అయితే సాక్షి ఉద్యోగి.. లేకపోతే జగన్ బంధువు అయి ఉండాలన్న పక్కా నిబంధనను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సలహాదారు నియామకంలో అమలు చేసింది. ఆ సలహాదారు పొరుగు రాష్ట్రానికి చెందిన వాడైనా పర్వాలేదని తీర్మానించేసుకుంది. నిన్నామొన్నటి వరకూ సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరక్టర్ గా ఉన్న కొండుభట్ల రామచంద్రమూర్తిని పబ్లిక్ పాలసీస్ సలహాదారుగా నియమించారు. ఆయనకు నేరుగా.. కేబినెట్ హోదా ఇచ్చేశారు. అంటే… ఇప్పటి వరకూ సాక్షి నుంచి జీతం తీసుకున్న రామచంద్రమూర్తి.. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటారు.
సాక్షి నుంచి తొలగించి ప్రభుత్వంలో ఉపాధి..!
కొండుభట్ల రామచంద్రమూర్తి.. 2014లో జగన్ మీడియాలో ఎడిటోరియల్ డైరక్టర్ గా చేరారు. ఎన్నికల్లో విజయం సాధించే వరకూ ఆయన ఆ పదవిలో ఉన్నారు. అయితే.. రామచంద్రమూర్తి పనితీరుపై.. అంతగా సంతృప్తి లేని యాజమాన్యం మధ్యలోనే ఆయన బాధ్యతలను తగ్గించడం ప్రారంభించింది. చివరికి ఆయనకు.. త్రికాలమ్ అనే ఆర్టికల్ ఒకటి రాసుకునే వెసులుబాటు మాత్రమే ఇచ్చి.. మిగతా ఎడిటోరియల్ పాలసీల్లో వేలు పెట్టే అవకాశం కల్పించలేదు. పైగా.. ఎన్నికలకు ముందు.. ఉత్తరాదిలోని ఓ ప్రముఖ మీడియా సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్‌ను తెచ్చి అప్పగించేశారు. ఆయనకు తెలుగు కూడా రాదు. అప్పట్నుంచి పని లేకుండా ఉన్న రామచంద్రమూర్తి దగ్గర రెండు నెలల కిందట రాజీనామా తీసుకున్నారు. అలాంటి సీనియర్‌ను ఉద్యోగం నుంచి తీసేస్తే.. ఏమైనా అనుకుంటారనుకున్నామో కానీ.. ప్రజాధనాన్ని జీతంగా ఇస్తే సరిపోతుదంని అనుకున్నారు. సలహాదారుగా నియమించుకున్నారు.
జీతభత్యాలు దేవులపల్లి అమర్ కంటే ఎక్కువే..!
కేబినెట్ హోదను ప్రకటించడంతో.. కొండుభట్ల రామచంద్రమూర్తికి.. జీతభత్యాల రూపంలలో ప్రజాధనం.. నెలకు.. ఐదారు లక్షల రూపాయల వరకూ అందే అవకాశం ఉంటుంది. కేబినెట్ ర్యాంకుకు తగ్గట్లుగా.. సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ లాంటి వాళ్లు.. నెలకు రూ. మూడు లక్షల జీతం.. ఎనిమిది మంది సిబ్బంది జీతం.. ఆఫీసు ఖర్చు.. ఫోన్ బిల్లు..పింగాణి పాత్రలకు అలవెన్స్ ఇలా… అనేక రూపాల్లో లక్షల ఆదాయం కళ్ల జూస్తున్నారు. అంటే.. సాక్షిలో ఇచ్చిన దాని కన్నా.. రెండింతలే… రామచంద్రమూర్తికి లభిస్తుంది. కాకపోతే.. అది ఆంధ్రా ప్రజాధనం.
ఈయనా .. తెలంగాణే..! లోకల్ మాటలన్నీ మాయలే..!
రామచంద్రమూర్తి ఆంధ్రా ప్రాంత వ్యక్తి కాదు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా. ఏపీ సర్కార్.. స్థానిక నినాదంతో చట్టాలు చేసింది. అయితే.. నియామకాల్లో మాత్రం.. ఆంధ్రులు పెద్దగా కనిపించడం లేదు. ఐ అండ్ పీఆర్ కమిషనర్ దగ్గర నుంచి సలహాదారుల వరకూ.. చాలా మందిని తెలంగాణ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఐటీ సలహాదారుల్లో ఇద్దరు తెలంగాణ వాసులు. దేవులపల్లి అమర్ తెలంగాణ ఉద్యమకారుడు. ఏపీలో ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు ఉండగా… వారిని కాదని తెలంగాణ నుంచి తెచ్చుకుని ప్రజాధనాన్ని వారికి లక్షల్లో దోచి పెట్టడం ఏమిటో… సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ కోసం మరో తెలంగాణ జర్నలిస్టు ప్రయత్నం..!?
అసలు కొండుభట్ల రామచంద్రమూర్తికి.. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇస్తారని అనుకున్నారు. అయితే.. చివరి క్షణంలో.. ఆగిపోయింది. కారణం… తెలంగాణ ప్రభుత్వ పెద్దల నుంచి మరో ప్రతిపాదన వచ్చిందని.. తెలంగాణకు చెందిన మరో జర్నలిస్టుకు.. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వాలని.. సిఫార్సు చేశారని అంటున్నారు. ఈ కారణంగానే రామచంద్రమూర్తిని చివరి క్షణంలో సలహాదారు పదవికే పరిమితం చేశారంటున్నారు. ఆ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎవరో త్వరలోనే తేలిపోనుంది.