కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా వాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే అంశమై ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఈ మధ్య వరుసగా సమావేశమయ్యారు. భారీ ఎత్తున ప్రాజెక్టును నిర్మించాలని కూడా ప్రతిపాదించారు. అయితే, ముఖ్యమంత్రుల స్థాయిలో ఈ ప్రతిపాదన సుహృద్భావ వాతావరణంలోనే జరుగుతున్నట్టు కనిపిస్తున్నా… అధికారుల స్థాయికి వచ్చేసరికి రెండు రాష్ట్రాల నుంచి విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. నీటి వాటాలకు సంబంధించి ఇప్పటికే రెండు రాష్ట్రాలు మధ్యా అపరిష్కృతంగా చాలా సమస్యలున్నాయి. ముందుగా వాటిపై ఒక స్పష్టత వస్తే తప్ప… ఈ తాజా ప్రతిపాదన ముందుకెళ్లే అవకాశం ఉండదనే అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే, ఈ నేపథ్యంలో కేంద్రం కొంత చొరవ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నెల 4న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో అపెక్స్ కమిటీలో భేటీ అవుతున్నారు. కేంద్ర జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వలో ఈ సమావేశం జరుగుతుంది. గోదావరి, కృష్ణా లింక్ కి సంబంధించిన ఒప్పందం కూడా ఈ నేపథ్యంలోనే జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రా, తెలంగాణలు గతంలో చాలాసార్లు కేంద్రానికి ఫిర్యాదులు చేశాయి. గోదావరి మీద తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం, సీతారామ, తుపాకుల గూడెం ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అలాగే, పోలవరం ఎత్తు తగ్గించాలంటూ తెలంగాణ సర్కారు కూడా ఫిర్యాదు చేసింది. పట్టిసీమకు తరలిస్తున్న నీటికి సమానంగా, తమకూ నీటి కేటాయింపులు కావాలంటూ తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఈ మధ్య వరదల నేపథ్యంలో గోదావరి నుంచి సముద్రంలోకి తరలిపోతున్న జలాల్లో కొంత ఏపీ సర్కారు వాడుకుందనీ, దానికి సరైన లెక్కలు చెప్పలేదని కూడా వాదిస్తోంది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలపై ఏపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల మధ్యా కొన్ని వివాదాలున్నాయి. కేంద్రంతోపాటు, బోర్డుల దగ్గర ఉన్న ఈ వివాదాలపై తాజా సమావేశంలో పరిష్కారం లభించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఎందుకంటే, ఇద్దరు ముఖ్యమంత్రులూ సయోధ్యతో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కృష్ణా గోదావరి జలాలను వాడుకునే ప్రాజెక్టును నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారు. కాబట్టి, ప్రస్తుతం ఉన్న వివాదాలపై సర్దుకుపోయే ధోరణిని ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే, ఆ సర్దుకుపోయే ధోరణి సీఎం జగన్ నుంచే కాస్త ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తోంది! ఎలా అంటే… పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని తాము కోరితే, జగన్ సానుకూలంగా స్పందించారని గడచిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న డిజైన్ ప్రకారం ఉన్న ఎత్తు తగ్గిస్తే ఆశించిన ప్రయోజనాలు ఈ ప్రాజెక్టుతో నెరవేరవు అనే అభిప్రాయమూ ఉంది. కనీసం దీనిపై చర్చైనా జరగకుండానే ఎత్తు తగ్గించేందుకు జగన్ ఓకే అనేస్తే ఎలా విమర్శలూ ఉన్నాయి. ఢిల్లీలో జరిగే అపెక్స్ కమిటీ మీటింగులో కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తారా అనే అనుమానాలూ కలుగుతున్నాయి!