ఆర్టీసీలో 350ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. టెండర్లు పిలిచింది. నిజానికి ఈ టెండర్ల ప్రిబిడ్ సమావేశానికి అధికారులు అంచనా వేసిన దాని ప్రకారం.. రెండు అంటే రెండు సంస్థలే రావాలి. ఆ మేరకు ఆ రెండింటికి మాత్రమే.. అధికారులు.. సమాచారం ఇచ్చారు. మిగతా కంపెనీలకు పెద్దగా సమాచారం పంపే ప్రయత్నం చేయలేదు. కానీ.. ప్రిబిడ్ సమావేశం.. విజయవాడలోని ఆర్టీసీ బస్ భవన్లో ప్రారంభమయ్యే సరికి. ఏకంగా పద్దెనిమిది కంపెనీల ప్రతినిధులు వచ్చారు. ఇందులో.. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో ముందంజలో ఉన్న అశోక్ లేల్యాండ్, ఐషర్, టాటా లాంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీ ప్రతినిధులు.. తమ బస్సుల సామర్థ్యం… తమ నైపుణ్యాన్ని వివరించేసరికి.. అధికారులకు చెమటలు పట్టాయి. మేఘా గ్రూప్ కంపెనీ అయిన ఒలెక్ట్రా కన్నా.. వాటి సాంకేతిక, సామర్థ్యం ఎక్కువ.
గత గురువారం జరిగిన ప్రీ బిడ్ సమావేశానికి కేవలం రెండు సంస్థలు మాత్రమే హాజరవుతాయని భావించారు. కానీ పలు ప్రముఖ సంస్థలు హాజరు కావడంతో ఒక సంస్థకు కాంట్రాక్టు దక్కేలా కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలకు ప్రీ బిడ్ లో పాల్గొన్న పలు కంపెనీలు పాల్గొని గండి కొట్టినట్లయింది. బస్సుల సీటింగ్ కెపాసిటీ, బ్యాటరీ సామర్ధ్యం, ఎన్ని కిలోమీటర్లు గరిష్టంగా తిరుగుతుంది.. వంటి అంశాలపై ఆర్టీసీ అధికారులు తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇదే సమయంలో ఆయా కంపెనీలు ఆర్టీసీ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. ఈ ప్రీబిడ్ సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే ఆర్టీసీ ఉన్నతాధికారులు కొంతమంది వెళ్లిపోయారు. తాము అనుకున్నది ఒకటని.. ఇంకోటి జరుగుతోందన్న అభిప్రాయం ఉన్నతాధికారుల్లో ఏర్పడింది.
అక్టోబర్ 14వ తేదీ లోగా టెక్నికల్ బిడ్, నవంబర్ 1వ తేదీ లోపు ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. నవంబర్ 6న రివర్స్ బిడ్డింగ్ లకు వెళ్లనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. కిలోమీటర్ కు 60 రూపాయల చొప్పున అద్దె చెల్లించే విధంగా ఓ ప్రైవేటు సంస్థ కు కాంట్రాక్టు ఇచ్చే విధంగా టెండర్లు కేటాయించేందుకు ఇప్పటికే సిద్ధం చేసిన ప్రణాళిక.. అశోక్ లేలాండ్, టాటా, ఐషర్ కంపెనీలు పోటీలోకి రావడంతో పరిస్థితి మారిపోయిందంటున్నారు. పైగా అశోక్ లేల్యాండ్ విజయవాడ సమీపంలో ఎలక్ట్రిక్ బస్సుల ప్లాంట్ నిర్మించింది. గిరాకీ లేదన్న కారణంగా ఉత్పత్తిని మాత్రం హోల్డ్‌లో పెట్టింది. ప్రభుత్వం అశోక్ లేల్యాండ్‌కు ఈ కాంట్రాక్ట్ ఇస్తే.. ఏపీలో ఓ పరిశ్రమ నిలదొక్కుకునే అవకాశం కూడా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి బిడ్డింగ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి..!