కొత్త పంచాయతీ రాజ్ విధానంతో ఇప్పటికే చాలామంది సర్పంచులు అసంతృప్తిగా రోడ్ల మీదకి వస్తున్న తీరు చూస్తున్నాం. ఉప సర్పంచ్ కి కూడా చెక్ పవర్ ఇవ్వడంతో చాలా గ్రామాల్లో వివాదాలు పెరిగాయి. దీని వల్ల పనులు ముందుకు సాగడం లేదనీ, వివాదాలు పెరుగుతున్నాయని సర్పంచుల సంఘం ఎంత మొత్తుకుంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదు. పైగా, సర్పంచులు ఎదురుతిరిగితే ఊరుకునేది లేదనీ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా! దీంతో ఇప్పుడు చెక్ పవర్ తోపాటు, కొత్త విధానంపై పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి త్వరలోనే కార్యాచరణ ప్రకటించబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంతమంది కలెక్టర్ల తీరు సర్పంచులకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది.
30 రోజుల్లో గ్రామాల స్వరూపాలు మారిపోవాలంటూ కొత్త యాక్షన్ ప్లాన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని అమల్లో భాగంగా కలెక్టర్లు పంచాయతీల సందర్శనకు వెళ్తున్నారు. అయితే, కొత్త చట్టం ప్రకారం… సర్పంచుల పనితీరు బాగులేదని అనిపించినా, ఏమాత్రం నచ్చకపోయినా వెంటనే ఆ సర్పంచ్ ని డిస్మిస్ చేసే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. దీన్నే ఆసరాగా చేసుకుని కొంతమంది కలెక్టర్లు దురుసుగా వ్యవహరిస్తున్నారనేది సర్పంచుల సంఘం ఆవేదన. పైగా, గ్రేడింగ్ విధానంలో పనితీరుపై మార్కులు వేస్తామని కలెక్టర్లకు కేసీఆర్ చెప్పారు. దీంతో తమ పనితీరు మొత్తాన్ని సర్పంచుల దగ్గరే ప్రదర్శించేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.
గడచిన 20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంతవరకూ 90 మంది సర్పంచులకు ఆయా జిల్లాల కలెక్టర్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 200 మంది గ్రామ సెక్రటరీలకు, ఇతర అధికారులకు మెమోలు జారీ చేశారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ నిధులే విడుదల చెయ్యలేదనీ, దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కలెర్టర్లు తమపై విమర్శలు చేస్తున్నారనీ, పనులు సక్రమంగా సాగడం లేదని ప్రశ్నిస్తున్నారని రాష్ట్ర సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిధులు సరిగా ఇస్తే… పనులు ఎందుకు చెయ్యమని అంటున్నారు. కలెక్టర్లకు అధికారాలు కల్పించి, పంచాయతీలకు నిధులు ఇవ్వకపోతే పనులెలా జరుగుతాయంటున్నారు. కొత్త చట్టంపై తీవ్ర అసంతృప్తి ఉందనీ, త్వరలోనే దాన్ని ముఖ్యమంత్రికి తెలిసేలా చేస్తామంటున్నారు. మొత్తానికి, సర్పంచుల్లో రానురాను తీవ్ర వ్యతిరేకతను కేసీఆర్ సర్కారు పెంచుకుంటున్నట్టుగా ఉంది. దీనికి తోడు, సర్పంచుల తరఫున పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే ఒక వేదికపైకి వచ్చాయి.