రాయలసీమకు హైకోర్టును తరలించబోతున్నారని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంగీకరించారు. రాయలసీమలో హైకోర్టు అంశం పరిశీలనలో ఉందని ప్రకటించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. అన్ని జిల్లాల్లో సమాన అభివృద్ధి చేయాలనీ తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి చెబుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి బుగ్గన.. ఈ అంశాన్ని డీల్ చేస్తున్నట్లు తేలడంతో.. ఏపీ హైకోర్టు తరలిపోవడం ఖాయమని ప్రభుత్వ వర్గాల్లోనూ ప్రచారం ప్రారంభమయింది. హైకోర్టు కోసం.. కర్నూలు జిల్లాలో న్యాయవాదులు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారు. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో వైపు హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలని అక్కడి లాయర్లు నిరసనలు చేస్తున్నారు. రాయలసీమకు హైకోర్టు తరలింపు విషయంపై… ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తున్నా.. వారికి అపాయింట్ మెంట్ దొరకడం లేదు. హైకోర్టు తరలింపు పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. కేంద్రం నిర్ణయం కూడా కీలకమే. కేంద్రం కూడా.. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రొత్సహిస్తోందని అంటున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ కర్నూలుకు వెళ్లి హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ హైకోర్టు కోసం జరుగుతున్న ఆందోళనలకు మద్దతు పలికారు. నిజానికి రాయలసీమ ఉద్యమం, హైకోర్టు లాంటి వాటి కోసం.. జరిగే ఆందోళనల వెనుక.. ఉండేది.. ప్రధానంగా… వైసీపీనే. ఆ పార్టీ మద్దతుతోనే ఓ వర్గం ఈ ఆందోళనలను చేపట్టేది. సాధారణంగా… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా ఇవి జరుగుతాయి. తర్వాత సద్దుమణిగిపోతాయి. కానీ ఇప్పుడు… హైకోర్టు కోసం కర్నూలులో ఆందోళనలు జరుగుతున్నాయి. బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఎలాంటి ప్రకటనలు చేయకపోతూండటం… ప్రజల్లో అనేక సందేహాలకు కారణం అవుతోంది. ఓ వైపు రాజధాని విషయంలో.. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎవరికీ తెలియడం లేదు. ప్రభుత్వం ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టవచ్చు కానీ.. ప్రజలకు మాత్రం.. ఏం జరుగుతుందో చెప్పడం.. కనీస బాధ్యతనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇలా ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఇతర చోట్ల కూడా.. హైకోర్టు ఏర్పాటు కోసం.. ఆందోళనలు ప్రారంభమవుతున్నాయి. కొత్తగా విశాఖ లాయర్లు హైకోర్టును విశాఖలో ఏర్పాటు చేయాలనే నిరసనలు ప్రారంభించారు.