ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో గత ఆదివారం తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ అనంతరం చెలరేగిన విద్వంసంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్, పోలీస్ వాహనాలకి ఆందోళనకారులు నిప్పు పెట్టి, పోలీస్ స్టేషన్ పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలపై దర్యాప్తు జరుపుతున్న తూర్పు గోదావరి పోలీసులు ఇంతవరకు 150 మందిని గుర్తించారు. ఆ సభ నిర్వాహకులతో సహా మొత్తం 63 కేసులు నమోదు చేసారు. రైల్వే పోలీసులు కూడా మరో ఐదు కేసులు నమోదు చేసారు.
ఇది చాలా తీవ్రమయిన వ్యవహారం కావడం, రాజకీయాలతో ముడిపడి ఉండటం వలన పోలీసులపై తీవ్ర ఒత్తిళ్ళు రావడం సహజం. అందుకే వారు దర్యాప్తు చేస్తున్న ఆ కేసులన్నిటినీ సి.ఐ.డి.కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. బహుశః నేడోరేపో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయవచ్చును.
ఒకవేళ ఆ కేసులన్నిటినీ సి.ఐ.డి.కి అప్పగించినట్లయితే దాని వలన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొన్న ముద్రగడ పద్మనాభంపై ఒత్తిడికి గురవవచ్చును. ఎందుకంటే ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేస్తుంటే, ఆ కేసులను సి.ఐ.డి.కి అప్పగించాలని నిర్ణయించడం ద్వారా ప్రభుత్వం ఇంకా కటిన వైఖరి అవలంభించబోతున్నట్లు సూచిస్తున్నట్లుంది. బహుశః ఆ ఒత్తిడికి కారణంగా ఆయన రాజీకి వస్తారని ప్రభుత్వం భావిస్తోందేమో?