ఆంధ్ర ప్రదేశ్ లో గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర కరెంటు సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో రోజుకు నాలుగైదు గంటలపాటు కరెంటు కోత విధించడం, అదీ వర్షాకాలంలో ఈ విధంగా చేస్తూ ఉండటం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే కరెంట్ సంక్షోభం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. థామస్ అల్వా ఎడిసన్, అన్ని సమస్యలను ఎలక్ట్రిసిటీ పరిష్కరిస్తుంది అని చెబితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, కరెంటు కోతే మా సమాధానం అని చెబుతోంది అంటూ జగన్ ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధించారు పవన్ కళ్యాణ్. అయితే ఏదో తూతూమంత్రంగా రాజకీయ విమర్శలు చేయడం కాకుండా, ఆంగ్ల మీడియా లో ఇందుకు గల కారణాలను సహేతుకంగా విమర్శిస్తూ వచ్చిన ఆర్టికల్‌ను కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం గమనార్హం.
తెలుగు మీడియా ఈ సమస్య మీద డిబేట్ లు పెట్ట పోయినప్పటికీ, జాతీయ మీడియాలో ఇప్పటికే ఈ అంశంపై పలు వార్తలు వచ్చాయి. ఏపీ జెన్కో కి బొగ్గు సప్లై చేసే భరత్ పూర్ మైన్స్ లో జరిగిన ప్రమాదం కారణంగా అక్కడ నుండి బొగ్గు సప్లై తగ్గిపోవడం, వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు తగ్గిపోవడం కూడా ఏపీ జెన్కో కి బొగ్గు సప్లై తగ్గిపోవడానికి కారణాలు గా కనిపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితిని ముందుగా ఊహించి తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు గా కనిపిస్తోంది. అధికారులు మాత్రం ఈ పరిస్థితి తాత్కాలికమే అని, కొద్ది రోజుల్లోనే పరిస్థితి మెరుగు పడుతుందని చెబుతున్నారు. 2014కు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అత్యంత తీవ్ర కరెంటు కోతలను అనుభవించిన రాష్ట్ర ప్రజలు, గత నాలుగేళ్లలో దాదాపుగా కరెంటు కోతలు సంగతే మరచిపోయారు. అయితే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రజలకు ఆ పాత రోజులు గుర్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని కరెంటు సంక్షోభం ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోలేక పోయిన కారణంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ, ” ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు. ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్ల మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా? 2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినపుడు అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈసారి ఎందుకు విఫలమైంది? సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారు. ఏపీ జెన్కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతారు తప్ప విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. 2019 సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్స్. ఈ నెల 29 వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55 .315 మిలియన్ యూనిట్లు మాత్రమే. ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే చేసే మొదట పని శుభం తో మొదలుపెడతారు, కొత్త ప్రాజెక్టులు శంకు స్థాపనలు,పెట్టుబడుల మీద ఒప్పందాలు; కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే చేసింది ఇళ్లు కూల్చివేతలు , పెట్టుబడుల ఒప్పందాల రద్దులు, భవననిర్మాణ కార్మికులకి పని లేకుండా చెయ్యటం, ఆశ వర్కర్ల ని రోడ్లు మీదకి తీసుకురావటం , కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం…మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుంది? ” అంటూ పవన్ కళ్యాాణ్ ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు.
అదే విధంగా, 151 సీట్లతో ప్రజలు వైఎస్సార్సీపీ పార్టీ కి పవర్ అప్పగిస్తే, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనీసం కరెంటు పవర్ ఇవ్వలేకపోతోంది అంటూ వ్యాఖ్యలు చేసారు పవన్ కళ్యాణ్. రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నా ఒక తెలుగు మీడియా కూడా ఈ సమస్యను హైలెట్ చేయకపోవడం గమనార్హం. మరి పవన్‌కళ్యాణ్ ఈ సమస్యను ప్రస్తావించిన తర్వాత అయినా ప్రభుత్వం తగిన విధంగా ప్రతిస్పందిస్తుందా , ప్రజల కరెంటు కష్టాలు తీరుస్తుందా అన్నది వేచి చూడాలి.