తెలుగు సినిమా పాటలంటే ఎక్కడో చిన్నచూపు.
అర్థాలసలు ఉండవని, క్యాచీ పదాల కోసం తెలుగుని ఖూనీ చేస్తుంటారని – ఎన్నో నిట్టూర్పులు.
అవి కొంత వరకూ నిజమే కావొచ్చు. తెలుగు సినిమా పాటలో తెలుగు పదాల్ని వెదికిపట్టుకోవడం చాలా సందర్భాల్లో కష్టం కావొచ్చు. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి రచయిత కలం పట్టుకుంటే – మాత్రం ఈ అవమానాలన్నీ తల వంచాల్సిందే. నీ నిందలన్నీ పక్కకు తప్పుకోవాల్సిందే.
ఎంతటి రచయితకైనా భాషపై సాధికారికత ఉంటే సరిపోదు. దాన్ని ప్రదర్శించేందుకు వేదిక కూడా కల్పించాలి. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తోడుగా ఉంటే, తప్పకుండా మాటలకే కాదు, పాటలకు కూడా ఓ విలువ వస్తుంది. ‘అల వైకుంఠపురము’లో విడుదలైన తొలి పాట ‘సామజ వరగమనా’ కూడా అలా సరికొత్త విలువ సంతరించుకున్నదే.
కథానాయిక వెంట పడుతూ, ఆమె ప్రేమ కోసం, చూపు కోసం స్పర్శ కోసం పరితపించే కథానాయకుడు పాడుకున్న పాట ఇది. ఇలాంటి సందర్భంలో టీజింగ్ సాంగ్ రాసేయొచ్చు. క్యాచీ పదాలు పరుగులు పెడుతుంటాయి. పాడుకోవడానికి కూడా బాగుంటుంది. పాట త్వరగా జనంలోకి వెళ్లిపోతుంది. `జులాయి`లోని `ఓ మధు.. ఓ మధు` పాట అలాంటిదే. అందులోనూ బోలెడంత భావుకత కనిపిస్తుంది. కాకపోతే.. అచ్చుగుద్దినట్టు.. ప్రతీ అక్షరం తెలుగులో మునకలేయలేదు. `సామజవరగమనా` పాట మాత్రం అలా కాదు. ఏ పదం తెలుగు భాషని దాటి పోలేదు.
నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
అంటూ.. ఓపెనింగే అదరగొట్టేశారు సిరివెన్నెల. కళ్లు కాళ్లని పట్టుకుని వదలకపోవడం, ఆ చూపుల్ని ప్రియురాలు తొక్కుకుంటూ వెళ్లిందనడం – చక్కటి భావుకత.
నీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువు నలుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
– రెండో లైన్ ఓకే గానీ.. కాటుకలా కళ్లకి కలలు కాపలా కాసాయి అని రాయడం.. మంచి మ్యాజిక్.
నా ఊపిరి గాలికి ఊయలలూగుతు ఉంటే ముంగురులు
నెట్టేస్తే ఎలా నిట్టూర్చవంటే నిష్టురపు విలవిలలు
– ప్రియుడు శ్వాస తీసుకుంటుంటే, ఆ గాలికి ప్రియురాలి కురులు ఊయలలూగడం.. మరో మంచి పద ప్రయోగం.
మల్లెల మాసమా మంజులహాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన పింఛెమా.. విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగ వశమా
.. ఇలా ప్రతీ చోటా చక్కటి, చిక్కటి తెలుగు పదాలు పడ్డాయి. డిక్షనరీలు వెదుక్కుని మరీ అర్థాలు తెలుసుకునే సత్తా ఉన్న పాటల్ని రాయగల సీతారామశాస్త్రి.. ఈసారి ఆ అవసరం రాకుండానే, తిన్నగా గుండెలోతుల్లోకి వెళ్లిపోయి, మధుర స్ముతిగా మిగిలిపోయే భావాలున్న గీతాన్ని అందించారు.
సిద్ శ్రీరామ్ తనకు అలవాటైన పంథాలోనే ఈ పాటని ఆలపించాడు. నిట్టూర్పులు, కాటుక అనే పదాలు సరిగా పలకలేదు. కాకపోతే… తమన్ ఇచ్చిన ఆర్కెస్ట్రా, ట్యూన్.. ఇవన్నీ క్లాసీగా సాగాయి. కొన్నాళ్ల పాటు ఈ పాట.. తెలుగునాట హల్ చల్ చేయడం ఖాయం. ఈ పాటతో.. ‘అల వైకుంఠపురం’లో మిగిలిన గీతాలపై కూడా ఓ అంచనా ఏర్పడిపోయింది. దాన్ని తమన్ ఎలా అందుకుంటాడో చూడాలి.