జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ మరణించిన తరువాత, అంతవరకు బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం నడిపించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చింది. బీజేపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకి ఆ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కానీ వేరే గత్యంతరం లేకపోవడంతో బీజేపీకి షరతులు విధించి దానికి అంగీకరిస్తేనే బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెపుతున్నారు.
శ్రీనగర్ లో నిన్న పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడుతూ “రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయమని మనం కేంద్రప్రభుత్వాన్ని కోరాము. అందుకోసం మనకు నమ్మకం కలిగేవిధంగా కొన్ని రాజకీయ చర్యలు చేప్పట్టాలని కోరాము. ఆ చర్యల ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకి సానుకూల వాతావరణం కలుగుతుందని మనము సూచించాము. మనం రాజకీయ చర్యల గురించి అడుగుతుంటే కేంద్రప్రభుత్వం ఆర్ధిక అంశాల గురించి మాట్లాడుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమయిన వాతావరణం కల్పించే దిశలో నిర్దిష్టమయిన చర్యలు చేపట్టకుండా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే మనం ప్రస్తుత విధానాన్నే కొనసాగిస్తాము. ఎవరి ఒత్తిళ్ళకి లొంగే ప్రసక్తి లేదు,” అని చెప్పారు.
ఆమె చెప్పిన ప్రస్తుత విధానం అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కాలక్షేపం చేయడమే. అంటే ఆమె బీజేపీ మరికొంత గడువు ఇవ్వాలని భావిస్తున్నారనుకోవచ్చును. ఒకవేళ కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోయినట్లయితే తమకు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆమె సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును. కానీ దాని వలన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారం కొరవడవచ్చును. పాకిస్తాన్ తో సరిహద్దు కలిగి నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కేంద్రం సహకారం లేకపోతే మనుగడ సాగించడం చాలా కష్టమవుతుంది. బహుశః అందుకే బీజేపీతో కటీఫ్ చెప్పడానికి పిడిపి వెనుకంజ వేస్తోందని చెప్పవచ్చును. కానీ ఇలాగే చేతులు ముడుచుకొని కూర్చొంటే, ఏదో ఒకరోజు పిడిపి ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోనో లేక బీజేపీలోనో చేరిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక మహబూబా ముఫ్తీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ బీజేపీని, కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు మాట్లాడుతున్నప్పటికీ, ఆమె కూడా కేంద్రప్రభుత్వం పిలుపు కోసం ఎదురుచూస్తున్నారేమో?