచయిత విఠల్.. మార్క్సిస్ట్ విశ్లేషకులట. ఆయన బీజేపీకి ఇబ్బంది కలిగితే… ఇబ్బంది పడుతూ.. ఆర్టికల్ రాయం మరో విచిత్రం..!