Sye Raa Review
తెలుగు360 రేటింగ్: 3.25/5
కులాని లొంగనివాడు
మతానికి పడిపోనోడు
వర్గానికి విధేయత చూపనోడు కూడా `దేశం` అంటే చటుక్కున తల వంచుతాడు. ఎందుకంటే… దేశ భక్తి వీటన్నింటినీ మించిన ఓ ఎమోషన్. అది దేన్నయినా బీట్ చేస్తుంది. అందుకే మన కథల్లో దేశభక్తిని కమర్షియల్ అంశంగా చూపించడానికి రచయితలు, దర్శకులు తరచూ ప్రయత్నిస్తుంటారు.
ఓ భగత్ సింగ్ కథ విన్నప్పుడు
ఓ అల్లూరి సీతారామరాజు గాథ తెలుసుకుంటున్నప్పుడు రోమాలు నిక్కబొడుస్తుంటాయి.
ఆ కథలు ఎన్నిసార్లు విన్నా, ఎంత మంది చెప్పినా అందులోని ఎమోషన్ మనల్ని వెంటాడేస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంది. మరి మనకు సంబంధించిన ఓ వీరుడి కథ, ఎవ్వరూ చెప్పని ఓ అచ్చమైన తెలుగువాడి కథని – సినిమాగా చూపిస్తే?
ఆ ఆలోచన నుంచి పుట్టిన సినిమా `సైరా నరసింహారెడ్డి`. స్వాతంత్య్ర సమరోత్సాహానికి తొలి శంఖం పూరించిన ఓ యోధుడు.. నరసింహారెడ్డి. మన దురదృష్టం ఏమిటంటే… అతని కథకు అంతగా ప్రాచూర్యం లభించకపోవడం. మరో రకంగా చూస్తే సైరా టీమ్ బలం కూడా అదే. ఎవరూ చెప్పలేదు కాబట్టి – ఇప్పుడు చెబితే కొత్తగా ఉంటుంది. ఎవ్వరూ చూపించలేదు కాబట్టి, ఇప్పుడు ఏం చూపించినా వర్కవుట్ అయిపోతుంది. ఈ కథని ఎప్పటి నుంచో సినిమాగా తీయాలన్నది చిరు ఆలోచన. పన్నేండుళ్ల క్రితం ఈ కథకు బీజం పడితే.. రెండేళ్ల క్రితం మొలకెత్తి, ఇప్పుడు మహావృక్షంలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ వృక్షం నీడలో ఎన్ని రికార్డులు సేద తీరబోతున్నాయి? తెలుగు సినీ అభిమానులకు అవి అందించబోతున్న ఫలాలు ఎలా ఉన్నాయి?
బ్రిటీష్ వారి దౌర్జన్యాలకు, దుర్మార్గాలకూ భారతీయులు బలైపోతున్న కాలమది. రేనాడు ప్రాంతంలో 61 ప్రాంతాల్ని పాలేగాళ్లు పరిపాలిస్తుంటారు. కాకపోతే… పెత్తనమంతా బ్రిటీషు దొరలదే. పంట పండడకపోయినా సరే.. ప్రభుత్వానికి శిస్తు కట్టాల్సిందే అని బ్రిటీషు కలెక్టరు హుకూం జారీ చేస్తాడు. అలసిపోయిన ప్రజలకు.. వాళ్ల కష్టాలకూ, కన్నీళ్లకూ బాసటగా నిలుస్తాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
ఈ భూమి మాది, పంట మాది, కష్టం మాది.. నీకెందుకు శిస్తు కట్టాలి? అంటూ తొలిసారి బ్రిటీషు దొరలపై యుద్ధం ప్రకటిస్తాడు. కానీ.. తనకంటూ ఓ సైన్యం లేదు. మిగిలిన పాలేగాళ్లను కలుపుకోవాలంటే.. వాళ్లలో ఐకమత్యం ఉండదు. ఈ దశలో రేనాడు సూరీడు సైరా ఎలా ఉద్యమించాడు? ఆ సంగ్రామంలో తనకు బాసటగా నిలిచినవాళ్లెవరు? వెన్నుపోటు పొడిచిన వాళ్లెవరు? దేశం కోసం తానేం చేశాడు? అనేదే… ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కథ.
చరిత్రలో ఉన్న విషయాలకు కల్పన జోడించి తీసిన సినిమా ఇదని, సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నామని టైటిల్ కార్డు పడక ముందే దర్శకుడు చెప్పేశాడు. కాబట్టి కొంత చరిత్ర, ఇంకొంత కల్పనల మిశ్రమంగా సైరాని చూడాలి. దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ ఎక్కడడెక్కడ తీసుకున్నాడన్నది చరిత్ర తెలిసినవాళ్లెవరికైనా సరే, అర్థమైపోతుంది. ఓ కథని తెలుగు సినిమా పడికట్టు సూత్రాలకు, కమర్షియల్ విలువలకు అనుగుణంగా మలచాలంటే, ఆ మాత్రం కప్పదాటు వ్యవహారాలు తప్పకపోవొచ్చు. `సైరా` ప్రారంభం… చాలా మామూలుగా, నిదానంగా సాగుతుంది. బ్రిటీషువారి దౌర్జన్యాలు హెచ్చుమీరడం, వాళ్లపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేయడం దగ్గర నుంచి కథ ఊపందుకుంటుంది. విశ్రాంతి ముందు సన్నివేశాలు రోమాంఛితంగా సాగాయి. చిరంజీవి నుంచి అభిమానులు ఆశించే హీరోయిజం అంతా ఆయా సన్నివేశాల్లో కనిపిస్తుంది. మధ్యలో తమన్నా, నయనతారల పాత్రలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రూపొందించిన సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను ఉద్దేశించి తీసినవే అయినా, అవెందుకో భారంగా సాగుతాయి. కాకపోతే ప్రతీ సన్నివేశాన్ని రిచ్‌గా తీయడంతో విజువల్ గ్రాండియర్ వల్ల, స్టార్ కాస్టింగ్ వల్ల, ఆయా సన్నివేశాల్నీ ఓపిగ్గా చూసేస్తాం. ద్వితీయార్థం కూడా హై ఎమోషన్‌తోనే ప్రారంభం అవుతుంది. యుద్ధ సన్నివేశాలు, పోరాటాలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు దర్శక నిర్మాతలు. అవన్నీ `సైరా`కి విజువల్‌గా భారీదనం తీసుకొచ్చాయి. కానీ.. యాక్షన్ మితిమీరిపోతుందనిపిస్తుంటుంది. ఇలాంటి యుద్ధ సన్నివేశాలు బాహుబలి, గౌతమి పుత్ర శాతకర్ణిలలో ఇది వరకే చూసేశాం కూడా.
ఎమోషన్ పార్ట్ వరకూ ఈ సినిమాలో చాలా స్కోప్ ఉంది. పిడికెడు అన్నం కోసం ఓ పిల్లాడు అల్లాడిపోవడం, దాని చుట్టూ అల్లిన సన్నివేశాలు, సుబ్బయ్య ఎపిసోడ్, కలెక్టర్ తలని బ్రిటీష్ అధికారులకు పంపే సందర్భం.. ఇవన్నీ రోమాంఛితంగా సాగుతాయి. `సైరా` క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ, మెగా అభిమానులకు గూజ్ బమ్స్ ఇచ్చే మూమెంట్స్ ఇవి. అయితే.. ఇంకొన్ని చోట్ల అలాంటి మూమెంట్స్ దొరికినా – వాటిని సురేందర్ రెడ్డి సద్వినియోగ పరచుకోలేదు. తీసిన వరకూ బాగానే ఉన్నా – వాటిని ఇంకాస్త బాగా ఎలివేట్ చేయొచ్చు అనిపిస్తుంటుంది. దేశభక్తి అనేది చాలా ముఖ్యమైన మోటీవ్. దాన్ని సరైన సమయంలో, సరైన దిశలో… కథలోకి ఇమడ్చలేకపోయాడు. అందుకు సంబంధించిన ఏ సన్నివేశమైనా బలవంతంగా ఇరిచింకినట్టే అనిపిస్తుంటుంది. ద్వితీయార్థం మరీ లెంగ్తీగా సాగింది. సైరాకి వెన్నుపోటు పొడిచే సన్నివేశం, దీపం వెలిగించే ఎపిసోడ్ ఇవి కీలకమే కావొచ్చు.కానీ వాటిని మరీ లాగ్ చేసి చూపించడం వల్ల నిడివి ఎక్కువైపోయింది. ఉరికంబం ఎక్కేముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చెప్పే సంభాషణలు, క్లైమాక్స్ షాట్… మళ్లీ అభిమానులకు నచ్చేస్తాయి. దాంతో ఓరకమైన సంతృప్తితో ఫ్యాన్స్ థియేటర్ నుంచి బయటకు వస్తారు.
చిరంజీవి కలల సినిమా ఇది. అందుకోసం ఆయన చాలానే కష్టపడ్డారు. ఈ వయసులో కదలడం చాలా కష్టం. అందుకోసం ఆయన డూప్ సహాయం కూడా తీసుకోవాల్సివచ్చింది. చిరంజీవి వయసెంతో ఆయన అభిమానులకు కూడా తెలుసు. అలాంటప్పుడు దాన్ని దాచాలన్న ప్రయత్నం ఎందుకు? ఈ సినిమాలో చిరంజీవిని 30 ఏళ్ల యువకుడిగా చూపించే ప్రయత్నం చేశారు. చిరుని యాభై ఏళ్లవాడిగా చూపిస్తే తప్పేంటి అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్‌ని సైరా గురువుగా చూపించారు. సైరా గురువు పాత్రలో ఓ పెద్ద నటుడ్ని తీసుకురావాలన్న ఆత్రం తప్పితే, ఆ పాత్ర అమితాబ్ బచ్చన్ స్థాయికి సరిపోతుందా, లేదా? అనేది సరిచూసుకోలేదు. బిగ్ బీ మాత్రమే చేయగదిగిన పాత్ర అయితే బాగుండేది. నయన కంటే తమన్నా పాత్రకే ఎక్కువ స్కోప్ ఉంది. ఆ పాత్రని ముగించిన విధానం కథాగమనానికి ఉపయోగపడింది. తమన్నా కూడా బాగా నటించింది. సుదీప్ పాత్రకంటూ ఓ లక్ష్యం, ఉపయోగం ఉంటాయి. విజయ్ సేతుపతికి అదీ లేదు. ఆ పాత్రని సరిగా డిజైన్ చేయలేదనిపిస్తుంది. అదొక్కటే కాదు. చాలా పాత్రలు నామ్ కే వాస్తే అన్నట్టు మిగిలిపోతాయి. నిహారికకి ఒక్క డైలాగ్ కూడా లేదు.
టెక్నికల్‌గా బాహుబలి ఓ స్టాండర్డ్ సృష్టించింది. దాన్ని అందుకునే ప్రయత్నం, సాహసం చేసింది `సైరా` టీమ్. విజువల్‌గా `సైరా` ఉన్నతంగా ఉంది. కెమెరావర్క్, ఆర్ట్ పనితనం ప్రధమ స్థాయిలో ఉన్నాయి. అయితే `ఇది సీజీలో తీశారు` అనే విషయం అతి సులభంగా తెలిసిపోయేలా కొన్ని సీన్లు రూపొందించారు. ప్రతీ సన్నివేశంలోనూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తుంటారు. అందుకోసం టీమ్ ఎంత కష్టపడిందో అర్థం అవుతూనే ఉంటుంది. నేపథ్య సంగీతం ప్లస్ పాయింట్. డైలాగులు అక్కడక్కడ మెరుస్తాయి. కాకపోతే బుర్రా సాయిమాధవ్ రచనలో మునుపటి పదును తగ్గిందనిపిస్తుంది. నిర్మాతగా చరణ్‌కి వందకు వంద మార్కులు పడతాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సురేందర్‌రెడ్డి ఈ స్కేల్లో సినిమాని భుజాన వేసుకోవడం మామూలు విషయం కాదు. తన పాత్రని సమర్థవంతంగా నిర్వర్తించాడు. అయితే.. ఈ సినిమా టేకాఫ్ దగ్గర కాస్త తడబడ్డాడు. ఎమోషన్ పీక్స్‌లోకి తీసుకెళ్లగలిగే స్థాయి ఉన్న సన్నివేశాల్ని కూడా పైపైన టచ్ చేసి వదిలేశాడు. లేదంటే.. సైరా అంతిమ ఫలితం మరో స్థాయిలో ఉండేది.
మొత్తంగా ఓ విజువల్ గ్రాండియర్ కోసం, చిరంజీవి కోసం, ఓ దేశభక్తుడి కోసం చూడాల్సిన సినిమా ఇది. చరిత్ర పాఠాన్ని, తెలుగు సినిమా సూత్రాలకు అనుగుణంగా మార్చుకుని, పక్కా కమర్షియల్ సినిమాగా అందించడంలో మాత్రం సైరా విజయవంతమైంది.
ఫినిషింగ్ టచ్: సై.. సై.. సైరా
తెలుగు360 రేటింగ్: 3.25/5