ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సండూర్ పవర్ కంపెనీ నుంచి .. ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు విద్యుత్ పంపిణీ చేయకూడదు..?. ఈ సందేహం…టీడీపీ నేతలకు వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు.. విద్యుత్ కోతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొందామంటే బొగ్గు కొరివిలా మారింది. కరెంట్ అమ్మేవాళ్లు లేరు. ఈ పరిస్థితుల్లో… నగరాల్లో ఆరు గంటలకుపైగానే కరెంట్ కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ ఎక్సేంజీలలో కొందామన్నా విద్యుత్ దొరకడం లేదు. ఏపీ ప్రభుత్వం అవసరం గుర్తించారో లేక.. ఇంకేమైనా కారణాలున్నాయేమో కానీ.. ఎక్సేంజీలో అప్పటికప్పుడు దొరికే విద్యుత్‌ను యూనిట్‌కు ఏకంగా రూ. 11 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా.. ట్వీట్ చేశారు. ఇదేం చోద్యమని ప్రశ్నించారు.
ఇలాంటి సమయంలో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మరింత విశాల హృదయంతో ఆలోచించి.. తన సండూర్ పవర్ కంపెనీ విద్యుత్ ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పంపిణీ చేయవచ్చు కదా.. అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. సండూర్ పవర్ కంపెనీ కర్ణాటకలో ఉంది. కరెంట్ కూడా.. ఆ రాష్ట్రానికే అమ్ముతున్నారు. అది కూడా యూనిట్‌కు రూ. నాలుగున్నర వరకూ వసూలు చేస్తున్నారని.. కొద్ది రోజుల కిందట.. పీపీఏల విషయంలో గొడవ జరిగినప్పుడు.. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ బయటపెట్టారు. ఇప్పుడు.. అదే ధరకైనా.. ఆంధ్రప్రదేశ్ కు సరఫరా చేయాలన్న డిమాండ్ టీడీపీ వైపు నుంచి వస్తోంది. ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేసిందని కాకపోయినా.. విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న ప్రజలకు రిలీఫ్ ఇవ్వడానికి.. పరిశ్రమలు .. మూత పడకుండా ఉండటానికైనా.. కచ్చితంగా విద్యుత్ సరఫరా చేయాల్సిన బాధ్యత.. ఏపీ సర్కార్ పై ఉంది.
పవన, సౌర విద్యుత్ కంపెనీల నుంచి ఎలాగూ విద్యుత్ కొనడం లేదు కాబట్టి… ఇప్పుడు… ఇతర కంపెనీల నుంచి విద్యుత్ లభ్యత తగ్గిపోయింది. ఇప్పుడు సులువుగా.. ఏపీ సర్కార్ ముందున్న ఒకే ఒక్క మార్గం… జగన్మోహన్ రెడ్డికి చెందిన పవర్ ప్లాంట్ నుంచి ఏపీకి కరెంట్ సరఫరా చేయడం. అలా చేస్తే.. జగన్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరి సీఎం ఈ దిశగా ఆలోచిస్తారో లేదో మరి..!