హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ఎన్నికలవడం వెనుక… కేటీఆర్ కృషి ఉన్నట్లుగా.. గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల కిందట.. తెలంగాణ భవన్లో… పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. హుజూర్ నగర్ ఉపఎన్నికలపై సన్నాహాక సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి కేటీఆర్ హాజరు కాలేదు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా వదిలి పెట్టి వెళ్లారు. దాంతో..ఆయనేదో సీక్రెట్ ఆపరేషన్‌లో ఉన్నారని గుసగుసలు వినిపించాయి. ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏంటో రెండు రోజుల్లోనే తేలిపోయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో అజహరుద్దీన్ని గెలిపించడమే లక్ష్యంగా ఆయన కొద్ది రోజులుగా పావులు కదిపారని.. రెండురోజుల కిందట.. హెచ్‌సీఏ సభ్యులతో రహస్య సమావేశం ఏర్పాటు చేయడంతో.. దానికి ఆయన హాజరయ్యారని అంటున్నారు.
నిజానికి హెచ్‌సీఎలో… మాజీ ఎంపీ కేపీ వివేక్‌కు మంచి పట్టు ఉంది. ఆయనకే మెజార్టీ సభ్యుల మద్దతు ఉంది. అయితే.. ఇటీవలి కాలంలో ఆయన టీఆర్ఎస్కు దూరమయ్యారు. ఎంపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. తాను టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడానికి కేటీఆరే కారణమని వివేక్ చెబుతూంటారు. కేటీఆర్ తన అనుచరుడు బాల్క సుమన్ కోసం.. తనను బలి చేశారని నమ్ముతున్నారు. వివేక్‌ను ఏ మాత్రం పుంజుకోకుండా చేయాలనుకున్న కేటీఆర్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. అజహరుద్దీన్‌ను ముందు పెట్టి.. ఇతర గ్రూపులన్నింటినీ ఏకం చేశారు. వివేక్‌తో సన్నిహిత సంబంధాలున్న క్లబ్‌లను కూడా.. కేటీఆర్ అజహర్‌కు మద్దతు పలికేలా చేయగలిగారంటున్నారు.
హెచ్‌సీఏ అధ్యక్ష పదవి అజహరుద్దీన్‌కు చాలా ప్రతిష్టాత్మకమైనది. ఫిక్సింగ్ ఆరోపణలతో.. ఆయన క్రికెట్ వ్యవహారాల్లో పాలు పంచుకుని చాలా కాలం అయింది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా.. అవకాశం దక్కలేదు. కానీ కేటీఆర్ సాయంతో.. అజహర్ అనుకున్న పదవి పొందారు. క్రికెట్ పాలనలోకి అడుగు పెట్టారు. ఆ కృథజ్ఞతతో.. టీఆర్ఎస్లో చేరేందుకు కూడా.. అజహర్ రెడీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అజ్జూభాయ్ ఖండించడం లేదు . దేనికైనా సమయం రావాలంటున్నారు. అంటే.. టీఆర్ఎస్కు అవసరం అనిపిస్తే.. వెంటనే అజహరుద్దీన్‌కి కండువా కప్పేస్తారు.. లేకపోతే కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది.