కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్ని విమర్శలు ఎదురౌతున్నా, విపక్షాల నుంచి నిరసన వ్యక్తమౌతున్నా దేన్నీ ఖాతరు చేయకుండా దూసుకెళ్లాలని అనుకున్నారు. కానీ, ఆ ప్రయత్నాలకు వరుసగా కోర్టు బ్రేకులు వేస్తోంది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చేయడానికి సిద్ధమైన ప్రభుత్వానికి ఆ మధ్య హైకోర్టు మొట్టికాయలు వేసి, అది హెరిటేజ్ భవనమనీ, ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకోకూడదంటూ కోర్టు ఆపింది. ఇప్పుడు పాత సెక్రటేరియట్ కూల్చివేత మీద కోర్టు ఆగ్రహించింది. ఇప్పటికే సెక్రటేరియట్ ను ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే. దసరా సెలవులు ముగిసేలోగా పాత భవనాన్ని కూల్చేద్దామని ప్రభుత్వం భావించింది. నిన్నటి కేబినెట్ లో కూడా అదే అంశమ్మీద నిర్ణయం ఉంటుందని తెరాస వర్గాలూ చెప్పాయి. కానీ, చివరి నిమిషంలో కోర్టు బ్రేకులు వేసింది.
పాత సచివాలయ భవనాన్ని కూల్చొద్దనీ, కోర్టుకు దసరా సెలవులు అయ్యే వరకూ ఆగాలంటూ హైకోర్టు ఆదేశించింది. పిటిషన్లు కోర్టులో విచారణలో ఉండగా చర్యలు చేపడితే, అది ఉల్లంఘన అవుతుందని వ్యాఖ్యానించింది. కూల్చివేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విధానపరమైంది అవునో కాదో తేలాల్సి ఉందనీ, ప్రభుత్వ నిర్ణయం నిబంధనలకు లోబడి ఉందో లేదో అధ్యయనం చేయాల్సి ఉందని కోర్టు చెప్పింది. ప్రభుత్వ భవనాలు కూల్చివేతలు, కొత్త నిర్మాణ ప్రయత్నాలను సవాల్ చేస్తూ కొంతమంది కాంగ్రెస్ నేతలతోపాటు ఇతరులు దాఖలు చేసిన పిల్స్ మీద కోర్టు ఇలా స్పందించింది. ఈనెల 14న తదుపరి విచారణ చేపడతామని చెప్పింది.
అసెంబ్లీ, సెక్రటేరియట్… ఈ రెండు భవనాల విషయంలో కేసీఆర్ సర్కారు ప్రయత్నాలకు కోర్టు బ్రేకులు వేసింది. ఎర్రమంజిల్ భవనం కూల్చొద్దని గత నెల 17న తేల్చి చెప్పడంతో… అది కాస్తా ఆగిపోయింది. ఈలోగా కనీసం సెక్రటేరియట్ కూల్చివేత పనులు మొదలుపెట్టి… దీన్నైనా పూర్తి చేద్దామనుకుంటే ఈ ప్రయత్నాన్నీ కోర్టు తాత్కాలికంగా ఆపింది. వాస్తవానికి, జూన్ 27న ఈ రెండు భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అప్పట్నుంచీ చాలా విమర్శలు మొదలయ్యాయి. ఉన్న భవనాలు సరిపోవా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే సరిపోయిన భవనాలను ఇప్పుడు కొత్తగా కూలగొట్టి నిర్మించాల్సిన అవసరం ఏముందనీ, ప్రజాధనం వృథా చేయడమే అవుతుందంటూ నిరసనలు వ్యక్తమౌతున్నా కేసీఆర్ సర్కారు పట్టించుకోలేదు. ప్రస్తుతం కోర్టు స్పందించిన నేపథ్యంలో విపక్షాలు మరోసారి తీవ్ర విమర్శలు చేసే అవకాశముంది.