వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ నేతలకు నాలుగు నెలలకు విరక్తి పుట్టేసింది. ” పోవాలి జగన్… పోవాలి జగన్” అనే నినాదాన్ని బీజేపీ నేతలు అందుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవటానికి 48 గంటల ముందే బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ కీలక నేత రాంమాధవ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. జగన్ ఢిల్లీకి వస్తున్నందున.. కన్నాను బీజేపీ అగ్రనేతలే ఢిల్లీకి పిలిపించారు. పనిలో పనిగా చేరికలు పూర్తి చేసారు. రాంమాధవ్, జేపీ నడ్డాతో జరిగిన భేటీలో ఏపీలోని తాజా పరిస్థితులపై కన్నా ఒక నివేదికను ఇచ్చారు.
పీపీఏలు, పోలవరం, గ్రామ సచివాలయ ఉద్యోగాలు, రివర్స్ టెండర్లు ఇలా.. అన్నింటి గురించి వివరించినట్లు తెలుస్తోంది. గ్రామ సచివాలయ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకిచ్చిన రిజర్వేషన్లు కూడా అమలు చేయకపోవటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి రావాలంటే.. అన్నీ ఆలోచించాలని కన్నా సూచించినట్లు చెబుతున్నారు. నిజానికి సచివాలయ ఉద్యోగాల్లో 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించకపోవటం వంటి అంశాలపై బీజేపీ హైకమాండ్ గుర్రుగా ఉంది. దీనిపై బీజేపీ ఆందోళనలు కూడా ప్రారంభించింది. విశాఖలో ఆ పార్టీ నేతలు ధర్నా చేశారు.
ఆ ధర్నాలో ఎన్నికలకు ముందు రావాలి జగన్.. కావాలి జగన్ అని.. ప్రజలు కోరారని, ఇప్పుడు అదే ప్రజలు పోవాలి జగన్ అనే పరిస్థితికి వచ్చారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. మోడీతో భేటీకి ముందే… బీజేపీ నేతలు.. తమ ధర్నాలు.. నివేదికల ద్వారా… జగన్కు.. తమ విధానంపై స్పష్టమైన సందేశం పంపారని అంటున్నారు.