హుజూర్ నగర్ ఉప ఎన్నికల పుణ్యమా అని… టి. కాంగ్రెస్ నాయకుల్లో మునుపెన్నడూ లేని ఐకమత్యం కనిపిస్తోంది. ఒకే జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానా రెడ్డిల మధ్య ఎప్పుడూ పొసిగేది కాదు. వీళ్ల మధ్య సయోధ్య లేదనేది బహరంగ రహస్యమే. ఆధిపత్య పోరులో వీరంతా ఉన్నారు. అయితే, హుజూర్ నగర్ ఉప ఎన్నిక రావడం, ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి చెక్ చెప్పాలన్న ఏకైక లక్ష్యం వీళ్లని దగ్గర చేసింది. ఈ వీక్ పాయింట్ ని ప్రచారాంశంగా మార్చుకుంటున్నారు మంత్రి కేటీఆర్. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలు జీ హుజూర్ అనక తప్పదనీ, తెరాస గెలిస్తే జై హుజూర్ అవుతుందని కేటీఆర్ అన్నారు. ఆగమాగం కాకుండా, చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రజలు ఓట్లెయ్యాలన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారనీ, ఆ మాట తప్పారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్థానిక సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉత్తమ్ ఏనాడైనా కలిశారా అని ప్రశ్నించారు. ఈ జిల్లాకు చెందిన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో ఉత్తమ్ గతంలో ఎప్పుడైనా మాట్లాడారా అన్నారు. కనీసం జిల్లా సమావేశాలకైనా ఈ ఇద్దరితో కలిసి ఉత్తమ్ పాల్గొన్న దాఖలాలు ఉన్నాయా అన్నారు. తన భార్య పద్మావతి ఓటమి తప్పదని ముందే తెలిసినా కూడా ఆమెనే నిలబెట్టారన్నారు కేటీఆర్.
ఉత్తమ్, జానా, కోమటిరెడ్డిల మధ్య కొత్త ఐకమత్యంపై ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ దగ్గర సరైన వాదన ఏదీ ఉన్నట్టు కనిపించడం లేదు. రేవంత్ రెడ్డిని ప్రచారంలోకి దించితే కేటీఆర్ వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్ ఇచ్చినట్టు అవుతుంది. అయితే, ఆయన్ని ప్రచారంలోకి తీసుకుని రావడం ఈ ముగ్గురు నేతలకూ ఇష్టం లేదాయే! కేటీఆర్ రోడ్ షోకి కౌంటర్ గా రేవంత్ ని ప్రచారానికి పిలవాలన్న డిమాండ్ కార్యకర్తల్లో ఉందనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. కానీ, ఆ వాతావరణం ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఆధిపత్య పోరుతో ఇబ్బందిపడతారు, ఇప్పుడు ఐకమత్యం ప్రదర్శిస్తున్నా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ నేతల్లో ఉంది. తామంతా ఒకటే అనే ఇమేజ్ కాకుండా.. తమలో కొందరు మాత్రమే ఒకటి అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఇదే తెరాసకు బాగా కలిసొచ్చే ప్రచాస్త్రంగా కనిపిస్తోంది.