ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న కల్లం అజేయరెడ్డిపై గురి పెట్టారు. పీపీఏల విషయంలో జరిగిన రచ్చ అంతా ఆయన పుణ్యమేనని చంద్రబాబు నమ్ముతున్నారు. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో.. గత ఆంధ్రప్రదేశ్ సర్కార్ తప్పేమి లేదని.. కేంద్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన లేఖ పంపడంతో… చంద్రబాబుకు నైతిక మద్దతు లభిస్తోంది. తప్పుడు సమాచారాన్ని పోగేసి.. ప్రధానమంత్రికి లేఖ రాశారని.. ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేసినవారు ఎప్పటికైనా శిక్షార్హులేనని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ ఒత్తిడి చేస్తే తప్పులు చేస్తారా.. అని అధికారులను ప్రశ్నించారు.
పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లలో అవినీతి అంటూ.. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఫీడ్ బ్యాక్ ఇచ్చి.. ఆ అంశాన్ని మొదటి నుంచి హైలెట్ చేసేలా చేసిన..జగన్ కోటరీలోని వ్యక్తి కల్లం అజేయరెడ్డి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు, మూడు నెలల పాటు.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఆయన …రిటైరైన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాంప్‌లో చేరారు. మొదటి నుంచి పీపీఏల విషయాన్ని ఆయనే డీల్ చేస్తున్నారు. అవినీతి పేరుతో.. లేఖలను కూడా ఆయనే సిద్ధం చేశారని చెబుతున్నారు. కంపెనీలతో ఎలా వ్యవహరించాలో కూడా.. ఆయనే సీఎంకు దిశానిర్దేశం చేశారని.. సమీక్షకు ఏర్పడిన కమిటీకి కూడా ఆయనే నాయకత్వం వహించారంటున్నారు. అయితే.. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో.. అవినీతి ఆరోపణలే కానీ.. నిరూపించడానికి సరైన ప్రయత్నాలు చేయలేకపోయారు. కనీసం ఒక్కటంటే. ఒక్క ఆధారం చూపించలేకపోయారు.
దీంతో.. పీపీఏల విషయంలో జగన్ పరిస్థితి ఆరు నెలలు సాధన చేసి.. మూలనున్న ముసలమ్మను కొట్టినట్లయింది. అందుకే జగన్ కూడా… కల్లం అజేయరెడ్డిపై అసంతృప్తితో ఉన్నారని.. కొద్ది రోజుల్లో ఆయన తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో.. చంద్రబాబు కూడా.. అందుకున్నారు. పీపీఏలపై తప్పుడు సమాచారంతో.. ప్రధానికి లేఖ రాసిన… తప్పు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కాకపోతే.. తర్వాతైనా శిక్ష తప్పదని హెచ్చరికలు పంపుతున్నారు. దీంతో అధికారవర్గాల్లో ఆందోళన ప్రారంభమయింది.