ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌పై వ్యతిరేకత లేదని.. అలాగని.. అనుకూలత కూడా లేదని.. కర్ర విరగకుండా.. పాము చావకుండా.. అన్న పద్దతిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించడం లేదేమని.. సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన సైలెంట్‌గా మీడియా ముందుకు వచ్చారు. తన అభిప్రాయాలను వెల్లడించారు. అయితే.. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా.. పోలవరం లాంటి అంశాలపై ఆయన పెద్దగా దృష్టి పెట్టలేదు. నవరత్నాల అమలులో చిన్న తేడా వచ్చినా తీవ్ర వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతానికైతే… ఇసుక,
విద్యుత్ కోతలు ప్రభుత్వానికి మైనస్‌గా కనిపిస్తున్నాయన్నారు.
పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ 50 శాతానికి పైగా ఓట్లతో ముఖ్యమంత్రులైనా.. తొమ్మిది నెలల్లోనే దిగిపోయారని గుర్తు చేశారు. జగన్‌కు ఓ రకంగా హెచ్చరికలు పంపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ అత్యంత తీవ్రంగా విమర్శించేవారు. చిన్న చిన్న అంశాలపై కూడా.. ఆయన గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి లా పాయింట్లతో వాదించేవారు. అయితే.. ఇప్పుడు.. నాలుగు నెలల కాలంలో.. జగన్మోహన్ రెడ్డి.. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే.. దానిపై ఉండవల్లి స్పందించ లేదు.
గతంలో.. జగన్మోహన్ రెడ్డి పాలనపై ఆరు నెలల వరకూ స్పందించనని ప్రకటించారు. అయితే.. నాలుగు నెలలకే మీడియా ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి కాస్త నైతిక మద్దతు ఇచ్చేందుకు ఉండవల్లి ప్రయత్నించినట్లుగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో… 50 శాతం ఓట్లు రావడం అన్నది పాయింట్ కాదని.. ప్రభుత్వం కూలిపోవడానికి ఏమైనా జరగొచ్చన్న హెచ్చరికలతో.. మరింత జాగ్రత్తగా ఉండాలన్న సూచనలు పంపినట్లుగా భావిస్తున్నారు.