గోదావరి కృష్ణ నదులు అనుసంధానం గురించి పలు మార్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమాలోచనలు చేశారు. ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు అధికారులు సమావేశాలు నిర్వహించారు. అయితే ఇంత వరకు ఒక అంగీకారానకి వచ్చిన దాఖలా లేదు. ఈ సమాలోచనలు మొదలైనప్పటి నుండి కూడా ప్రతి దఫా కూడా తెలంగాణ వేపు నుండి నదుల అనుసంధానం గురించి సమాచారం వెల్లడి అవుతున్నదే గాని ఆంధ్ర ప్రదేశ్ వేపు నుండి ఎట్టి సమాచారం లేదా ప్రభుత్వ వైఖరి ఏమిటో వెల్లడి కావడం లేదు.
ఇటీవల హైదరాబాద్ లో ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమైన తదుపరి ఎట్టి అధికారిక ప్రకటన వెలువడ లేదు. మీడియా ఎవరికి తోచిన కథనాలు వారు రాసుకోవడం తప్ప అధికారికంగా ముఖ్యమంత్రులు బ్రీఫ్ చేయడం గాని తుదకు మంత్రుల స్థాయిలో వివరణ ఇవ్వడం జరగ లేదు. కాని ముఖ్యమంత్రుల సమావేశం తదుపరి తెలంగాణ వేపు నుండి నదుల అనుసంధానం గురించి టిఆర్ఎస్ అధికార మీడియాలో వారి వేపు నుండి ప్రతి పాదనలు ప్రకటించ బడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ వేపు నుండి ఎట్టి సూచనలు బహిర్గతం కాలేదు.రాష్ట్ర ప్రభుత్వానికి ఏవైనా రిజర్వేషన్లు వుండ వచ్చు గాని ఇది ప్రజలకు చెందిన అంశం కాబట్టి అవతల తెలంగాణతో జరిపిన చర్చలు తమ వేపు నుండి చేసిన ప్రతిపాదనలు ప్రజల ముందుకు రావలసి వుంది. .. లేదా కనీసం తెలంగాణ వేపు నుండి బహిర్గతమైన ప్రతి పాదనలపై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరి వెల్లడి చేయాలి. ఎందుకంటే ఈ అంశం పార్టీ పరమైనది కాదు. రాష్ట్రంలోని విస్తృత ప్రజా బాహుళ్యానికి చెంది వందలాది సంవత్సరాల్లో ప్రజల భవిష్యత్తుకు చెందినది. లేకుంటే తెలంగాణ వేపు నుండి వ్యక్తమౌతున్న విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు వ్యవహరించ లేదనే అనుమానాలు వ్యక్తం కావడం సహజం. .
తెలంగాణ వేపు నుండి ప్రతి పాదనలు రూపొందించే సమయంలో అచ్చట జలవనరుల శాఖ తెలంగాణలోని పలువురు విశ్రాంత ఇంజనీర్లను సమావేశాలకు ఆహ్వానించి వారి అభిప్రాయాలను స్వీకరించారు. కాని ఎపి వేపు నుండి అట్టి సమావేశం జరిగినట్లు సమావేశానికి విశ్రాంత ఇంజనీర్లను పిలిచిన దాఖలా లేదు. ఇంత గోప్యత ఎందుకు పాటిస్తున్నారో తెలియదు.?
తెలంగాణ ఇంజనీర్లు మూడు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. అవి పరిశీలించితే అన్నిప్రతి పాదనలు ఎపికి తీవ్ర అన్యాయం చేసే విధంగా వున్నాయి. గమనార్హమైన అంశ మేమంటే మూడవ ప్రతి పాదన సరాసరి పోలవరం ప్రాజెక్టు నుండే తెలంగాణకు నీరు తరలించే విధంగా వుంది. .
1)రాంపూర్ నుండి శ్రీ శైలం అనుసంధానం. ఈ పథకంలోఎపికి పెను ముప్పులు పొంచి వున్నాయి. :ఈ పాటికే తెలంగాణలో ఆయకట్టు గల కాలువల ద్వారా నీరు తరలించడం.
రాంపూర్ నుండి తరలించే గోదావరి జలాలు ప్రత్యేక కాలువ ద్వారా కాకుండా కాకతీయ కాలువలో పడవేస్తారట. తదుపరి మూసీ నది ఆపై సాగర్ కు తరలించుతారట.
మార్గ మధ్యలో 10 నుండి 15 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని ఈ ప్రతి పాదనలో పొందు పర్చారు.ఈ విధానం ద్వారా .నీటి ఎద్దడి రోజుల్లో ఆపైన మిగిలితే నీరు సాగర్ కు తరలించే ప్రమాదం లేక పోలేదు. ఎపి ప్రభుత్వానికి చెంది లక్షలాది కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ పథకం ముందుగా తెలంగాణ అవసరాలు తీరిన తర్వాత సాగర్ చేరుతుంది…
2) ఇక-రెండవ ప్రతి పాదన. గోదావరి నదిపై కిన్నెరసాని సమీపం నుండి ఎత్తిపోతల పథకం ప్రారంమౌతుంది. మున్నేరు నదిపై బ్యారేజీ నిర్మాణం చేపడతారు. తదుపరి పాలేరు మీదుగా సాగర్ కు గోదావరి జలాలను తరలిస్తారు. మార్గ మధ్యలో తెలంగాణ ఆయకట్టు ఇదమిథంగా పేర్కొనలేదు గాని విధిగా స్థానికంగా ఆయకట్టు వుంటుంది. . గోదావరి జలాలను కృష్ణానదికి తరలించే క్రమంలో తెలంగాణలో వుండే స్థానిక ఆయకట్టు భవిష్యత్తులో ఎపి ప్రజల పాలిట ఉరి తాడుగా వుండబోతోంది. తుంగభద్ర అనుభవం కళ్ల ముందు వుండనే వుంది.
3)మూడవ పథకం. పూర్తిగా ఎపి భూభాగంలో నిర్మింపబడుతుంది. వాస్తవంలో ఎపి ప్రజలకు అనువైనదికూడా. తెలంగాణతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయ వచ్చు. ఇంచు మించు చంద్రబాబు హయాంలో ఈ ప్రతి పాదన రూపొందించ బడి వుంది. . . పోలవరం జలాశయం నుండి రోజుకు రెండు టిఎంసిల నీరు సాగర్ కు తరలించ వచ్చని తెలంగాణ ఇంజనీర్లు తేల్చి చెప్పారు. పోలవరం కుడి కాలువ ద్వారా పులిచింతలకు ఆపై సాగర్ కు గోదావరి జలాలను తరలించడం ఈ పథకం ఉద్దేశం. ఇందులో చంద్రబాబు నాయుడు హయాంలో రూపొందించిన వైకుంఠం పురం వద్ద బ్యారేజీ ప్రతి పాదించారు.
మరో విశేషమేమంటే మిగిలిన రెండు పథకాలన్నా మూడవ పథకం చాలా చౌకగా 35 వేల కోట్ల రూపాయల వ్యయంతో పూర్తవుతుందని తెలంగాణ ఇంజనీర్లే తేల్చారు. చంద్రబాబు నాయుడు వాసనలే పట్టని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకం వేపు ఎంత వరకు మొగ్గు తారో వేచి చూడాల్సిందే. . చంద్రబాబు నాయుడు ప్రకటించారనే నెపంతో దాదాపు 30 లక్షల మంది రైతుల రుణ మాఫీ పథకాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి ఈ అనుసంధానం ఎంత అద్భుతమైన పథకమైనా అమలు చేస్తారనే నమ్మకం లేదు.రుణ మాఫీకి చెందిన 30 లక్షల మంది రైతులు చంద్రబాబు నాయుడుకే ఓటు వేసి వుంటే పరిస్థితి ఇలా వుండేది కాదనే ఆలోచన కూడా ముఖ్యమంత్రికి రాక పోవడం అసంఖ్యాక రైతులు చేసుకున్న దురదృష్టం తప్ప వేరు కాదు. రాజకీయ వైషమ్యాలతో లక్షలాది మంది రైతులు బలి అయ్యారు. మరి నదుల అనుసంధానం ఇంత కన్నా మెరుగ్గా వుంటుందని భావించ లేము. .
మిగిలిన అంశాల మాట అటుంచినా తెలంగాణతో నదుల అనుసంధానంలో వైసిపి ప్రభుత్వం అవలంభించే విధానం తుదకు భావోద్వేగ అంశం రూపు దాల్చే అవకాశం లేక పోలేదు. . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిధులు నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు అదే నీళ్లతో స్నేహ హస్తం చాచడం అదీ ఎపికి అపకారం జరిగే విధంగా వుండటం ఎపిలో భావోద్వేగ అంశం కాకుండా వుంటుందా?
వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు