ప్రోత్సహకాలు ఇస్తామంటే పరిశ్రమలు వస్తాయి కానీ.. పన్నులు బాదేస్తామంటే.. ఎవరైనా వస్తారా..?. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం పన్నులేస్తాం.. మా రాష్ట్రానికి రండి అని పరిశ్రమలకు పిలుపునిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న పరిశ్రమలు.. వచ్చే పరిశ్రమలు ఏమైనా ఉంటే.. వాటిపై.. గ్రీన్ ట్యాక్స్ వేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొద్ది రోజుల కిందట వన మహోత్సవం రోజు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. అయితే.. ఆషామాషీగా ఈ ప్రకటన చేయలేదని.. దీనిపై సీరియస్గా ప్రభుత్వం వర్కవుట్ చేస్తోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం పట్ల సీరియస్గా ఉంది.
ఆంధ్రప్రదేశ్లో ఫార్మా కంపెనీల నుంచి వస్తున్న వ్యర్ధాలలో 30శాతం మాత్రమే శుద్ది చేస్తున్నారని .. మిగతా 70శాతం వాతావరణంలోకి వదిలి వేస్తున్నారని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈ మేరకు తన వద్ద కచ్చితమైన సమాచారం ఉందంటున్నారు. నిజానికి ఫార్మా పరిశ్రమలకు.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వాలి. సంబంధిత వ్యవస్థలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ.. ఫార్మా కంపెనీల వల్ల పెద్ద ఎత్తున కాలుష్యం వస్తుందని సీఎం అంచనాకు వచ్చారు. కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించారు. అంటే ఇప్పటి వరకూ.. పరిశ్రమల కాలుష్యాన్ని నివారించే బాధ్యత ఆయా పరిశ్రమలకే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వమే తీసుకుంటుందని.. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. అలా తీసుకున్నందుకు ట్యాక్స్ వసూల చేస్తామంటున్నారు.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రం అయింది. గత ఐదేళ్లలో కొంత మేర పరిశ్రమలు వచ్చాయి. వచ్చిన పరిశ్రమల మీద.. ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా ఆరోపణలు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల మీద.. ఫార్మా కంపెనీల మీద.. అవినీతి ఆరోపణలు చేశారు. కాలుష్య కాసారం చేస్తున్నారని.. మెగా అక్వా ఫుడ్ పార్క్ వంటి వాటి మీద..ఉద్యమాలు కూడా చేశారు. ఇప్పుడు.. ఆ కాలుష్యాన్నంతటినీ అధికారికం చేసేందుకు గ్రీన్ ట్యాక్స్ అంటున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిశ్రమల్ని తీసుకొస్తున్నారో.. తరిమేస్తున్నారో అర్థం కావడం లేదని..వారంటున్నారు.