ఎఫ్ 2తో సూపర్ హిట్ కొట్టిన వెంకీ.. ఆ తరవాత సినిమాల ఎంపికలో వేగం చూపించాడు. వెంకీ మామా పట్టాలపై ఉండగానే నాలుగు కథల్ని ఒకే చేసుకున్నాడు. అయితే.. ఆ సినిమాల విషయంలో ఇంకా వెంకీ ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. వెంకీ కోసం కథలు సిద్ధం చేసుకున్న దర్శకుల జాబితాలో ఉన్న త్రినాథరావు నక్కిన.. ఇప్పుడు పక్కకు తప్పుకున్నాడు కూడా. అలా వెంకీ చేతిలోని కథ జారిపోయినట్టైంది. హలో గురు ప్రేమ కోసమే తరవాత త్రినాథరావు నక్కిన తో వెంకీ సినిమా ఓకే అయ్యింది. అప్పట్లో త్రినాథరావు ఓ లైన్ చెప్పడం, అది వెంకీకి నచ్చడం జరిగాయి. అయితే.. ఆ లైన్‌ని కథగా డవలెప్ చేయడంలో త్రినాథరావు బాగా ఆలస్యం చేశాడు. అంతే కాదు.. ఈ ప్రాజెక్టులోకి సురేష్‌బాబు ఎంట్రీ ఇచ్చాక సమీకరణాలు మారాయి.
వెంకటేష్ కోసం ఓ పోలీస్ పాత్రని సృష్టించుకున్నాడు త్రినాథరావు. ఆ కథలో పటాస్, టెంపర్ లక్షణాలు మెండుగా కనిపించాయట. అంతేకాదు.. ఇందులో పాత్రలో అపరిచితుడు లక్షణాలు కనిపిస్తాయట. కొన్నిసార్లు నిజాయతీపరుడిగా, ఇంకొన్నిసార్లు లంచగొండిగా వెంకీ పాత్ర కన్‌ఫ్యూజ్ చేస్తుంటుందని, లైన్‌గా చెప్పినప్పుడు ఆ పాత్ర బాగున్నా.. ట్రీట్‌మెంట్ పూర్తయ్యాక కిక్ తగ్గిందని, అందుకే కథ మార్చమని త్రినాథరావుని ఫోర్స్ చేయడం ప్రారంభించారని, అది నచ్చక త్రినాథరావు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. అలా.. వెంకీ చేయాల్సిన ఓ సినిమా ఆగిపోయింది.