చంద్రబాబు హయాంలో కరెంట్ పరిస్థితి దిగజారిందని.. అప్పులు పెరిగిపోయాయని.. వాదిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి.. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్ మరో సారి షాక ఇచ్చారు. జగన్ సీఎంగా ఉన్న ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో..డిస్కంల నష్టాలు.. ఏడు రెట్లు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2019 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల వార్షిక నష్టాలు రూ. 1, 563 కోట్లకు చేరాయని.. ఇది 2018తో పోలిస్తే 7 కోట్లు ఎక్కువని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న డిస్కంలు… సేకరించే ప్రతి యూనిట్‌కు 39 పైసలు నష్టపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వశాఖలు, పట్టణ స్థానిక సంస్థల నుంచి డిస్కంలకు రావాల్సిన బకాయిలు రూ. 5, 542 కోట్ల రూపాయలకు చేరాయని వాటిని తక్షణం చెల్లించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రవేశ పెట్టిన ఉదయ్ పథకంలో భాగస్వామి. ఈ పథకం కింద డిస్కంల పనితీరును సమీక్షించినప్పుడు అవి దిగజారుతున్నట్టుగా తేలిందని.. ఆర్కేసింగ్ స్పష్టం చేశారు. నష్టాలను దశలవారీగా స్వీకరించాల్సిన ప్రభుత్వం… ఇంతవరకూ ఆ పని చేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం నిర్వహణ, ఆర్థికపరంగా ఏపీ డిస్కంల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్కే సింగ్ లేఖలో హెచ్చరించారు. సీఎం వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని వాటిని సంస్కరించాలని సూచించారు.
విద్యుత్ విషయంలో.. ఏపీ సర్కార్‌కు.. కేంద్రానికి పొసగడం లేదు. పీపీఏల విషయంలోనే మొదటగా.. జగన్మోహన్ రెడ్డి తీరును కేంద్రం వ్యతిరేకించడం ప్రారంభించింది. ఆ తర్వాత డిస్కంల నష్టాలకు ప్రస్తుత ప్రభుత్వమే కారణమన్నట్లుగా ఆర్కేసింగ్ లేఖ రాశారు. పైగా చంద్రబాబు హయాంలో.. డిస్కంల నష్టల కన్నా… ఏకంగా.. ఆరు నెలల్లో ఏడు రెట్లు పెరగడం ఏమిటని… ఆర్కేసింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానితో భేటీకి వెళ్లే సమయంలోనే బయటకు వచ్చిన ఆర్కేసింగ్ లేఖ ఏపీ విద్యుత్ వర్గాల్లో కలకలం రేపుతోంది.