సినిమా చూస్తే… పోలీసు అధికారుల పోస్టింగ్ పోతుందా.. ఏమిటి..? కామెడీగా .. అని అనుకోనవసరం లేదు. నిజంగానే.. సైరా నరసింహారెడ్డి సినిమా చూసినందుకు ఆరుగురు సబ్ ఇన్స్పెక్టర్లు .. తమ పోస్టింగ్‌లు ఊడగొట్టించుకున్నారు. వేకేన్సి రిజర్వ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ చేదు అనుభవం కర్నూలు జిల్లా పోలీసులకు ఎదురయింది. కోవెలకుంట్లలో విధుల్లో ఉన్న ఆరుగురు సబ్ ఇన్స్ పెక్టర్లు.. .అర్థరాత్రి తర్వాత.. ప్రారంభించిన బెనిఫిట్ షోకు వెళ్లారు. చక్కగా సినిమాను అస్వాదించారు. కానీ బయటకు వచ్చే సరికి.. వారికి ఎస్పీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. విధుల్లో ఉండి… పని మానేసి.. సినిమాకెళ్లినందుకు.. ఎస్పీ ఆగ్రహించారని.. వారిని తక్షణం.. వారి వారి పోస్టుల నుంచి బదిలీ చేశారని.. ఆ ఫోన్ సారాంశం.
దాంతో ఆ ఆరుగురు ఎస్ఐలకు నోట మాట రాకుండాపోయింది. తాము సినిమాకు వెళ్లిన విషయం .. ఎవరికీ తెలియదని ఆ అరుగురు ఎస్‌లు అనుకున్నారు. అదీ కూడా తెల్లవారుజామున కాబట్టి.. తాము డ్యూటీలో ఉన్నారని అనుకుంటారులేని లైట్ తీసుకున్నారు. కానీ.. కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. మాత్రం… అలా అనుకోలేదు. పోలీసు సిబ్బంది ఎలా పని చేస్తున్నారో.. ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా సైరా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చినందున.. ధియేటర్ల దగ్గర కూడా పోలీసులు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు. వీటి గురించి రివ్యూ చేస్తున్న సమయంలో.. ఈ ఆరుగురు ఎస్ఐల ఆచూకీ ఆయనకు తెలియలేదు.
వాళ్లేం చేస్తున్నారో ఆరా తీసేసరికి.. సైరా రక్షణ డ్యూటీలో కాకుండా… సైరాను చూసే మెగా అభిమానుల డ్యూటీలో ఉన్నారని తేలడంతో… ఎస్పీ పైరయిపోయారు. అయితే.. సినిమా చూసే వరకూ వారిని ఎస్పీ డిస్ట్రబ్ చేయలేదు. సినిమా చూసొచ్చిన తర్వాత నేరుగా బ్యాగులు సర్దుకుని… జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చేయమని సందేశం పంపారు. ఇంకెక్కడైనా ఎస్ఐ పోస్టులు ఖాళీ అయితే.. అక్కడ పోస్టింగ్ ఇస్తారు. లేకపోతే… సైరా సినిమాను.. మళ్లీ మళ్లీ చూస్తూ టైం పాస్ చేయడమే..!