సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి మొదట్నుంచీ మంత్రి పదవి మీద ఆశ ఉన్న సంగతి తెలిసిందే. దాని కోసమే కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆయనకి మంత్రి పదవి వస్తుందని ఆశించారు, కానీ చివరికి కేబినెట్ హోదా ఉన్న చిన్న పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే గుత్తాకి ఈసారి పదవి గ్యారంటీ అనుకున్నారు. తొలిదశలో కేబినెట్ విస్తరణలో ఆ ఊసే కేసీఆర్ ఎత్తలేదు. మలిదశలో మంత్రి అయిపోతానని ఆయన అనుకున్నారు. కానీ, ఛాన్స్ ఇవ్వలేదు! దాంతో గుత్తా అసంతృప్తికి లోనుకాకుండా ఉండాలని… శాసన మండలి ఛైర్మన్ ని చేశారు. అయితే, ఈ పదవి దక్కడంపై కూడా గుత్తా పూర్తి సంతృప్తితో లేరనే కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి.
మంత్రి కావాలన్నది తన ఏకైక రాజకీయ లక్ష్యమనీ, ఎప్పటికైనా పదవి పొందాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో గుత్తా మంత్రి పదవికి సంబంధించిన టాపిక్ మరోసారి తెర మీదకి వచ్చింది! తాజాగా వినిపిస్తున్న గుసగుసలు ఏంటంటే… హుజూర్ నగర్లో తెరాసను గెలిపిస్తే, మంత్రి పదవి ఇస్తానని గుత్తాకి సీఎం కేసీఆర్ చెప్పారని! అందుకే, ఆయన గడచిన వారం రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా హుజూర్ నగర్ కి చెందిన కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, జెడ్పీటీసీలతో సంప్రదింపులు జరుపుతున్నారనీ, ఫిల్మ్ నగర్ లోని తన స్వగృహానికి నేతల్ని పిలిపించుకుని… సొంత పార్టీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేయాలంటూ రకరకాలుగా ఎరవేస్తున్నారని వినిపిస్తోంది!
ఇదే పాయింట్ మీద పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్ గా ఉన్న నాయకుడు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తమ పార్టీ వారికి డబ్బులు ఎరవేసే ప్రయత్నం మండలి ఛైర్మన్ చేస్తున్నారనీ, ఇది రాజ్యాంగ విరుద్ధమనీ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కు ఉత్తమ్ లేఖ రాశారు. మొత్తానికి, ఇదంతా మంత్రి పదవి కోసమే గుత్తా చేస్తున్న ప్రయత్నంగా చెబుతున్నారు. అయితే, మంత్రి వర్గ కూర్పు ఇప్పటికే అయిపోయింది కదా… గుత్తాకి అవకాశం ఎక్కడుందీ అంటే, మల్లారెడ్డి, లేదా జగదీష్ రెడ్డి స్థానంలో ఆయన్ని తీసుకుంటారని కేసీఆర్ మాటిచ్చినట్టు ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ! ఈ కథనాలపై గుత్తా ఎలా స్పందిస్తారో చూడాలి.