ఇళ్లకే ప్రభుత్వ పథకాల డోర్ డెలివరి..!
పించన్లు, రేషన్ కార్డులకు దరఖాస్తు చేసిన వెంటనే మంజూరు..!
ఏదైనా అసౌకర్యం కలిగితే అందుబాటులో అన్ని విభాగాల అధికారులు..!
గుడ్ గవర్నెన్స్‌కు ఇంత కంటే మంచి సూత్రాలు ఏమీ ఉండవు. ప్రజలు ప్రభుత్వం నుంచి ఆశించేది మెరుగైన పాలన. ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేస్తూ.. సంక్షేమం పంపిణీ చేయడం.. ప్రభుత్వం బాధ్యత. ఈ బాధ్యతను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగానే గుర్తించారు. అందుకే.. గ్రామ సచివాలాయల వ్యవస్థ ఆలోచన చేశారు. ప్రతి రెండు వేల మందికి ఓ గ్రామ సచివాలయం.. లేదా వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పదకొండు మంది విభిన్న సేవలు అందించే ఉద్యోగులు ఉంటారు. వీరి ద్వారా ఆ రెండు వేల మంది అవసరాలు తీర్చడం .. పెద్ద కష్టం కాదు. ఎందుకంటే.. వీరికి ఇతర ప్రభుత్వ అనుబంధ విభాగాల ఉద్యోగాలు అండగా ఉంటారు.
ప్రజల అవసరాలన్నింటినీ ఆ సచివాలయాలు తీర్చేస్తాయా..?
ఇప్పటి వరకూ.. గ్రామ సచివాలయం అయినా.. వార్డు సచివాలయం అయినా.. ఏ చిన్న ప్రభుత్వ పనికైనా లంచం ముట్టచెప్పాల్సిందే. తృణమో.. పణమో ముట్ట చెప్పనిదే ప్రభుత్వ ఉద్యోగులు కదలరు. వారు ప్రజల సొమ్మే జీతంగా తీసుకుంటున్నప్పటికీ… ప్రజలు పని చేసి పెట్టమంటే మాత్రం.. అదేదో.. తమ సమయం అంతా వెచ్చిస్తున్నట్లుగా వ్యవహరిస్తూంటారు. ఆ పరిస్థితికి.. గ్రామ సచివాలయాలు అడ్డు కట్ట వేసే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం కూడా.. చాలా పకడ్బందీగా వ్యవస్థను నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. దాంతో.. ప్రజల్లో.. ఈ గ్రామ సచివాలాయాల వ్యవస్థ మీద నమ్మకం కలుగుతోంది. కానీ దీన్ని నిలబెట్టుకోవాలంటే.. మాటలు చెప్పినంత సులభం కాదు.
ఒక పార్టీ వారికే పని చేస్తారనే ప్రచారాన్ని తుంచేలా ఉండాలి..!
గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో ఇప్పటికే అపోహలు తలెత్తుతున్నాయి. వాటిని ప్రభుత్వం క్లియర్ చేయలేదు. అంతే కాకుండా.. ఏకంగా ఆయా సచివాలాయలకు.. తమ పార్టీ గుర్తులు వేసేశారు. అంటే.. పార్టీ కార్యాలయాలుగా అవి మారిపోయాయి. అందులో చేరుతున్న ఉద్యోగులు కూడా.. ఆ పార్టీ సానుభూతి పరులేనన్న విమర్శలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి వారు.. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఎలా సేవలందిస్తారన్నది.. ముఖ్యమైన అంశం. పొరపాటున వారు.. సమస్యలు పరిష్కరించకపోతే.. పార్టీ ముద్ర పడిపోతుంది. కొంత మందికే వారు పని చేస్తున్నారనే అభిప్రాయ ప్రబలిపోతే.. నియంత్రించుకోవడం ప్రభుత్వానికి కూడా కష్టమవుతుంది. ఈ విషయంలో… ప్రభుత్వం కేర్ ఫుల్‌గా ఉండాల్సి ఉంటుంది.
అంచనాలు చాలా హై..! అందుకోవాల్సిందే..!
వ్యవస్థలన్నింటికీ.. అతీతంగా గ్రామ , వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసినట్లుగా.. ప్రభుత్వం తీరు ఉంటోంది. వారే అంతిమం అన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేస్తూండటంతో.. మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వ పథకాలు ఇవ్వకపోయినా.. ఏమైనా నిలిపివేసినా.. ప్రజలు వారినే బాధ్యలుగా చూస్తారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్లతో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వార్డు, గ్రామ సచివాలాయల విషయంలో.. అలాంటి పరిస్థితి రాకుండా.. వారి విధులేమిటో స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలగాలి. అంచనాలు ఎక్కువైతే.. సినిమా అట్టర్ ఫ్లాపవుతుందనే విషయాన్ని ప్రభుత్వ వర్గాలు గుర్తుంచుకోవాల్సి ఉంది.