ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో.. ఏపీ గురించి ఇక పారిశ్రామికవేత్తలు మర్చిపోవడమేనని తీర్మానించేశారు. దానికి ఆయన తెర వెనుక జరుగుతున్న కొన్ని వ్యవహారాలను కూడా ఉదాహరణలుగా వెల్లడించారు. జగన్ నిర్ణయాల ప్రభావం దేశం మొత్తంపై పడుతోందన్న.. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ విమర్శలను గుర్తు చేసిన.. ఆర్కే… ఇటీవల కొంత మంది వచ్చిన పెట్టుబడిదారుల కామెంట్లను కూడా.. తన ఆర్టికల్‌లో వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం ఓ విదేశీ బహుళజాతి బృందాన్ని సీఎం వద్దకు పంపితే… ఆయన కడపలో పెడితే పెట్టండి.. లేకపోతే.. వద్దని చెప్పి పంపిచేశారట. ఇది ఆ కేంద్ర మంత్రి రాధాకృష్ణకు చెప్పినట్లుగా శారు. ఇటీవలి కాలంలో ఆంధ్రజ్యోతి ఎండీతో పలువురు కేంద్రమంత్రులు సమావేశమయ్యారు. వివిధ సమావేశాల్లో కలిసి ఉంటారు. నేరుగా ఇంటికి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కలిశారు. కాబట్టి.. ఆర్కే మాటలు కల్పితాలని అనుకోవడాని లేదంటున్నారు.
విజయసాయిరెడ్డిని కూడా.. జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టారని ఆర్కే… తన ఆర్టికల్ ద్వారా వివరించారు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో.. విజయసాయిరెడ్డి పాత్ర పెద్దగా లేదని.. ఆర్కే చెబుతున్నారు. ఢిల్లీలో తాను వ్యవహారాలు చక్క బెట్టాల్సి ఉన్నందున.. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల ఒత్తిడి ఆయనపైనే ఎక్కునగా ఉంటుంది. అందుకే ఓ సందర్భంలో.. జగన్‌కు చెప్పే ప్రయత్నం చేసినా… ఆయన విజయసాయిరెడ్డిపై కసురుకున్నారని.. ఆర్కే చెబుతున్నారు. “మిమ్మల్ని ఢిల్లీలో చూసుకోమన్నానుగా! ఇక్కడి విషయాలు నేను చూసుకుంటాను” అని ముఖ్యమంత్రి మొహం మీదే అనేశారని ఆర్కే రాశారు. దాంతో.. విజయసాయిరెడ్డి ట్వీట్లతో కాలక్షేపం చేస్తున్నారని ఆర్కే తేల్చారు. ముఖ్యమంత్రి తీరుపై.. అధికార వర్గాల్లో జరుగుతున్న ప్రచారం… వారిలో ఏర్పడిన నిర్లిప్తతను.. ఆర్కే విశ్లేషించారు. అయితే.. బీజేపీ హైకమాండ్‌లో ఏపీలో పరిస్థితుల్ని ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదని కూడా ఆర్కే కొత్తపలుకులో చెప్పుకొచ్చారు. ” ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను కేంద్రప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. రాష్ట్రంలో మతమార్పిడులు జోరుగా జరగడంతోపాటు ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొన్ని వర్గాల ప్రజలు ఉక్కపోతకు గురవుతున్న విషయాన్ని ఆర్ఎస్ఎస్ నాయకులు కేంద్రప్రభుత్వానికి నివేదించినట్లు” ఆర్కే స్పష్టం చేశారు.
ఏపీకి రాజధాని లేకుండా.. కేసీఆర్‌తో జగన్ కుట్ర చేస్తున్నారని.. ఆర్కే.. విశ్లేషించారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడం నిరర్ధకమని తాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో చేసిన ప్రకటనతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయని రాసుకొచ్చారు. తెలంగాణ పక్షపాతి అయిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోరుకుంటారని ఎలా నమ్మగలమని ఏపీ ప్రజలు సందేహపడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు . అయితే.. . జగన్ ను కేసీఆర్ ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకుంటున్నారన్న విషయాన్ని ఆర్కే.. పరోక్షంగా అయినా చాలా క్లారిటీగా చెప్పారు. ఏపీ అభివృద్ధిని కాంక్షించేంత విశాల హృదయం కేసీఆర్‌కు లేదని.. చెప్పకనే చెప్పారు. మరి జగన్ తెలుసుకుంటారో లేదో..!