వీ6 చానల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న “తీన్మార్ న్యూస్” ప్రోగ్రాంను దాటి తీరాలన్న లక్ష్యంతో.. టీవీ9 ప్రారంభించిన “ఇస్మార్ట్ న్యూస్” చతికిలపడింది. “తీన్మార్ న్యూస్”కి పిల్లర్ లాంటి.. బిత్తిరి సత్తిని తీసుకొచ్చి “ఇస్మార్ట్ న్యూస్” ని డిజైన్ చేసినా…ప్రేక్షకుల నుంచి కనీస ఆదరణ పొందలేకపోతోంది. గత ఏడు వారాల్లో.. ఇస్మార్ట్ న్యూస్ ఎప్పుడు కూడా.. కనీసం 0.5 రేటింగ్‌ను పొందలేకపోయింది. అదే సమయంలో.. తీన్మార్ న్యూస్ సగటున 1.2 పర్సంట్ రేటింగ్ సాధించింది. ప్రతీ వారం.. ఇస్మార్ట్ న్యూస్ కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ప్రేక్షకులు తీన్మార్ న్యూస్ ను చూస్తున్నారు. వారాలు గడిచే కొద్ది.. బిత్తిరి సత్తి కోసమైనా… ప్రేక్షకులు టీవీ9కి వస్తారని పెట్టుకున్న గల్లంతయిపోతున్నాయి.
టీవీ9 యాజమాన్యం చేతులు మారిన తర్వాత.. రవిప్రకాష్ ముద్రను చెరిపేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా.. చిత్రవిచిత్రమైన పోగ్రామలు, న్యూస్ కవరేజీ స్టైలు మార్చారు. ఈ క్రమంలో తెలంగాణలో ప్రేక్షకుల ఆదరణ పొందాలంటే… తీన్మార్ న్యూస్ లాంటి బెంచ్ మార్క్ ప్రోగ్రాం ఉండాలని అనుకున్నారు. కావాల్సినంత ఆర్థిక దన్ను ఉంది కాబట్టి.. వెంటనే భారీ ఆఫర్లు ఇచ్చి బిత్తిరి సత్తి సహా కొంత మందిని చేర్చుకున్నారు. ప్రోగ్రామ్స్‌ను మొదలు పెట్టారు. కానీ ఒక్కటంటే.. ఒక్కటీ క్లిక్ కావడం లేదు. పైగా.. ఈ ఫెయిల్యూర్లు ఇతర ప్రోగ్రామ్స్‌కు కొత్త క్రేజ్ తీసుకు వస్తున్నాయి. ఇస్మార్ట్ న్యూస్ ఫెయిల్యూర్‌తో.. తీన్మార్ న్యూస్ మరింత మెరుగుపడినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఆ ప్రోగ్రాం బిత్తిరి సత్తి వల్ల నిలబడలేదని.. ఆ చానల్ యాజమాన్యానికి నిరూపించుకునే అవకాశం దక్కినట్లయింది.
కొత్త యాజమాన్యం టీవీ9 తన సహజసిద్ధమైన గుణాన్ని వేగంగా కోల్పోతోంది. యాజమాన్యం అవసరాలకు అనుగుణంగా.. రాజకీయంగా పక్షపాతంగా వార్తలు ప్రసారాలు చేయాల్సి వస్తూండటమే దీనికి కారణం. పొలిటికల్ గా దెబ్బతిన్నా.. ప్రోగ్రామింగ్ ద్వారా ప్రేక్షకులను టీవీ9తో అంటి పెట్టుకుని ఉండేలా చేద్దామనుకుంటున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. టీవీ9 అంటే ప్రేక్షకులు ఆశించి ఒకటి.. ఇప్పుడు.. టీవీ9 ప్రేక్షకులకు ఇస్తున్నది ఒకటి. అందుకే.. ప్రేక్షాకాదరణలో తేడా కనిపిస్తోంది. ఇవి టీవీ9కు ప్రమాద ఘంటికలే..!