వ్యవస్థో రక్షతి రక్షితః..! వ్యవస్థల్ని మీరు కాపాడితే.. వ్యవస్థలు మిమ్మల్ని కాపాడుతాయి…! . ఇది పాలకులను ఉద్దేశించినది మాత్రమే కాదు. సమాజాన్ని ఉద్దేశించినది కూడా. సమాజంలో ఉన్న అన్ని వర్గాలను ఉద్దేశించినది కూడా. ఈ వ్యవస్థల్లోకి మీడియా కూడా వస్తుంది. ప్రజాగళం వినిపిస్తున్నందున.. కొన్ని మీడియాలను ప్రజలకు కనిపించనివ్వకుండా.. వినిపించనివ్వకుండా చేస్తే.. ప్రభుత్వాలు… తాము చేసే అక్రమాలు బయటకు రావని అనుకుంటున్నాయి. ఫలితంగా.. మీడియా ఇప్పుడు దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కోంటోంది.
మీడియాను అంతం చేస్తే చేటు ఎవరికి..?
ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిలబడే మీడియాకు నిలువనీడ ఉండే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ మీడియా. దురదృష్టవశాత్తూ.. పాలకులకు మీడియా అంటే ఎప్పుడూ కంటగింపే. అధికారం అడ్డం పెట్టుకుని తాము చేస్తున్న ఆకృత్యాలు బయటకు తెలియకూడదని వారనుకుంటూ ఉంటారు. నిర్ణయాలు లోగొట్టు… అధికారం అడ్డం పెట్టుకుని చేసే దందాలు సీక్రెట్‌గా ఉండిపోవాలనుకుంటారు. అందుకే .. ప్రజాస్వామ్య పరిరక్షణలో… మీడియాదే కీలకం. నిస్సంకోచంగా అన్నీ బయట పెట్టే మీడియాకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. పాలకుల వల్ల ప్రజలకు కలుగుతున్న కష్టాలను ఏకరవు పెట్టే మీడియా వల్లే చైతన్యం పెరుగుతుంది. ప్రజా గొంతుకను వినిపిస్తుంది. అదే పాలకులకు కంటగింపుగా మారింది.
మీడియానే లేకపోతే పాలకుల అరాచకాలకు అడ్డు ఉంటుందా..?
మీడియాలో అందరూ నీతిమంతులే ఉండరు. మీడియా కూడా సమాజంలో ఓ భాగం. కానీ.. మీడియా యాజమాన్యాలు.. అడ్డదోవలు తొక్కుతున్నాయేమో కానీ.. తమ విధి నిర్వహణలో.. యాజమాన్యం పెట్టే కట్టుబాట్లను పాటించేవారు.. చాలా అరుదు. సీనియర్ జర్నలిస్టులు.. తమ తమ చేతుల మీదుగా చానళ్లు, పత్రికలను నడుపుతున్నప్పుడు.. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా… వ్యక్తిగత, కుల, మత , ప్రాంతాలకు అతీతంగా… ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఇప్పటికి కొంత మంది… కొన్ని పార్టీలకు అంకితమైన మీడియా సంస్థల్లో పని చేస్తున్న వారు.. ఒరిగిపోయి ఉండవచ్చు కానీ.. మీడియా అని నిఠారుగా నిలుచుని గుండెల మీద చేయి వేసుకుని చెప్పేవాళ్లు కోకోల్లలు. వారే అసలు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే.. మూల స్తంభపు వ్యవస్థ.
వ్యవస్థల్ని రక్షిస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షణ..!
వ్యవస్థల్ని కాపాడితే.. ఆ వ్యవస్థలే తర్వాత వారిని కాపాడతాయి. లేకపోతే.. చెడగొట్టిన వ్యవస్థలే పట్టి పీడిస్తాయి. చరిత్రలో జరిగింది ఇదే. జరగబోేయది కూడా ఇదే. నిజాలు చెప్పకూడదని… ప్రజలకు తెలియకూడదని…మీడియాను అణగదొక్కాలని ప్రయత్నించడం.. అవివేకమే. చరిత్రలో జరిగిన ఎన్నో ఘటనలు ఈ విషయాలను నిరూపించాయి. నాటి రామ్ నాథ్ గోయంకా.. అప్పటికి తిరుగులేని అధికారం అనుభవిస్తున్న ఇందిరాగాంధీని ఎదిరించి.. మీడియాను నిలబెట్టారు కాబట్టే .. ఇప్పటికీ ఆయన పేరు మార్మోగిపోతోంది. అప్పట్లో అధికారం తప్పులు చేస్తున్నా.. అడుగలకు మడుగులొత్తిన వారు ఇప్పటికి ఎవరూ గుర్తు లేరు.