హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తన భార్య పద్మావతిని గెలిపించుకోవడం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇజ్జత్ కా సవాల్ అయిపోయింది. అందుకే, నల్గొండ జిల్లాకి చెందిన నాయకులందర్నీ రంగంలోకి దింపారు. ఎడమొహం పెడమొహంగా ఉంటూ వచ్చిన కోమటిరెడ్డి సోదరులు, జానారెడ్డి మద్దతు కూడగట్టారు. ఇదే సమయంలో ఎంపీ రేవంత్ రెడ్డిని ఈ ఉప ఎన్నిక విషయంలో మొదట్నుంచీ దూరం పెట్టే ప్రయత్నమే చేశారు. అభ్యర్థి ఎంపికలో కూడా రేవంత్ అభిప్రాయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అది చాలదన్నట్టుగా విమర్శలు కూడా చేశారు. కానీ, ఉప ఎన్నికల ప్రచారం దగ్గరకి వచ్చేసరికి రేవంత్ ప్రస్థావన లేకుండా చేయలేకపోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి! నిజానికి, హుజూర్ నగర్ ఎన్నిక అంశంలో రేవంత్ కాస్త వెనక్కి తగ్గి… వివాదాల్ని పక్కనపెట్టి పార్టీని గెలిపించాలనే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. గతవారంలో ఖమ్మంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఇదే అంశం మాట్లాడారు కూడా.
పద్మావతిని గెలిపించాలనీ, తెరాసకు బుద్ధి చెప్పాలంటూ రేవంత్ రెడ్డి ఓ ప్రెస్ మీట్లో చెప్పిన మాటల వీడియో క్లిప్పింగ్ ని… పద్మావతి ఫొటో యాడ్ చేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడుతున్నారు. స్థానికంగా సోషల్ మీడియాలో ఇదే వీడియోతో ప్రచారం చేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. హుజూర్ నగర్లో జరిగిన ప్రచార సభలో ఉత్తమ్ తోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ ని ఓడగొట్టినా, ప్రశ్నించే గొంతు ఉండాలనే ఉద్దేశంతో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ప్రజలు ఆదరించారన్నారు. కేసీఆర్ పార్టీ ఎంత డబ్బు పంచినా కూడా తనని, ఉత్తమ్ కుమార్ రెడ్డినీ, మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డిని ప్రజలు ఓట్లేసి గెలిపించారన్నారు. రేవంత్ పేరును కోమటిరెడ్డి చెప్పేసరికి… సభలో ఒక్కసారిగా గొల్లుమంటూ ప్రజలు స్పందించడం విశేషం. కొండా సురేఖ మాట్లాడుతున్నప్పుడూ ఇలానే జరిగింది. అందరూ కలిసి కేసీఆర్ ని ఎదుర్కొంటున్నామంటూ రేవంత్ పేరును ఆమె ప్రస్థావించారు.
రేవంత్ పేరు చెబితే స్పందన ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఆయన ఎక్కడో మాట్లాడిన వీడియోలను ప్రచారం కోసం వాడుకుంటున్నారు. కానీ, ఆయన్ని నేరుగా ఆహ్వానించి ప్రచారం చేయించడానికి సిద్ధంగా లేరు. హుజూర్ నగర్లో గెలుపే ప్రధానం అనుకున్నప్పుడు, పార్టీ భవిష్యత్తుపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే పరిస్థితులు ఉన్నాయని చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తే అదనపు ఊపు వస్తుందని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు, పొత్తులు పెట్టుకుని మరీ తెరాస సిద్ధమౌతున్నప్పుడు… ఇంకా భేషజాలకు పోతుంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు?