చూశారా… కేంద్ర ఎన్నికల సంఘం ఎంత వేగంగా స్పందించిందో! తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ఇలా ఫిర్యాదు చేశారో లేదో… అలా వెంటనే ప్రతిస్పందించింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర యంత్రాంగంపై నమ్మకం లేదనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కి అనుకూలంగా ఇక్కడి అధికారులు పనిచేస్తున్నారనీ, కాంగ్రెస్ తెరాసలు పెద్ద ఎత్తున డబ్బు వెదజల్లేందుకు అవకాశం ఉందనీ, అందుకే ప్రత్యేక అధికారిని నియమించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని టి. భాజపా నేతలు కోరారు. వెంటనే స్పందించేసిన ఎన్నికల సంఘం… సూర్యాపేట జిల్లా ఎస్పీ మీద బదిలీ వేటు వేసింది. అంతేకాదు, హుజూర్ నగర్ లో పార్టీల ఎన్నికల ఖర్చులు, ఇతర వ్యవహారాలను ప్రత్యేకంగా పరిశీలించేందుకు విశ్రాంత ఐ.ఆర్.ఎస్. ఆఫీసర్ బాలకృష్ణన్ ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎస్పీ వెంకటేశ్వర్లును హెడ్ క్వార్టర్స్ కి బదిలీ చేసి, ఆయనకు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని ఈసీ చెప్పింది. ఆయన స్థానంలో సూర్యాపేటకి ఎస్పీగా 2012 బ్యాచ్ కి చెందిన ఆర్. భాస్కరన్ ని నియమించింది. ఇక, హుజూర్ నగర్ కి ప్రత్యేక పరిశీలకుడిగా వస్తున్న బాలకృష్ణన్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అంటారు. నోట్ల రద్దు సమయంలో పెద్ద ఎత్తున రెయిడ్స్ చేసి వార్తల్లోకి ఎక్కారు. ఈ మధ్యనే కర్ణాటకలో కాంగ్రెస్ నేత శివ కుమార్ ఇంటిపై ఐటీ దాడులు కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. దీంతో రాజకీయంగా కూడా కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. ఇదీ ఆయన తాజా ట్రాక్ రికార్డ్!
ఎస్పీ బదిలీతో ఈసీ రంగంలోకి దిగేసింది. ఇక ప్రత్యేక అధికారిగా బాలకృష్ణన్ ఎలా వ్యవహరిస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. విచిత్రం ఏంటంటే… ఎన్నికల సంఘం చాలా త్వరగా స్పందించేయడం. నిజానికి, ఇది ఒక ఉప ఎన్నిక కాబట్టి… రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడమో, చర్యలకు ఆదేశించడమో చేస్తుందీ అనుకుంటే… ఏకంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చేసింది! హుజూర్ నగర్లో భాజపా పరంగా చూసుకుంటే… ఎస్పీ బదిలీ అంశం వారికి ప్రచారానికి బాగా పనికొచ్చేదే. ఇదిగో.. ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయన్నది వాస్తవం, అందుకే ఈసీ చర్యలు తీసుకుందీ అంటూ భాజపా నేతలు మాట్లాడటం మొదలుపెడతారు. ఈసీ చర్యలు అధికార పార్టీ తెరాసకు కొంత ఇబ్బంది కలిగిస్తాయేమో అనిపిస్తోంది.