ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్ టెండర్ల విషయంలో కరెంట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. అటు ఆర్టీసీకీ 350 ఎలక్ట్రిక్ బస్సులను 12 ఏళ్ల పాటు అద్దెకు తీసుకునేందుకు టెండర్లు పిలిచారు. అన్నేళ్ల పాటు అద్దెకు ఎందుకు.. నేరుగా కొనుగోలు చేస్తే సరిపోతుంది కదా.. అని పదో తరగతి పిల్లవాడికి వచ్చే సందేహం. కానీ ప్రభుత్వ పెద్దలకు మాత్రం.. ఎంత ఖర్చయినా సరే అద్దెకు తీసుకోవడమే ఇష్టం. ఇప్పుడు.. ఆ ఫార్ములాను… తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోనూ అమలు చేస్తోంది. టీటీడీకి కూడా.. ఓ మూడు వందలో..నాలుగు వందలో ఎలక్ట్రిక్ బస్సుల్ని అంటగట్టేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ఆంజనేయరెడ్డి అనే మాజీ అధికారి నేతృత్వంలో.. ఓ నిపుణుల కమిటీని కొన్నాళ్ల కిందట నియమించారు. ఈ కమిటీనే.. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే నివేదిక ఇచ్చింది. ఇప్పటికి మాటలతో.. అర్టీసీని విలీనం చేశారు. ప్రక్రియ అసలు ప్రారంభమయిందో లేదో క్లారిటీ లేదు. ఈ కమిటీనే… ఎలక్ట్రిక్ బస్సుల వల్ల పెద్ద ఎత్తున ఇంధనం ఆదా అవుతుందని… మరో నివేదికను జగన్కు సమర్పించారు. ఇందులో విద్యుత్ వాహనాల వల్ల డీజిల్ ఆదా అవుతుంది… విద్యుత్ వాహనాల చార్జింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి… సౌర విద్యుత్ ను జనరేట్ చేయాలి.. లాంటి సలహాలతో పాటు ప్రత్యేకంగా… తిరుమల గురించి ప్రస్తావించారు.
తిరుమలలో ప్రస్తుతం భక్తులకు ఉచితంగా సేవలు అందిస్తున్న డీజిల్ బస్సుల స్థానంలో వీలైనంత త్వరగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలని.. ఆంజనేయరెడ్డి కమిటీ సూచించింది. ప్రత్యేకంగా తిరుమల గురించి ఎందుకు చెప్పారో… ఆ కమిటీ పెద్దలకే తెలియాలి. ఆ మేరకు సూచనలు వచ్చాయేమో కానీ… అలా చేస్తే.. టీటీడీ నిరంతరం కాంకక్షించే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని నివేదిక ఇచ్చారు. నిజానికి పర్యావరణ పరిరక్షణలో టీటీడీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఇప్పుడేదో అది తగ్గిపోయినట్లు.. ఉన్న పళంగా… ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెట్టడమే.. దాన్ని దిద్దుకోవడం మార్గమన్నట్లుగా కమిటీ నివేదిక సూచించడం అధికారవర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. అంటే .. రేపో మాపో.. ఎలక్ట్రిక్ బస్సుల “మెగా” టెండర్ మళ్లీ రాబోతోందన్నమాట..!
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకొకసారి బేటీ కావాలని సూచించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఈ బస్ బిజినెస్ డెవలప్ మెంట్ డివిజన్ ఏర్పాటు చేయాలని, దీని వల్ల ఎప్పటికప్పుడు చోటు చేసుకునే పరిణామాలను వేగంగా అమలు చేయడంతో పాటు సంస్థకు అవసరమైన పధకాలను కూడా రూపొందించవచ్చని కోరారు. సంస్థలో 350 ఎలక్ట్రికల్ బస్సుల ఛార్జింగ్ కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది.