సాక్షి మీడియాలో నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వారినందర్నీ.. ఏపీ సర్కార్ ఉద్యోగుల జాబితాలోకి చేర్చే ప్రక్రియలో.. రేపోమాపో మరో కీలకమైన ముందడుగు పడనుంది. కేఎస్ఆర్ షో పేరుతో… చర్చా కార్యక్రమం నడిపే కొమ్మినేని సాంబశివరావును.. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈయనకూ క్యాబినెట్ ర్యాంక్.. ఆ స్థాయిలో జీతభత్యాలు ఉంటాయంటున్నారు. నిజానికి .. ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని.. ఎడిటోరియర్ డైరక్టర్ గా పని చేసి..రాజీనామా చేసిన కొండుభట్ల రామచంద్రమూర్తికి ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే కారణం ఏమిటో కానీ చివరి క్షణంలో ఆయనకు పబ్లిక్ పాలసీస్ సలహాదారుగా సరిపెట్టారు. దీంతో.. కొమ్మినేనికి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది.
ఒక్కొక్కరికి.. రూ. జీతభత్యాలు రూ. నాలుగు నుంచి ఏడు లక్షల వరకూ… అందిస్తున్న ప్రభుత్వం… దాదాపుగా అందర్నీ సాక్షి ఉద్యోగుల్ని తీసుకుంటోంది. కాదంటే.. బంధువులకు అవకాశం కల్పిస్తున్నారు. సీపీఆర్వో దగ్గర్నుంచి పీఆర్వోల వరకూ అందరూ సాక్షి మీడియా ఉద్యోగులే ఉన్నారు. కొత్తగా.. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి కూడా.. సాక్షి ఉద్యోగికే ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే. తెలంగాణ వారందరికీ.. పదవులు ఇస్తున్నారని… జరుగుతున్న ప్రచారాన్ని… కొమ్మినేనికి పదవి ఇచ్చి చెక్ పెట్టవచ్చని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఓ పార్టీ చానల్ లో నిర్వహించే టాక్షోలను ఆ పార్టీ విధానాలకు అనుగుణంగా.. ఏకపక్షంగా ఎలా నిర్వహించాలో… కొమ్మినేనికి తెలిసినంతగా ఎవరికీ తెలియదని.. జర్నలిస్టులు సెటైర్లు వేస్తూంటారు. ఎన్నికలకు ముందు ఆయన చేసిన ఇంటర్యూలు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. కోర్టులను సైతం.. కించ పరిచేలా.. ఇంటర్యూల్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. విషయం కోర్టులకు కూడా వెళ్లింది. ఆ సమయంలో .. తన ఇంటర్యూలకు జగన్మోహన్ రెడ్డి ఏం సంబంధం లేదని.. తాను మంచి ప్యాకేజీ ఇచ్చినందున జీతగాడిగా సాక్షిలో చేరానని.. కొమ్మినేని ప్రకటన చేయాల్సి వచ్చింది. అయితే.. దానికి ఇప్పుడు.. కొమ్మినేని ప్రతిఫలం పొందబోతున్నారంటున్నారు.