తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్. సొంత గడ్డ మీద మరోసారి పట్టు నిలబెట్టుకోవాలనేది పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇదే సందర్భంలో ఎంపీ రేవంత్ రెడ్డి అంశం కూడా హాట్ టాపిక్కే. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి అంశమై ఆయన భిన్నమైన అభిప్రాయం వ్యక్తీకరించడం, రేవంత్ కి వ్యతిరేకంగా పార్టీలో సీనియర్లు ఏకం కావడం చూస్తున్నాం. ఇదంతా రేవంత్ కి పీసీసీ అధ్యక్ష పగ్గాలు దక్కకుండా చేయాలనే వ్యూహం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇదే సమయంలో రేవంత్ కూడా పీసీసీ పదవి విషయమై గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఓపక్క ఉప ఎన్నికల హడావుడిలో ఇతర నేతలంతా ఉంటే… ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తోంది! అధిష్టానం నుంచి ఈయనకి పిలుపు వచ్చిందా, లేదంటే ఈయనే స్వయంగా వెళ్లారో తెలీదుగానీ… పార్టీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను హైకమాండ్ కి వివరించే ప్రయత్నంలో రేవంత్ ఉన్నారని అనుచర వర్గాల ద్వారా తెలుస్తోంది.
కాబోయే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనే లీకులు రావడంతో వ్యతిరేకత మొదలైంది. నిన్నగాకమొన్న పార్టీలోకి వచ్చినవారికి కీలక పదవి ఇవ్వొద్దంటూ అధిష్టానానికి ఇప్పటికే చాలా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో హైకమాండ్ కూడ కొంత ఆలోచనలో పడిందని సమాచారం. దీంతో, తనకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీని ఏ రకంగా సమర్థంగా నడపగలను అనే అంశాన్ని వివరించేందుకే రేవంత్ ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అంతేకాదు, ప్రస్తుతం ఆయనపై ఢిల్లీకి చేరిన ఇతర నేతల ఫిర్యాదుల మీద కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక అయిన తరువాతే పీసీసీ అధ్యక్ష నియామకంపై ఒక ప్రకటన హైకమాండ్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈలోగా రేవంత్ కి అవకాశం లేకుండా చెయ్యడం కోసం కొందరు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో, ఈ ఛాన్స్ మిస్ కాకూడదన్నట్టుగా రేవంత్ కూడా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అంతిమంగా హైకమాండ్ ఎటువైపు మొగ్గుతుందో చూడాలి. ఒకవేళ రేవంత్ రెడ్డికే బాధ్యతలు ఇవ్వదల్చితే… సీనియర్లందరినీ ముందుగా గాడిలో పెట్టాల్సి ఉంటుంది. ఓరకంగా అధిష్టానానికి కూడా ఇది తలనొప్పి వ్యవహారమే అయిపోయింది. పార్టీ అవసరాల దృష్ట్యా రేవంత్ సేవలు కావాలి, కానీ నాయకుల అసంతృప్తుల దృష్ట్యా ఆయన్ని కీలక బాధ్యతల నుంచి దూరం పెట్టాలి… ఈ రెంటిలో ఏది సరైన నిర్ణయం అవుతుందో హైకమాండ్ కే తెలియాలి.