By pulagam chinnarayana
‘శివ’ అనే ఒకే ఒక్క సినిమా లేకపోయుంటే ? ఒక్కసారి ఆలోచించండి …ఈ 30 ఏళ్లలో తెలుగు సినిమా ఎలా ఉండేదో!?! ఊహించడానికే ఇబ్బంది గా ఉంది కదూ! నిజంగానే అప్పట్లో అలా ‘శివ’ తాండవం జరక్కపోయింటే ఇన్ని మలుపులు ,ఇన్ని గెలుపులు,ఇన్ని మెరుపులు చూసుండే వాళ్ళం కాదేమో! అప్పటివరకూ కొత్త కుర్రాళ్ళకి దర్శకత్వం ఇవ్వాలంటే భయపడే తెలుగు నిర్మాతలకి ధైర్యం పెరిగింది. ఎందరో కొత్త దర్శకులకి అవకాశాలు పెరిగాయి. కొత్త మార్పులొచ్చాయి. 30 ఏళ్ళ శివ గురించి 30 సార్లు మాట్లాడుకున్నా తప్పులేదు. ఇది శివోగ్రఫీ….
సెల్యులాయిడ్‌పై శివతాండవం ‘శివ’
1989 అక్టోబర్ 5.థియేటర్లో సినిమా మొదలైంది.పావుగంట గడిచింది.హీరో రెండు, మూడు ముక్కల డైలాగులు తప్ప పెద్దగా మాట్లాడటం లేదు.కాలేజీ చుట్టూ కెమెరా తిరుగుతోంది.ప్రేక్షకుడి బుర్ర నిండా సందేహలపుట్ట పెరగసాగింది.హీరో డైలాగుల మీద డైలాగులు చెప్పడేంటి?హీరోయిన్ వెనుకపడడేమిటి?ఈ డైరెక్టర్ ఎవడ్రా బాబూ.. బి.సి. కాలంవాడిలాగా ఉన్నాడు?ఈలోగా..తెరమీద ఒక కుర్ర విలన్ ప్రత్యక్షమయ్యాడు.హీరోయిన్ని ఏదో అనేసరికి హీరో అడ్డుపడ్డాడు.సైకిల్‌స్టాండ్ దగ్గర తన గ్యాంగ్‌తో కలిసి హీరో కోసం ఎదురుచూస్తున్నాడు కుర్ర విలన్.అతగాడు రానే వచ్చాడు.రావడంతోనే కుర్ర విలన్ ముఖం మీద బలంగా గుద్దాడు.అతను సైకిళ్ల మీద పడ్డాడు. హీరో ముందుకు వంగాడు.రాయి తీసుకుని కొడతాడేమోనని ప్రేక్షకుడు ఊహించాడు.హీరో చెయ్యి సైకిల్ చెయిన్ మీద బలంగా పడింది.షెడీల్మని ఒక్క ఉదుటున చెయిన్ లాగి, దాన్ని చేతికి చుట్టుకుని, కుర్ర విలన్ గ్యాంగ్‌పై పంచ్‌ల మీద పంచ్‌లు విసిరాడు.అక్కడ విలన్‌తోపాటు కాలేజీ షాకయ్యింది.ఇక్కడ థియేటర్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం షాకయ్యింది.హీరో అంటే ఇలాగే ఉండాలి..సినిమా అంటే ఇలాగే తీయాలి..యాక్షన్ సినిమా అంటే ఇన్నేసి ఫైట్లు ఉండాలి. అని మనవాళ్ళు ఓ బాక్సాఫీస్ పెద్ద బాలశిక్ష రాసి పడేశారు. అలాంటి సంప్రదాయ సినిమాలకి విరుద్ధంగా రూపొందిన చిత్రం ‘శివ’.అప్పటివరకు యాక్షన్ మాత్రమే తెలిసిన తెలుగుతెరపై ఒక్కసారి సర్రున దూసుకొచ్చిన చెయిన్ రియాక్షన్ ‘శివ’.’శివ’ నవతరం సినిమాకు ఒక దిశానిర్దేశం.’శివ’ సెల్యులాయిడ్ చరిత్రలో ఓ సహజావేశం.ఇక అసలు కథలోకి వెళదాం.
అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా పనిచేస్తున్న పెన్మెత్స కృష్ణంరాజుకి ఒకబ్బాయి ఉన్నాడు. పేరు రామ్‌గోపాలవర్మ. విజయవాడలో సివిల్ ఇంజినీరింగ్ చదివి వచ్చాడు. వర్మకి బాగా సినిమా పిచ్చి. అమీర్‌పేట చౌరస్తాకి కూతవేటు దూరంలో బెనర్జీ ట్రావెల్స్ బిల్డింగ్ పక్కనే ‘మూవీ హౌస్’ పేరుతో ఓ వీడియోషాపు కూడా నడిపేవాడు. అద్దెకివ్వడం సంగతి పక్కనపెడితే, లెక్కలేనని ఇంగ్లీషు సినిమాలు చూశాడు.కొడుకు సినిమా మక్కువను గమనించి కృష్ణంరాజు ‘కలెక్టర్గారబ్బాయ్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్పించారు. ఆ తర్వాత ‘రావుగారిల్లు’ సినిమాకి వచ్చాడు వర్మ. దానికి రెడ్డి తరణీరావు దర్శకుడు. నాగండ్ల శివనాగేశ్వరరావు కో -డైరెక్టర్.విచిత్రమైన ఇంగ్లీషు మాట్లాడుతుండేవాడు వర్మ. అతన్నంతా వింతగా చూసేవారు. అలాగే అతణ్ణి ఎవరూ పట్టించుకొనేవారు కాదు. ఇంగ్లీషు కామిక్స్ బుక్స్ ఎక్కువ చదువుతుండేవాడు. అందరూ అతన్ని ‘ఇంగ్లీషు మీడియం’ అని ఎగతాళి చేస్తుండేవారు. ఇవేవీ అతను పట్టించుకునేవాడు కాడు. నాగార్జునకి, అతనికి మంచి దోస్తీ. వెంకట్ అక్కినేని, యార్లగడ్డ సురేంద్ర కూడా అతనితో చనువుగా ఉండేవారు.వర్మ ‘రాత్రి’ పేరుతో ఒక కథ తయారుచేసి వాళ్లకి వినిపించాడు. వాళ్ళు ఆసక్తి కనబరచలేదు. దాంతో తన కాలేజీ సంఘటనతో కొత్త కథ అల్లి నాగార్జునకి చెబితే ‘ఓకే ప్రొసీడ్’ అన్నాడు.’రావుగారిల్లు’ షూటింగ్ చివరిదశలో కో-డైరెక్టర్ శివనాగేశ్వరరావుతో ‘నాగార్జున సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది కో-డైరెక్టర్‌గా రాగలరా’ అనడిగాడు వర్మ. తన దగ్గర అసిస్టెంట్‌గా చేసే కుర్రాడికి అంత త్వరగా డైరెక్షన్ చేసే ఆఫర్ వచ్చినందుకు శివనాగేశ్వరరావు అసూయపడలేదు.మద్రాసులో కస్తూరిరంగన్ రోడ్డులో చోళా హోటల్‌కు ఎదురుగా అన్నపూర్ణా స్టూడియో ఆఫీసులో కథా చర్చలు మొదలయ్యాయి. ‘రావుగారిల్లు’ సమయంలో తనికెళ్ల భరణితో వర్మకు చిన్నపాటి పరిచయం ఉంది. అప్పటికే ‘లేడీస్ టైలర్’, ‘శ్రీకనకమాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్‌ట్రూప్’ సినిమాల ద్వారా హాస్యరచయితగా మంచి పేరు తెచ్చుకున్నాడు భరణి. వర్మ ఆయన్ని పిలిపించుకొని కథ చెప్పాడు. ఫస్ట్‌షాట్ నుండి చివరి షాట్ వరకూ అతను కథ చెప్పిన తీరు చూసి భరణి థ్రిల్ అయిపోయారు. కానీ పెద్ద గొప్పగా అనిపించలేదాయనకి. కె.ఎస్.ఆర్. దాస్ టైప్ సినిమానే అనుకున్నారు. ఈ కథలో పొడుచుకోవడాలు, చంపుకోవడాలు, ఛేజింగులే తప్ప ఒక్క కామెడీ సీన్ లేదు.తనదైన శైలిలో పిచ్చ కామెడీగా స్క్రిప్ట్ రాశారు భరణి. ఒక్క జోక్ కూడా ఉండడానికి వీల్లేదన్నాడు వర్మ. దాంతో రెండో వెర్షన్‌ని అతని భావాలకు తగ్గట్టే రాశారు. అలా ‘శివ’ స్క్రిప్ట్ సిద్ధమైంది.ఈ కథలో హీరో పాత్రకి భవాని, విలన్ పాత్రకి శివ అని పేర్లు పెట్టాడు వర్మ. అయితే నాగార్జునకి ‘శివ’పేరు నచ్చి. దాన్ని హీరోకి పెట్టమన్నారు. లేకుంటే ఈ సినిమా పేరు కాస్తా ‘భవాని’ అయ్యేదేమో!విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకునే సమయంలో వర్మ కాలేజీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాడు. తన కాలేజీ జీవితాన్ని ముడిసరుకుగా పెట్టుకుని శివ కథ తయారు చేసుకున్నారు వర్మ. ‘శివ’లో సంఘటనలన్నీ అత్యధికశాతం సిద్ధార్థ కాలేజీలో జరిగినవే. తన స్నేహితుల పేర్లనే ఇందులో పాత్రలకి పెట్టారు. జె.డి, నరేశ్ ఇలా.. అంతా వర్మ స్నేహ బృందమే.
ఇక తారాగణం ఎంపిక మొదలయ్యింది. నాయికగా అమలను ముందే అనుకున్నారు. నాగార్జున, అమల అప్పటికే ‘ప్రేమయుద్ధం’ సినిమా చేసి ఉన్నారు. విలన్ పాత్రకు వర్మకున్న ఏకైక ఛాయిస్ రఘువరన్. ఏదో తమిళ సినిమాలో రఘువరన్ యాక్షన్ వర్మను అమితంగా ఆకర్షించింది. అందుకే ఆయన్ని ఏరికోరి పెట్టుకున్నారు. ఇందులో భవాని పాత్ర ఒక లివింగ్ కేరక్టర్. బాగా అండర్‌ప్లే చేసి నటించాలి. అందుకే రఘువరన్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ పాత్ర గురించి వర్మ వివరించగానే ఇరవై రోజుల టైమ్ అడిగారు రఘువరన్. ముంబయి వెళ్ళి మాఫియా డాన్లు ఎలా ఉంటారో, వారి మేనరిజమ్స్ స్టడీ చేసి ఆ తరువాత భవాని పాత్ర చేయడానికి అంగీకరించారు. ఆ పాత్ర కోసం అంత కష్టపడ్డారు కాబట్టే ఇప్పటికీ రఘువరన్ తెరపై కనబడగానే మరుక్షణం భవానియే గుర్తుకు వస్తాడు.కాలేజీ స్టూడెంట్స్ పాత్రకు ఎక్కువ మంది కొత్తవాళ్ళనే తీసుకొన్నారు. అన్నపూర్ణా స్టూడియోస్‌లోనే సెలక్షన్స్ జరిగాయి. మధు ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చదువుకొన్న చిన్నా, రామ్‌జగన్ తదితరుల్ని ఎంపిక చేశారు. అలాగే చక్రవర్తిని కూడా. అప్పటికే ఆర్టిస్టులుగా మంచి పేరుతెచ్చుకున్న మురళీమోహన్, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, ‘శుభలేఖ’ సుధాకర్, సాయిచంద్లను కీలకపాత్రలకు తీసుకొన్నారు.రఘువరన్ పక్కన నానాజీ అనే అసిస్టెంట్ పాత్ర కోసం ఇద్దరు ముగ్గురిని అడిగాడు వర్మ. ఒకాయన సెప్టెంబరులో కుదరదు, అక్టోబర్, నవంబర్‌లో.. డిసెంబర్లో చూద్దాంలే అన్నాడు. దాంతో వర్మ కాస్తా భరణిని పిలిచి ‘నానాజీ పాత్ర మీరు వేయండి’ అన్నాడు. ‘నానాజీ పాత్ర నేనా?’ అని నవ్వాడు భరణి. ఏమైతేనేం పాన్ నమిలే ఆ పాత్రను భరణి అద్భుతంగా చేశారు. దాంతో భరణికి మళ్లీ పెన్నుమూత తీయాల్సిన అవసరం లేకుండా పోయింది. నానాజీ పాత్ర వేసినందుకు, డైలాగ్స్ రాసినందుకు తనికెళ్ల భరణికి 35 వేల రూపాయల పారితోషికమిచ్చారు. అప్పట్లో భరణి రచయితగా 25 వేలు పారితోషికం అందుకొనేవారు.’రావుగారిల్లు’ సినిమాకి సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆయన దగ్గర కీరవాణి సహాయకునిగా పనిచేసేవారు. ‘శివ’ సినిమాకి కీరవాణిని సంగీత దర్శకుడిగా తీసుకోవాలని వర్మ ఒక దశలో అనుకున్నారు. ‘దర్శకునిగా నువ్వు కొత్తే కాబట్టి, అనుభవజ్ఞుడైన సంగీత దర్శకుడు ఉండాలి’ అని అందరూ చెప్పడంతో ఇళయరాజా దగ్గరకు వెళ్లారు.ఇందులో మొత్తం అయిదు పాటలున్నాయి. ‘ఆనందో బ్రహ్మ…’ ‘కిస్మి హలో రాంగ్ నెంబర్…’ ‘ఎన్నియల్లో. మల్లియల్లో’ పాటల్ని వేటూరి రాయగా, ‘బోటనీ పాఠముంది…’, ‘సరసాలుచాలు శ్రీవారు’ పాటల్ని సీతారామశాస్త్రి రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యస్. జానకి, చిత్ర, నాగూర్‌బాబు పాటలు పాడారు.1989 సెప్టెంబర్ 20 న అంటే అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు నాడు, ‘శివ’ షూటింగ్ ప్రారంభించాలని ముందే అనుకున్నారు. ఈలోగా నాగార్జున, ఎ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి. అదేమో కథ సిద్ధం కాలేదు. ఇక్కడ వర్మ షాట్ డివిజన్‌తో సహా మొత్తం స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉన్నాడు. దాంతో ‘శివ’ని ముందుకు తీసుకు వచ్చేశారు. ఎందుకైనా మంచిదని తొలుత వీడియోతో కొంత భాగం వినోద్‌బాల, లలిత, ఇంకొక అమ్మాయి మీద షూటింగ్ చేసి చూసుకొని, తన దర్శకత్వ ప్రతిభ మీద ఒక అవగాహనకు వచ్చారు వర్మ.
1989 ఫిబ్రవరి 16న అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభమైంది. ఉదయం పదిన్నర గంటల సమయంలో నాగార్జున, అమలపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. అక్కినేని నాగేశ్వరరావు కెమెరా స్విచాన్ చేయగా, పెన్మెత్స కృష్ణంరాజు తొలిక్లాప్ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు యస్‌యస్ క్రియేషన్స్ బ్యానర్లో వెంకట్ అక్కినేని, యార్లగడ్డ సురేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.’శివ’ షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. మూడు రోజులు షూటింగ్ మాత్రం మద్రాసులో చేశారు. వైజాగ్ బొర్రాగుహల్లో ఒక పాట తీశారు. మిగతా పాటల్ని అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ వేసి తీశారు. హైదరాబాద్ పెద్దమ్మగుడి చౌరస్తాకి దగ్గరలో ఉషాకిరణ్ మూవీస్ వాళ్ల పాత ఆఫీసు ఉండేది. నాగార్జున, అమల బెడ్ రూమ్ సీన్స్ అక్కడ తీసి, సరిగ్గా రాకపోవడంతో సికింద్రాబాద్‌లోని ఉస్మాన్ అలీ హౌస్‌లో మళ్లీ తీశారు. ఈ సినిమా తరువాత ఉస్మాన్ అలీ హౌస్ షూటింగ్స్‌కు బాగా ప్రసిద్ధి గాంచింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు సమీపంలోని కీస్ హైస్కూల్లో కాలేజీ సీన్స్ తీశారు. హైస్కూలు వెనుకవైపు గోడ పగలగొట్టి అక్కడ కొత్తగా గేట్ పెట్టి సినిమా ప్రారంభ సన్నివేశాన్ని తీశారు. ‘శుభలేఖ’ సుధాకర్ డెత్సీన్ని కీసరగుట్టలోను, రామ్‌జగన్ డెత్సీన్ని వెంగళరావునగర్ వీథుల్లోనూ చిత్రీకరించారు. క్లైమాక్స్‌ని సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో తీశారు. అక్కడ లిఫ్ట్సీన్ని మాత్రం ప్రత్యేకంగా మద్రాసులోని వీనస్ స్టూడియోలో చిత్రీకరించారు. వీనస్లోనే సెట్‌వేసి రెయిన్ ఫైట్ తీశారు. సైకిల్ ఛేజ్‌ని సోమాజీగూడాలోను (ప్రస్తుతం ఈ టీవీ ఆఫీసుకు దగ్గర్లో), యశోదా హాస్పిటల్ వెనుకనున్న స్లమ్ ఏరియాలో తీశారు. బస్ఛేజ్ని యూసఫ్‌గూడా మెయిన్ చౌరస్తాలో తీశారు.సినిమా తీస్తున్నప్పుడు రామ్‌గోపాల్‌వర్మ వర్కింగ్ స్టయిల్ యూనిట్ సభ్యులకే కొన్నిసార్లు ఆశ్చర్యంగాను, కొన్నిసార్లు అయోమయంగాను ఉండేది. క్లోజప్ షాట్ల మీద, చిన్న చిన్న డిటైల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడు. ఇండియాలో స్టడీకామ్ కెమెరాల వాడకం అప్పుడే మొదలైంది. తెలుగు చిత్రాల దాకా ఇంకా రాలేదు. ‘శివ’ కోసం స్టడీకామ్ తెప్పించారు వర్మ. మొదట్లో రాజీవ్‌మీనన్ ఆపరేటర్‌గా వచ్చేవాడు. తర్వాత దీన్పాల్ అనే సన్నటి వ్యక్తి వచ్చాడు. కెమెరా తీసుకుని పరుగెత్తలేక పడిపోతూ ఉండేవాడు. చివర్లో రసూల్ చేశాడు.
55 రోజుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. సుమారు 75 లక్షల రూపాయలు ఖర్చయింది. మద్రాసులో రీ -రికార్డింగ్‌కి సన్నాహాలు మొదలుపెట్టే సమయానికి అక్కడి మ్యుజిషియన్స్ సమ్మె మొదలుపెట్టారు. దాంతో డబుల్ పాజిటివ్ తీసుకుని ఇళయరాజా, రామ్‌గోపాల్‌వర్మ ముంబై వెళ్ళారు. రీరికార్డింగ్ అంతా అక్కడే జరిగింది. సౌండ్ ఎఫెక్ట్‌కి దీపన్ ఛటర్జీ అప్పట్లో పెట్టింది పేరు. సింధూరపువ్వు సినిమాలో ఆయన ప్రతిభ చూసి వర్మ ఆయనతో ఏరికోరి సౌండ్ డిజైనింగ్ చేయించారు.రీ-రికార్డింగ్‌కి ముందు డబుల్ పాజిటివ్ చూసి నిర్మాతలు నీరసపడిపోయారు. ఈ సినిమా ఎటుపోతుందో అర్థం కాలేదు. తీరా రీ-రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ జత అయ్యాక ఫైనల్ ప్రింట్ చూసి వాళ్లే థ్రిల్ అయిపోయారు.ఈ సినిమాలో వెంకట్ అక్కినేని కూడా నటించారు. రఘువరన్ దగ్గరకు సూట్‌కేసుతో వచ్చి బేరం మాట్లాడే పాత్ర ఆయనది. ఈయనకు డబ్బింగ్ మాత్రం కో-డైరెక్టర్ శివనాగేశ్వరరావు చెప్పారు. ఈ సినిమాలో రఘువరన్ మొదలుకొని ఎవరి పాత్రలకు వారే డబ్బింగ్ చెప్పుకొన్నారు.సినిమా తీస్తున్నంత కాలం ‘శివ’ అన్న పేరేంటి సెంటిమెంటల్‌గా ఆడదు. వీళ్ళకేమైనా పిచ్చెక్కిందా- లాంటి ఎన్నో కామెంట్లు వినబడేవి! కానీ అక్కినేని నాగార్జున మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతో, ప్రశాంతంగా రామ్‌గోపాల్‌వర్మకి కొండంత అండగా నిలబడ్డారు.
1989 అక్టోబర్ 5న ‘శివ’ సినిమా విడుదలైంది. ఆంధ్రదేశం అంతా అల్లకల్లోలం. పెద్ద సంచలనం. జనం విరగబడి చూశారు. కాలేజీల్లో శివ బ్యాచ్, భవాని బ్యాచ్ అని గ్రూపులేర్పడ్డాయి. సైకిల్ చెయిన్లు బ్లాక్‌లో అమ్ముడయ్యాయి. కాలేజీ కుర్రాళ్ళందరూ సైకిల్ చెయిన్లు పట్టుకుని తిరగటం మొదలుపెట్టారు.’శివ’లాంటి సినిమా తీయడం ఎలా సాధ్యమైందని అందరూ చర్చాగోష్ఠులు పెట్టుకున్నారు. ఆ సంవత్సరం చలనచిత్ర పరిశ్రమకి శివరాత్రే అయింది. చాలామందికి నిద్రపట్టలేదు. నిజంగా వెండితెరపై ‘శివ’ సినిమా శివతాండవమాడేసింది. మూసధోరణికి అలవాటు పడిపోయిన తెలుగు సినిమా నడకనే మార్చేసింది ఈ సినిమా.వర్మ రాకతో తెలుగు సినిమా నరనరంలో యువరక్తం ఉరకలేసింది. అప్పటివరకూ కొత్త కుర్రాళ్ళకి దర్శకత్వం ఇవ్వాలంటే భయపడే తెలుగు నిర్మాతలకి ధైర్యం పెరిగింది. ఎందరో కొత్త దర్శకులకి అవకాశాలు పెరిగాయి.ఈ సినిమా తర్వాత స్టడీకామ్ కెమెరాల వాడకం అధికమైంది. సాండ్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం పెరిగింది.’శివ’ ప్రభావంతో ఎంతో మంది విద్యావంతులు సినిమాల్లో సాంకేతిక నిపుణులుగా ప్రవేశించారు. తెలుగు సినిమా టేకింగ్, మేకింగ్ స్టయిల్ని ఈ సినిమా సమూలంగా మార్చిపారేసింది. ‘శివ’కు ముందు ‘శివ’కు తరువాత తెలుగు సినిమా అని వర్గీకరించేంతగా ప్రభావం చూపింది. కొత్త దర్శకుల్ని ప్రభావితం చేసిన ‘శివ’, పాత దర్శకుల్ని పునరాలోచించుకొనే విధంగా చేసింది.నవ్యత, నాణ్యత, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాల మేళవింపుగా తెలుగు ప్రేక్షకులను తన్మయంలో ముంచిన వెండితెర అద్భుతం ‘శివ’.సెంటిమెంట్స్, మెలోడ్రామాలు, లోయర్‌గ్రేడ్ కామెడీలు, మాస్ మసాలా మూసలతో సాగుతున్న తెలుగు సినిమాకి ఓ కొత్త టర్నింగ్ నిచ్చిన సినిమా ఇది.
కాలేజీ క్యాంపస్‌లు అసాంఘిక శక్తుల అడ్డాలుగా మారిన నేపథ్యాన్ని కథాంశంగా తీసుకుని రామ్‌గోపాల్‌వర్మ అందించిన ఈ ‘శివ’ తెలుగు ప్రేక్షకుల మదిగదిలో నిక్షిప్తమైన రెండున్నర గంటల దృశ్య సంపద.’శివ’లో మౌలికంగా ఉన్న ఉద్విగ్నత మాస్సైకాలజీకి అద్దం పడుతుంది. పాత్రలను చిత్రీకరించిన విధానం వల్ల సినిమా తన కళ్ల ముందు జరిగినట్లుగా ఫీలయ్యారు ప్రేక్షకులు.కథ విషయానికి వస్తే కాలేజీలో కొత్తగా చేరిన శివ సిటీలో తిరుగులేని రౌడీగా పెత్తనం సాగిస్తున్న భవానీ వెన్నులో చలి పుట్టిస్తాడు. తనను మనసారా ప్రేమించిన ఆశాని పెళ్ళి చేసుకుంటాడు శివ. భవానీని శివ ఎలా తుదముట్టించాడన్నది తెరపై ఆసక్తికరంగా చిత్రీకరించారు.ఈనాటి రాజకీయ వాతావరణంలో నడిచే కాలేజీ విద్యార్థుల పోకడలను చాలా సహజంగా ఈ చిత్రంలో ఆవిష్కరించారు. కథనం పోకడలో ఎమోషనల్ బిల్డప్ సందర్భోచితంగా సాగింది. ఎక్కడో బస్టాండ్‌లో సాధారణ కూలీగా బతుకు ప్రారంభించిన ఒక భవాని (రఘువరన్) కొందరు ఆకతాయి వెధవలని కూడగట్టుకుని రౌడీగా ఎదగడం, భవానిని తన రాజకీయ చదరంగంలో పావుగా వాడుకుని మంత్రి పదవులకు ఎగబాకాలని చూసే రాజకీయనాయకుడు మాచిరాజు చివరికి తన పాముకాటుకి తనే బలవ్వడం ఒక పక్కయితే, మరో పక్క సాధారణ విద్యార్థిగా పొరుగూరు నుంచి వచ్చి కళాశాలలో చేరి, గుండె నిబ్బరంతో తోటి విద్యార్థుల మన్ననలు పొందుతూ, బజారు గూండాల ప్రాపకంతో, కళాశాలలోనే గూండాయిజం నడిపే కొందరు విద్యార్థులకు ఎదురొడ్డి నిలిచి హీరోగా ఎదిగిన శివ కథని మన కళ్ళ ముందు జరిగినంత రియల్‌గా ఆవిష్కరించడంలో రామ్‌గోపాల్‌వర్మ నూటికి నూరుపాళ్ళు సక్సెసయ్యారు.’శివ’లో దృశ్యానికి ఎంత పేరొచ్చిందో, శబ్దానికి అంత పేరొచ్చింది. సౌండ్ ఎఫెక్ట్స్‌కి ఒక స్పెషల్ క్రేజ్‌ని తీసుకువచ్చిన సినిమా ఇదే.ఈ సినిమా విడుదల రోజు నాగార్జున తమిళనాడులోని అంబా సముద్రం అనే ప్రాంతంలో ‘నేటి సిద్ధార్థ’ షూటింగ్లో ఉన్నారు. మార్నింగ్ షో అవగానే ఒకటే ఫోన్లు.. అభినందనల వర్షం. నాగార్జున నటించిన 17వ చిత్రం ఇది. నాగార్జున అంతకు ముందు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే ఈ సినిమా మరొక ఎత్తు. సరికొత్త నాగార్జున కనిపిస్తాడు. ‘శివ’గా సహజంగా నటించాడు. భావోద్రేక ప్రదర్శనల్లో కృత్రిమత్వం లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ సినిమాతో నాగార్జున అగ్ర కథానాయకుల జాబితాలో చేరిపోయాడు.తెలుగు సినిమా రామ్‌గోపాల్ వర్మ ముందు, తర్వాత అన్నట్టుగా చారిత్రకమైన ట్రెండ్‌ని సృష్టించడానికి అంత కాన్ఫిడెన్స్, ఎనర్జీ ఎక్కడ నుంచి వచ్చింది అన్న ప్రశ్నకు రామ్‌గోపాల్‌వర్మ, ”ఆ కాన్ఫిడెన్స్, ఎనర్జీ నాది కాదు. నాగార్జునది. ఆ రోజు నాగార్జునే నన్ను నమ్మి ఉండకపోతే ఇదంతా ఉండేది కాదు. నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో తిరిగినదీ లేదు. అయినా నన్ను నమ్మి నాలోని ఫైర్‌ని కనిపెట్టి ఆ ఎనర్జీ ఇచ్చింది నిశ్చయంగా నాగార్జునే” అని చెప్తారు.ఈ చిత్రం 22 కేంద్రాల్లో వందరోజులాడింది. 5 కేంద్రాల్లో 155 రోజులు ప్రదర్శితమైంది. ‘శివ’ రికార్డులను సృష్టించడంతోపాటు, అవార్డుల్ని కూడా చేజిక్కించుకుంది. ఉత్తమ దర్శకుడుగాను, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగాను రామ్‌గోపాల్‌వర్మ రెండు నందులను అందుకొన్నారు. అలాగే ఈ సినిమాకి ఎపి సినీగోయర్, భరతముని, కళాసాగర్, వంశీ- బర్కిలీ, సినిమా ఎక్స్‌ప్రెస్, ఫిలింఫేర్ అవార్డులు కూడా లభించాయి.1990లో కలకత్తాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జనవరి 19న ఉదయం 8.30 గంటలకు ఎంపౖౖెర్ థియేటర్లో ‘శివ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ ఏడాది దక్షిణాది నుండి ఎంపికైన నాలుగు చిత్రాల్లో తెలుగు చిత్రం ఇదొక్కటే.ఈ చిత్రాన్ని ‘ఉదయం’ పేరుతో తమిళంలోకి అనువదించారు. 1990 జనవరి 12న తమిళనాట 24 కేంద్రాల్లో విడుదలై అక్కడ కూడా ఘన విజయం సాధించింది. హిందీలో కూడా ఈ సినిమా శివమెత్తింది. నాగార్జునకు ఇదే తొలి హిందీ చిత్రం. నాగార్జున వెనుక స్టూడెంట్ గ్యాంగ్‌లో ఒకరుగా కనిపించిన ఒక కుర్రాడు తరువాత ‘బద్రి’ సినిమాతో దర్శకుడై, ‘పోకిరి’తో తెలుగు సినిమా రికార్డుల చరిత్రను తిరగరాశారు. అతనే పూరీ జగన్నాథ్.ఈ సినిమా మీద రామ్‌గోపాల్‌వర్మకు మక్కువ తీరలేదు. మళ్లీ నాగార్జునతోనే రీమేక్ చేయాలని ఒక దశలో అనుకొన్నారు. చివరకు మొన్నీ మధ్య హిందీలో ‘శివ-2006’ పేరుతో తీసి తెలుగులోకి కూడా అనువదించారు. కాలేజీ నేపథ్యాన్ని, పోలీస్ వ్యవస్థ నేపథ్యంగా మార్చడం ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశపరిచింది.దర్శకునికి హీరో ఇమేజ్ తీసుకువచ్చిన ఈ సినిమా గురించి డా. దాసరినారాయణరావు మాటల్లో చెప్పాలంటే ”శివ టెక్నికల్ సినిమా కాదు. గ్రేట్ సినేరియో. వండర్ఫుల్ స్క్రీన్‌ప్లే. వండర్ఫుల్ ట్రీట్మెంట్, ఒక అమాయకుడైన విద్యార్థి బయోగ్రఫీ. ఇది మామూలు సినిమా కాదు. శివ అనేది ఒక అద్భుతమైన సినిమా.”
తెరపై :
శివకుమార్ – నాగార్జున, ఆశ – అమల, భవాని – రఘువరన్, ఇన్స్పెక్టర్ వెంకట్ – సాయిచంద్, జేడీ – చక్రవర్తి, మల్లిక్ – ‘శుభలేఖ’ సుధాకర్, ప్రిన్సిపాల్ – భానుప్రకాశ్, నానాజీ – తనికెళ్ల భరణి, యాదగిరి – ఉత్తేజ్, శరత్ – మురళీమోహన్, చిన్నా – జితేంద్ర (చిన్నా), నరేశ్ – రామ్‌జగన్, మాచిరాజు – కోట శ్రీనివాసరావు, విశ్వనాథం – గొల్లపూడి మారుతీరావు, గణేశ్ – విశ్వనాథ్, కీర్తి – బేబీ సుష్మ, మల్లి నానమ్మ – నిర్మలమ్మ.
తెర వెనుక :
చిత్ర నిర్మాణ సంస్థ: ఎస్.ఎస్. క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, సంభాషణలు: తనికెళ్ల భరణి, సంగీతం: ఇళయరాజా, పాటలు: వేటూరి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీ: దీపక్ ఛటర్జీ, ఎడిటర్: సత్తిబాబు, నృత్యాలు: సుందరం, ఆర్ట్: తోట తరణి, నేపథ్య గానం: ఎస్. జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, నాగూర్‌బాబు, అసోసియేట్ డైరెక్టర్: నాగండ్ల శివనాగేశ్వరరావు, కో-డైరెక్టర్: కృష్ణవంశీ, అసిస్టెంట్ డైరెక్టర్స్: ఉత్తేజ్, ఫణి, ఆపరేటివ్ కెమేరామన్: శ్రీనివాసరెడ్డి, విజయకుమార్, స్టడీకామ్ ఆపరేటర్ : రసూల్, పబ్లిసిటీ: ఈశ్వర్, ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి, నిర్మాతలు: యార్లగడ్డ సురేంద్ర, వెంకట్ అక్కినేని, కథ- స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ.
విడుదల: 5-10-1989,
నిర్మాణ వ్యయం: సుమారు 85 లక్షల రూపాయలు,
నిర్మాణ ప్రాంతాలు: హైదరాబాద్‌లోని కీస్ హైస్కూలు, కీసరగుట్ట, వెంగళరావు నగర్, సోమాజిగూడ, యూసఫ్‌గూడ, అన్నపూర్ణ స్టూడియో, సికింద్రాబాద్‌లోని ఉస్మాన్ అలీహౌస్, స్వప్నలోక్ కాంప్లెక్స్, వైజాగ్ సమీపంలోని బొర్రా గుహలు, మద్రాసులోని వీనస్ స్టూడియో,
నిర్మాణ సమయం: 55 రోజులు.
కథ ఏమిటంటే..
బస్‌స్టాండులో సాధారణ కూలీ అయిన భవానీ రాజకీయ నాయకుడు మాచిరాజు ప్రాపకంతో ఆ సిటీలోనే పెద్ద రౌడీగా ఎదుగుతాడు. అదే సిటీలోని కాలేజీలో చేరతాడు శివ. చాలా అమాయకంగా నెమ్మదస్తుడిలా కనిపించే శివ ఓ సందర్భంలో తన క్లాస్మేట్స్ని కొట్టడానికొచ్చిన స్టూడెంట్ లీడర్ జేడిని ఎటాక్ చేస్తాడు. దాంతో కాలేజీలో ఒక్కసారిగా శివ ఇమేజ్ పెరిగిపోతుంది. దాంతో ఉడికిపోయిన జేడీ, భవానీని ఆశ్రయిస్తాడు. భవానీ మనుషుల్ని కూడా శివ చితక్కొడతాడు. తన స్నేహితుడైన మల్లిక్‌ని భవానీ మనుషులు దారుణంగా హత్య చేయడంతో శివ డైరెక్ట్‌గా భవానీపైనే తిరగబడతాడు. క్లాస్మేట్ అయిన ఆశను ప్రేమించి పెళ్లాడతాడు. మొదట్లో శివ హీరోయిజాన్ని చూసి ముచ్చటపడ్డ ఆశ, పెళ్లయ్యాక ఈ గొడవలకు దూరంగా ఉందామని హితబోధ చేస్తుంది. కానీ శివ భవానీపై పోరు ఆపడు. ఒక్కొక్క స్టెప్ వేస్తూ భవానీని ఎదురుదెబ్బ తీస్తాడు. చివరకు భవానీని చంపి ఆ సిటీని గుండాయిజం బాధనుండి బంధవిముక్తం చేస్తాడు.
—————————————-
“ఓ గొప్ప పని చేశానని ఇప్పటికీ సంబరపడుతున్నా!”
-అక్కినేని నాగార్జున
“నా జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. అందుకు చాలా బాధపడ్డాను. అయితే ‘శివ’ సినిమా తీసి ఓ గొప్ప పని చేశానని ఇప్పటికీ సంబరపడుతున్నాను. ‘శివ’ ఆకాశం నుంచే ఊడిపడ్డాడు. ఆకాశంలోని నక్షత్రాలే ‘శివ’ను కిందకి రాల్చాయని నమ్ముతున్నాను. అసలు ‘శివ’కు ముందు రాము హారర్ కథ చెప్పాడు. మనవాళ్లకవి నచ్చవు. వేరే కథ చెప్పమన్నాను. అప్పుడే ‘శివ’ పుట్టింది. అప్పటివరకూ రకరకాల డైరెక్టర్ల ఆలోచనల ప్రకారం తెరపై కనిపించాను. అలానే కాకుండా ఇంకేదో కొత్తగా కనిపిస్తాననని రాము కథ వినగానే అనిపించింది. ‘శివ’ను డిజిలైజేషన్ చేశాం. త్వరలోనే మీరు డిజిటల్ ‘శివ’ను కూడా చూస్తారు”.
“ఆ కాన్ఫిడెన్స్, ఎనర్జీ నాది కాదు”- రామ్‌గోపాల్‌వర్మ
ఈ సినిమాకి మీ ఇన్సిపిరేషన్ ఏమిటి? ఇది మీరు చూసిన జీవితం నుంచి వచ్చిందా?నేను విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో చాలా గ్యాంగ్ ఫైట్లు జరుగటం చూశాను. ఆ కాలేజీ పాలిటిక్స్, ఆ గొడవల్లో నేనుకూడా పాల్గొనేవాణ్ణి. కాలేజీ రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించాను. ఎవరినీ కొట్టలేదుగానీ, రౌడీగా మంచి రెప్యుటనేషన్ వుండేది (నవ్వుతూ) నా తెలివితేటలతో చాలా డేంజరస్ రౌడీగా భయపెట్టాను. ఆ టైమ్‌లో గూండా ఎలిమెంట్స్ మీద చాలా నాలెడ్జి సంపాదించాను. రౌడీలు, వాళ్ల బాడీ లాంగ్వేజీలు, ఇంట్రెస్ట్‌లు ఇవన్నీ బాగా గమనించాను. స్టూడెంట్లు ఎందుకు ఇలాంటివాటికి ఆకర్షితులవుతారో తెలిసింది.తెలుగు సినిమా రామ్‌గోపాల్‌వర్మ ముందు, వర్మ తర్వాత అన్నట్టుగా చారిత్రకమైన ట్రెండ్‌ని సృష్టించారు మీరు. అంత కాన్ఫిడెన్స్ అంత ఎనర్జీ ఎక్కడ నుంచి వచ్చింది?ఆ కాన్ఫిడెన్స్, ఎనర్జీనాది కాదు. నాగార్జునది. ఆ రోజు నాగార్జునే నన్ను నమ్మి ఉండకపోతే ఇదంతా ఉండేది కాదు. నేను ఎవరిదగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. ఎక్కువరోజులు ఇండస్ట్రీలో తిరిగిందీ లేదు. అయినా నన్ను నమ్మి నాలోని ఫైర్‌ని కనిపెట్టి ఆ ఎనర్జీ ఇచ్చింది నిశ్చయంగా నాగార్జునే.కొంపదీసి ‘శివ’ మీరేనా?(నవ్వేస్తూ) శివకున్నంత బలం నాకు లేదండీ. హీరో పాత్రను నేను ఇన్వెంట్ చేయలేదు. చిన్నప్పట్నుంచి చూస్తున్నాం. అలాంటి ఓ ఐడిలిస్టిక్ క్యారెక్టర్ని మన సహజమైన వాతావరణంలో నిలబెట్టినప్పుడు అక్కడి వాతావరణంలోనే నాటకీయత మరీ పెరుగుతుంది. ‘శివ’ పాత్ర ఆదర్శవంతమైనది. అయితే ‘శివ’ చుట్టూ ఉండే పాత్రలన్నీ జీవితంలో ఎక్కడో అక్కడ మనం చూసినవే. ఓ హీరో పాత్ర చుట్టూ అల్లిన సహజపాత్రల సంగమం వల్ల వచ్చిన డ్రామాయే ‘శివ’ సక్సెస్‌కు కారణం అయింది. ‘శివ’లోని అన్ని పాత్రల పేర్లు నరేష్, జె.డి., మొదలైనవి ఒరిజినల్‌గా నా కాలేజీలో వున్నవాళ్ల పేర్లే. అంతా నా ఫ్రెండ్ సర్కిలే. ‘శివ’ మాత్రమే సృష్టించిన పాత్ర.నిజానికి ‘శివ’ ఫస్ట్వెర్షన్లో ‘భవానీ’ పేరును ‘శివ’ అని పెట్టాను. ఓ రోజు నాగార్జున ‘శివ’ పేరు చాలా బాగుంది. అది నాకివ్వు అన్నాడు. అలా ఆ పేరు వచ్చింది. ఇక భవానీ పాత్రకు ఆ పేరు ఎందుకు పెట్టానంటే అలాంటి ఓ మనిషి పేరు ఆ ఊళ్లోనే చూశాను. (ఓ ఆడదాని పేరున్న వయొలెంట్ రెప్యుటేషన్ వున్న నాయకుడు విజయవాడలో) చాలా ఎట్రాక్ట్ అయ్యాను ఆ వెరైటీకి. అందుకే ‘భవానీ’ పేరు పెట్టాను.సైకిల్ ‘చైన్’ను ఆయుధంగా మార్చిన నేపథ్యం? అలా ఎవరన్నా లాగారా?నేనూ ఎక్కడో విన్నదే అది. నిజానికి సైకిల్ చైను చూడడానికి డెలికేట్‌గా వున్నా దాన్ని తెంపడం ఇంపాజబుల్. ఈ సీను నెరేట్ చేసి చెప్పిన్పుడు అక్కినేని వెంకట్ చాలా థ్రిల్ అయ్యాడు. రియలిస్టిక్‌గా తీయడం అదీ అందరికీ తెలిసిన చైన్ కావడంతో ఆ సీన్స్ బాగా పండాయి.
By pulaga chinnarayana