ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి యూరేనియం అంటుకుంది. కడప జిల్లా పులివెందులలో ఇప్పటికే యూరేనియం సెగ ఓ రేంజ్లో ఉండగా… ఇప్పుడు అది ఆళ్లగడ్డకు పాకింది. తెలంగాణలో యూరేనియం తవ్వకాలు జరపవద్దంటూ.. ఆందోళన చేస్తూంటే.. ఏపీలో తవ్వకాలు కూడా ప్రారంభించేశారు. ఆళ్లగడ్డ మండలం యాదవాడలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయం ఆలస్యంగా బయటకు రావడంతో… రాజకీయం యూరేనియం చుట్టూ తిరగడం ప్రారంభమయింది. మాజీ మంత్రి, ఆళ్లగడ్డ భూమా అఖిల ప్రియ యాదవాడ వెళ్లి పనులను అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా యాదవాడలో యురేనియం ఖనిజాన్వేషణ చేస్తున్నారని మండిపడ్డారు.
మరో వైపు ఇదే అంశంపై… సీఎం జగన్కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. ఆళ్లగడ్డ ఏరియాలో యురేనియం డ్రిల్లింగ్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. యురేనియానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందని.. ఏపీలో ఏకంగా ఏపీలో తవ్వకాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తదుపరి పోరాట కార్యచరణను.. ప్రజాసంఘాలు ఖరారు చేసుకునే పనిలో ఉన్నాయి. తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ.. యూరేనియంకు వ్యతిరేకంగా ఏక తాటిపైకి వచ్చాయి. దాంతో ప్రభుత్వం దిగి వచ్చి.. అసెంబ్లీలో తీర్మానం చేసింది. తవ్వకాలకు అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చిచెప్పింది.
అయితే… అనూహ్యంగా ఏపీలో మాత్రం.. ఎలాంటి నిరసనలు కనిపించడం లేదు పులివెదులలో యూరేనియం ఫ్యాక్టరీ వల్ల అనర్థాలు జరుగుతున్నప్పటికీ.. ఏ పార్టీ కూడా.. పూర్తి స్థాయిలో ఉద్యమించలేదు. ఫలితంగా..ఆళ్లగడ్డలోనూ తవ్వకాలు ప్రారంభించారు. ప్రజలు అనారోగ్యం బారిన పడి… జీవశ్చవాలుగా మారే వరకూ.. ఇంతే నిర్లిప్తంగా ఉంటారేమోనని ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి.