ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మరో పార్టీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు! అదేదో జాతీయ రాజకీయ కోసం చేస్తున్న ప్రయత్నం అనుకుంటున్నారా… కాదు, కేవలం హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసమే! అదేంటీ… ఒక ఉప ఎన్నిక కోసం ఇతర పార్టీల మద్దతు తెరాసకు అవసరమా..? ఎక్కడ ఎన్నిక జరిగితే అక్కడ జెండా ఎగరేయడం వారికి అలవాటు కదా, ఇతర పార్టీలను ఈసడించుకునే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు కదా, ఇప్పుడీ మద్దతు ఎందుకు అవసరమైంది..? అదీ కాకుండా కమ్యూనిస్టు పార్టీ మద్దతు కోసం, తెరాస నేతల్ని సీపీఐ కార్యాలయానికి పంపించి మరీ సాయం కోరడం చాలా విచిత్రంగా కనిపిస్తోంది.
ఎందుకంటే, కమ్యూనిష్టులంటే అభివృద్ధి నిరోధకులు అని కితాబిచ్చిందే కేసీఆర్ సాబ్. వారి వల్ల దేశానికి ఏమాత్రం ఉపయోగం లేదన్నదీ కేసీఆర్ సాబ్. వారివి కాలం చెల్లిన విధానాలన్నదీ ఆయనే! ఇక, నారాయణ విషయంలో అయితే ఎంత ఎద్దేవా చేసేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓసారి చెవ్వు కోసుకుంటా అంటూ నారాయణ ఏదో సవాల్ చేస్తే… దాన్ని పట్టుకుని ఎన్నాళ్లపాటు కేసీఆర్ వ్యంగ్యంగా ఎన్ని సభల్లో మాట్లాడుతూ వచ్చారో అందరికీ గుర్తుంది! కమ్యూనిష్టుల వాసన గిట్టదన్నట్టు ఈసడిస్తూ వ్యవహరించిన కేసీఆర్… ఇప్పుడెందుకు వారి మద్దతు కోసం పాకులాడుతున్నారు..? అంటే… ఎక్కడో ఏమూలో ఎందుకో ఈ ఉప ఎన్నిక ఫలితం మీద తెరాసకు కొంత భయం అంటూ మొదలైందన్నట్టుగానే కనిపిస్తోంది.
హుజూర్ నగర్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నది కేసీఆర్ పట్టుదల. ఓడితే ఏమౌతుంది… ఇప్పటికే కేసీఆర్ మీద వ్యతిరేకత వల్లనే అనుకున్నట్టుగా సారూ కారూ 16 ఎంపీ స్థానాలు దక్కించుకోలేకపోయిందనే ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఇక్కడా ఓడిపోతే… ఇదిగో కేసీఆర్ మీద వ్యతిరేకత మరోసారి నిరూపణ అయిందంటూ ప్రతిపక్షాలకు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, హుజూర్ నగర్ ని అంత ఈజీగా తీసుకోవడం లేదు. ఈ నియోజక వర్గంలో కమ్యూనిష్టులకు కూడా కొంత పట్టు ఉంది. చిలుకూరు మండలంలో ఆ పార్టీకి మంచి మద్దతు ఉంది. ఆ ఓటు బ్యాంకుని తమ ఖాతాలోకి వేసుకోవడమే కేసీఆర్ పొత్తు ప్రయత్నం వెనక వ్యూహం. అయితే, ఒక్క మజ్లిస్ తో హైదరాబాద్ లో మాత్రమే స్నేహపూర్వక పొత్తు… ఇతరులతో అస్సలు ఉండదు అంటూ చెబుతూ వచ్చి, రెండోసారి తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చి కూడా ఇప్పుడు కేవలం ఒక ఉప ఎన్నిక కోసం కమ్యూనిష్టుల పొత్తు కావాలంటూ ప్రయత్నించడం… వేరే రకమైన సంకేతాలనే తెరాస పంపుతోందని అనుకోవచ్చు.