భారతీయ జనతా పార్టీ పొడ కూడా గిట్టని పరిస్థితికి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేరిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీలో ఉండి.. తమ ప్రభుత్వంపై… కుట్ర చేస్తున్నారని.. దగ్గుబాటి పురంధేశ్వరిపై అనుమానం పెంచుకున్న వైసీపీ పెద్దలు… దగ్గుబాటి వెంకటేశ్వరరావును, ఆయన కుమారుడ్ని.. పార్టీలో పొమ్మనకుండా పొగపెడుతున్నారు. పర్చూరులో పరాజయం తర్వాత అక్కడ ఇన్చార్జ్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నప్పటికీ.. పార్టీ వ్యవహారాన్ని ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్ చూసుకుంటున్నారు. అయితే.. హఠాత్తుగా.. పర్చూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత రావి రామనాథం బాబుకు జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమాచారం.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇవ్వలేదు. కనీసం ఆయనను చేరికల కార్యక్రమానికి ఆహ్వానించలేదు.
నిజానికి జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలకే సమయం ఇవ్వడం లేదు… అలాంటిది .. ఓ మామూలు టీడీపీ నేతను చేర్చుకోవడానికి ప్రత్యేకంగా సమయం ఇవ్వడం ఆశ్చర్యకరమే. అయితే.. ఈ రావి రామనాథం బాబు నిఖార్సయిన టీడీపీ నేత కాదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు వైసీపీలోకి ఎంట్రీ రావడంతో.. బయటకు వచ్చేసిన వైసీపీ నేత. ఆయన పర్చూరు వైసీపీ బాధ్యతలను చాలా కాలం పాటు చూసుకున్నారు. ఎన్నికలకు ముందే.. జగన్ హ్యాండివ్వడంతో… టీడీపీలో చేరారు. ఆయన చేరికతో.. టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావుకు కొంత బలం వచ్చింది. దాంతో… ఆయన విజయం సాధించారు. అయితే.. ఇప్పటికిప్పుడు.. ఆయనను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేకపోయినా.. దగ్గుబాటికి చెక్ పెట్టాలని జగన్ నిర్ణయించుకోవడంతో… రావి రామనాథం బాబును పిలిచి మరీ మరోసారి పార్టీలో చేర్చుకున్నారు. రేపో మాపో ఆయనకు.. ఇన్చార్జ్ పదవి ఇవ్వబోతున్నారు.
దీంతో.. దగ్గుబాటికి వైసీపీతో అనుబంధం క్లోజ్ అయినట్లేనని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో.. బీజేపీతో వైసీపీ సంబంధాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. స్వయంగా పురంధేశ్వరి కూడా పలు మార్లు.. సందర్భం వచ్చినప్పుడల్లా.. జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ కోణంలో.. మిగిలిన దగ్గుబాటి కుటుంబీకులకు పార్టీలో పొగ పెట్టేయడం మంచిదని జగన్ భావించినట్లుగా తెలుస్తోంది.